జనగామ జిల్లా కోసం యువకుడి ఆత్మహత్య

జనగామ జిల్లా కోసం యువకుడి ఆత్మహత్య - Sakshi


జిల్లాల్లో ‘కొత్త’ చిచ్చు

- కరీంనగర్‌లో ఆందోళనలు

- గద్వాలలో కేసీఆర్‌కు పిండప్రదానం

 

 సాక్షి నెట్‌వర్క్: జనగామ జిల్లా రాదేమోననే బెంగతో బాల్‌రాజు(28) అనే ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రం ఇందిరానగర్‌కు చెందిన కొన్నె కిష్టయ్య-ఎల్లమ్మ కుమారుడు బాల్‌రాజు భవన నిర్మాణ కార్మికుడు. పని కోసం నిత్యం జనగామకు వస్తూ.. జిల్లా కోసం జరిగే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. ప్రభుత్వం సోమవారం ప్రకటించిన జిల్లాల ముసాయిదాలో జనగామ పేరు లేకపోవడంతో కుమిలిపోయాడు. ‘అన్నా.. జనగామ జిల్లా వస్తదంటవా.. ఆమరణ దీక్ష చేసే నాయకులు చనిపోతే ఎలా..’ అంటూ కనిపించిన ప్రతి ఒక్కరినీ అడిగేవాడని స్థానికులు చెబుతున్నారు.



మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలరాజు ఉరి వేసుకున్నాడు. కొద్దిసేపటికి ఇంటికొచ్చిన తల్లిదండ్రులు దూలానికి వేలాడుతున్న బాల్‌రాజును చూసి బోరున విలపించారు. ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించారు. అప్పటికే బాల్‌రాజు మృతి చెందాడు. మృతునికి ఏడాది వయస్సుగల కుమారుడు ఉన్నాడు. భార్య రాఖీ పండుగ కోసం పుట్టింటికి వెళ్లింది.  బాల్‌రాజు ఆత్మహత్య చేసుకున్నాడనే సమాచారం అందుకున్న జిల్లా ఉద్యమకారులు, రాజకీయ పార్టీల నాయకులు బచ్చన్నపేటకు వచ్చి సంతాపం ప్రకటించారు.



 కరీంనగర్‌లో..

 కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని, హుస్నాబాద్, కోహెడను సిద్దిపేటలో కలపొద్దని, కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని కోరుతూ మంగళవారం ఆందోళనలు కొనసాగాయి. సిరిసిల్ల జిల్లా సాధనసమితి, జేఏసీ ఆధ్వర్యంలో మహాపాదయూత్ర నిర్వహించారు. ముస్తాబాద్ మండలం గూడెంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు రహదారిపై బైఠారుుంచారు. ఇదే మండలం ఆవునూరు గ్రామస్తులు రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. గంభీరావుపేట మండలంలో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేశారు. బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు బట్టు ప్రవీణ్ వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపాడు. అలాగే, హుస్నాబాద్, కోహెడను సిద్దిపేటలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం హుస్నాబాద్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నల్ల జెండాలతో విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అఖిలపక్ష, విద్యార్థి సంఘాల నాయకులు ఎమ్మెల్యే సతీష్‌కుమార్, ఎంపీ వినోద్‌కుమార్ దిష్టి బొమ్మలను దహనం చేయడానికి యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కోరుట్లను రెవెన్యూ డివిజన్‌గా చేయాలని ఆందోళనలు కొనసాగాయి. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు.   



 జనగామ జిల్లా కోసం ఆమరణ దీక్ష

 వరంగల్ జిల్లాలోని జనగామను జిల్లా చేయాలని కోరు తూ జనగామ జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి, డాక్టర్ లక్షీ్ష్మనారాయణ నాయక్‌తో పాటు మరో 10 మంది మంగళవారం ఆమరణ దీక్ష చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి దీక్షలను ప్రారంభించారు. బీజేపీ నేత మార్తినేని ధర్మారావు సంఘీభావం తెలిపారు. డీఎస్పీ పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బలగాలు మోహరించారుు.



 కేసీఆర్‌కు పిండ ప్రదానం

 కొత్త జిల్లాల పునర్విభజన ముసాయిదా నోటిఫికేషన్‌లో మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాలను విస్మరించడం పట్ల అఖిలపక్ష నాయకులు మండిపడ్డారు. నడిగడ్డ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా కొత్త జిల్లాల ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ కేసీఆర్ చిత్రపటాన్ని ఉంచి పిండ ప్రదానం చేసి కృష్ణానదిలో వదిలారు. నడిగడ్డ ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా వనపర్తిని జిల్లా చేయడంతో తాము నిరసన తెలుపుతున్నామని అఖిలపక్షం నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.



 గద్వాల జిల్లా కోసం పోరు: డీకే అరుణ

 పాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేస్తున్నామని చెబుతున్న సీఎం.. తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. విస్తీర్ణంలో జనాభా పరంగా రాష్ట్రంలోనే పెద్దదిగా ఉన్న మహబూబ్‌నగర్‌ను నాలుగు జిల్లాలు చేయడం వల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమిటన్నారు. గద్వాలతో పాటు నారాయణపేటకు తీరని అన్యాయం జరిగిందని, షాద్‌నగర్‌ను మహబూబ్‌నగర్ నుంచి విడగొట్టడం ఎవరి కోసమని ఆమె ప్రశ్నించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top