అతన్ని త్వరగా ఔట్‌ చేయడం వల్లే..!

అతన్ని త్వరగా ఔట్‌ చేయడం వల్లే..!


సిరీస్‌ నిలబడాలంటే చావో-రేవో తేల్చుకోవాల్సిన కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ సత్తా చాటింది. 261 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కివీస్‌ బౌలర్లు సఫలం అయ్యారు.  స్టార్‌ బ్యాట్స్‌మెన్‌తో కూడిన భారత లైనప్‌ను 241 పరుగులకే నిలువరించి..  19 పరుగుల తేడాతో గెలుపును సొంతం చేసుకున్నారు. సిరీస్‌ 2-2తో సమం చేసి.. చివరిదైనా ఐదో వన్డేలో క్లైమాక్స్‌కు తెరతీశారు.



నిజానికి రాంచీలో జరిగిన నాలుగో వన్డేలో భారత జట్టు మొదట్లో నిలకడగా ఆడింది. ఓపెనర్‌ రహానే 57 పరుగులతో జట్టును లక్ష్యసాధన దిశగా నడిపించే ప్రయత్నం చేశాడు. అతడు సెకండ్‌ వికెట్‌గా వచ్చిన కోహ్లి (45)తో కలిసి 79 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. ఆ తర్వాత ధోనీ-రహానే జోడీ కూడా నిలదొక్కుకునే ప్రయత్నం చేసింది, 11 పరుగులు చేసి ధోనీ ఔటవ్వడం.. ఆ తర్వాత 39 పరుగులకే ఐదు వికెట్లు చకచకా పడటంతో టీమిండియా పని అయిపోయింది. చివర్లో టెయిల్‌ ఎండర్లు పోరాటపటిమ చూపినా పరాజయం తప్పలేదు.



అయితే.. న్యూజిలాండ్‌ గెలుపులో కోహ్లినే త్వరగా ఔట్‌ చేయడమే అత్యంత కీలక పరిణామమని కివీస్‌ బ్యాట్స్‌మన్‌ మార్టిన్‌ గప్టిల్‌ అభిప్రాయపడ్డాడు. 84 బంతుల్లో 72 పరుగులు చేసి కివీస్‌ ఇన్నింగ్స్ కు వెన్నెముకగా నిలిచిన అతడికి 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' లభించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ 45 పరుగుల వద్ద కోహ్లిని ఔట్‌ చేయడం తమకు ఆనందాన్నిచ్చిందని చెప్పాడు. 'విరాట్‌ క్లాస్‌ ఆటగాడు. అతన్ని త్వరగా ఔట్‌ చేయడం ఆనందమే కదా’ అని అన్నాడు.



మాస్టర్‌ ఛేజర్‌గా పేరొందిన డ్యాషింగ్‌ బాట్స్‌మన్‌ కోహ్లి ఇటీవల టీమిండియాకు లక్ష్యసాధనలో అద్భుత విజయాలు అందించిన సంగతి తెలిసిందే. మొహాలీలో జరిగిన మూడో వన్డేలో అజేయంగా 154 పరుగులు చేసిన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ధర్మశాలలో జరిగిన మొదటి వన్డేలో 85 పరుగులు చేసి కివీస్‌ జట్టుకు విజయాన్ని దూరం చేశాడు. కాబట్టి ఈసారి అతన్ని త్వరగా ఔట్‌ చేయడం వల్లే తమకు విజయం దక్కిందని కివీస్‌ జట్టు ఆనందపడుతోంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top