ముష్కరులు పాక్ నుంచే వచ్చారు

ముష్కరులు పాక్ నుంచే వచ్చారు


రావి నది మీదుగా భారత్‌లోకి ఉగ్రవాదులు

15 కి.మీ. రోడ్డుపై దర్జాగా నడుచుకుంటూ వచ్చారు


 

గురుదాస్‌పూర్/న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఉగ్రదాడి చేసి ఏడుగురిని బలితీసుకున్న ముగ్గురు అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచే వచ్చారని భద్రతా సంస్థలు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించాయి. జూలై 26-27లలో ముగ్గురు సాయుధులైన టైస్టులు రావి నదిని దాటుకుని  అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరగా ఉన్న పఠాన్‌కోట్‌లోని బమియాల్ గ్రామం మీదుగా ఆదివారం రాత్రి వారు దేశంలోకి చొరబడినట్లు వెల్లడైంది. ఉగ్రవాదులు ఉపయోగించిన రెండు జీపీఎస్ పరికరాలను విశ్లేషించగా ఈ ముగ్గురు సాయుధులు రోడ్డుపై నడుస్తూ వచ్చినట్లు తేలింది. ఈ జీపీఎస్ పరికరాల్లో వాళ్లు ప్రయాణించాల్సిన మార్గాలు.. ఛేదించాల్సిన లక్ష్యాలు కూడా స్పష్టంగా వెల్లడైనట్లు తెలుస్తోంది. మరింత స్పష్టత కోసం వీటిని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపించారు. టైస్టులు రావి నదిని దాటి బామియాల్ గ్రామంలో ప్రవేశించిన ప్రాంతంలో భద్రత పటిష్టంగా లేదని సైనిక వర్గాలు తెలిపాయి.



అంతేకాకుండా అమృత్‌సర్-జమ్ము హైవేపై వారు నడుచుకుంటూ రావటం గమనార్హం. పంజాబ్ పోలీస్ చీఫ్ సుమేధ్‌సింగ్ సైనీ చెప్పిన వివరాల ప్రకారం టైస్టులు అంతర్జాతీయ సరిహద్దును ఆనుకుని ఉన్న ధుస్సీ బంధ్(రావి నది)ని చొరబాటుకు ఎంచుకున్నారు. సరిహద్దులోకి ప్రవేశించగానే అక్కడి రైల్వే ట్రాక్‌పై బాంబులు అమర్చి దీనానగర్‌కు చేరుకున్నారు. భారత్‌లోకి ప్రవేశించిన తరువాత 15 కిలోమీటర్లు నడుచుకుంటే వచ్చారు. దీనానగర్ చేరుకున్నాక ఒక పౌరుడి దగ్గరి నుంచి కారు దొంగిలించి, ఆ కారులోనే దీనానగర్ పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించారు. జీపీఎస్ పరికరాల విశ్లేషణ ప్రకారం ఉగ్రవాదులు దీనానగర్ పోలీస్ స్టేషన్‌తో పాటు, రైల్వే ట్రాక్, ఎస్‌ఎస్‌పీ, డిప్యూటీ కమిషనర్, గుర్‌దాస్‌పూర్‌లోని ఆర్మీ యూనిట్లను లక్ష్యంగా చేసుకున్నారు. ఒక జీపీఎస్ పరికరంలో తలవండీ పాయింట్, పర్మానంద్ గ్రామం, దీనానగర్‌లు టార్గెట్లుగా కనిపిస్తే, మరో జీపీఎస్ పరికరం గురుదాస్‌పూర్ సివిల్ లైన్స్‌ను టార్గెట్‌గా చూపించిందని సైనీ తెలిపారు. ఉగ్రవాదుల నుంచి మొత్తం 11 ఉపయోగించని బాంబులను స్వాధీనం చేసుకుని వాటిలో అయిదింటిని నిర్వీర్యం చేసినట్లు సైనీ వివరించారు. మూడు ఏకే-47 తుపాకులు, 17 మ్యాగజైన్‌లు, 55 క్యాటరిడ్జ్‌లు, ఒక రాకెట్ లాంచర్, మూడు చేతి గ్రెనేడ్‌లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌లు, రాత్రి కనిపించే పరికరం, 200 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని సైనీ తెలిపారు.  



ఉగ్రవాదులకు కలిసొచ్చిన రావి

పంజాబ్‌లోకి చొరబడ్డానికి రావి నది ఉగ్రవాదులకు బాగా కలిసివచ్చింది టైస్టులు రావి నదికి సంబంధించి ఒక కాలువ ద్వారా భారత్‌లోకి ప్రవేశించిన తరువాతే తమ దగ్గరున్న జీపీఎస్ పరికరాలను ఆన్ చేశారు. సీసీటీవీ వీడియో..దీనానగర్ పట్టణంలోనికి ఉగ్రవాదులు ప్రవేశించటానికి ముందు తారాగఢ్‌లో ఓ దుకాణదారు తన దుకాణంపై ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజిలోనూ ఉగ్రవాదుల కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి. 14 సెకండ్ల నిడివిగల ఈ వీడియోలో సైనిక దుస్తులు ధరించిన ముగ్గురు వ్యక్తులు తెల్లవారుఝామున 4:55గంటలకు నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా రికార్డయింది.

 

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top