విస్మయం: మోదీ భార్య కోసం కారు డోర్‌ తెరిచి..!

విస్మయం: మోదీ భార్య కోసం కారు డోర్‌ తెరిచి..! - Sakshi


డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడైన తర్వాత వైట్‌హౌస్‌లో విందు స్వీకరించిన మొదటి విదేశీ నేత ప్రధాని నరేంద్రమోదీ. ఇరుదేశాల స్నేహబంధాన్ని మరింత ముందుకుతీసుకెళ్లే లక్ష్యంతో అమెరికాకు వచ్చిన ప్రధాని మోదీ.. అధ్యక్షుడు ట్రంప్‌తో ఏకాంతంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి తమ అనుబంధాన్ని చాటుకున్నారు. ఈ మీడియా సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ ట్రంప్‌ కుటుంబంతో విందు ఆరగించేందుకు వైట్‌హౌస్‌ వెళ్లారు. అక్కడ అధ్యక్షుడు ట్రంప్‌, ఆయన భార్య, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ మోదీని సాదరంగా ఆహ్వానం పలికారు.



అయితే, ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. వైట్‌హౌస్‌ వద్ద మెరిన్‌ సెంట్రీ గార్డులు ప్రధాని మోదీ కారు రాగానే తమ సంప్రదాయక విధులు నిర్వహించారు. ఇరువైపులా నిలుచున్న వారు.. మోదీ కారు రాగానే సెల్యూట్‌ చేశారు. ఆ తర్వాత కారు సమీపానికి వెళ్లి డోర్లు పట్టుకొని.. (అంకెలు లెక్కిస్తూ) కాసేపు నిలుచుకున్నారు. ఆ తర్వాత డోర్లు తెరిచేందుకు ప్రయత్నించారు. ప్రధాని కారులో కుడివైపు కూర్చున్నారు. సహజంగా ఎడమవైపు నాయకుల సతీమణులు కూర్చుంటారు. కుడివైపు డోర్‌ తీయగానే ప్రధాని మోదీ దిగిపోయారు. అటువైపు గార్డు మాత్రం ఎడమ డోర్‌ తీయడానికి కొంతసేపు కష్టపడ్డాడు. ఆ తర్వాత బలవంతంగా డోర్‌ తీశాడు. ఎడమవైపు నుంచి ఎవరు దిగకపోవడంతో అతను కొంత బిత్తరపోయినట్టు కనిపించాడు.



టీవీలలో ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు వెంటనే పోస్టులు పెట్టారు. ప్రధాని నరేంద్రమోదీ తన భార్యతో కలిసి జీవించడం లేదు. విదేశీ పర్యటనలకు ఆయన ఒంటరిగానే వెళుతారు. ఈ విషయం అమెరికాకు తెలియదా? ఎందుకు ఇలా రెండువైపులా డోర్లు తీసే ఏర్పాట్లు చేశారు? అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ విషయమై కొందరు నెటిజన్లు సెటైర్లు కూడా వేస్తున్నారు. అయితే, ఇలా గార్డులు రెండువైపులా డోర్లు తీయడం లాంఛనప్రాయమైన చర్య అయి ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోదీ వైట్‌హౌస్‌ నుంచి వెళ్లేటప్పుడు కూడా గార్డులు రెండువైపులా కారు డోర్లు తీసి నిలబడ్డటాన్ని వారు గుర్తుచేస్తున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top