టెన్త్ పాత సిలబస్ వారు ఓపెన్ స్కూల్‌కే!

టెన్త్ పాత సిలబస్ వారు ఓపెన్ స్కూల్‌కే!


సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పాత సిలబస్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులంతా ఇకపై ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే దూర విద్య పరీక్షల్లోనే పదో తరగతి పరీక్షలు రాసుకోవాలని, వారికి 2016 మార్చిలో జరిగే వార్షిక పరీక్షల్లో అవకాశం ఇవ్వడం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లాల డీఈవోలకు పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాత సిలబస్‌లో 2015 మార్చి పరీక్షలకంటే ముందు సంవత్సరాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఇకపై ఓపెన్ స్కూల్ దూర విద్యా విధానంలోనే టెన్త్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

 

రాష్ట్రంలో 2014-15 విద్యా సంవత్సరంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానాన్ని విద్యాశాఖ 9, 10 తరగతుల్లో అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఇంటర్నల్స్ విధానం ప్రవేశ పెట్టి.. వాటికి 20 మార్కులను ఇస్తోంది. ఇక రాత పరీక్షలను ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకే నిర్వహిస్తోంది. ఆ ప్రకారమే 2015 మార్చిలో పరీక్షలను నిర్వహించింది. ఇక 2014 మార్చి వరకు పాత విధానంలో టెన్త్ పరీక్షలు జరిగాయి. ఒక్కో సబ్జెక్టులో 100 మార్కులకు రాత పరీక్ష నిర్వహించింది.



ఈ నేపథ్యంలో 2014 మార్చి, అంతకుమందు జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన వారంతా 2016 మార్చిలో జరిగే వార్షిక పరీక్షలకు హాజరయ్యే వీలు లేదని విద్యా శాఖ వెల్లడించింది. వారు జాతీయ ఓపెన్ స్కూల్ సొసైటీ లేదా రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే ఎస్సెస్సీ పరీక్షలకు హాజరై పదో తరగతి పూర్తి చేయాలని సూచించింది. ఈ అంశంపై డీఈవోలు విస్తృత ప్రచారం నిర్వహించాలని స్పష్టం చేసింది. పదో తరగతి పాత సిలబస్‌లో ఫెయిల్ అయిన వారంతా ఓపెన్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలని వెల్లడించింది.

 

ఓపెన్ స్కూల్లో 4వరకు ప్రవేశాలు..

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి ప్రవేశాల నోటిఫికేషన్‌ను జారీ చేసిందని, ఈ నెల 25 నుంచి డిసెంబర్ 4 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించిందని విద్యాశాఖ వెల్లడించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించింది.



అలాగే ఇదే అంశంపై సోమవారం ఎంఈవోలు, డిప్యూటీ ఈవోలు, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్లు కలసి జిల్లాల్లోని ప్రతి మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించింది. మీసేవ/ఏపీ ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులు ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకునేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపట్టాలని సూచించింది.

 

ఒకటి ఫెయిలైనా.. మూడు రాయాల్సిందే...

టెన్త్ పాత సిలబస్‌లో ఒక విద్యార్థి ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయినా ఓపెన్ స్కూల్ విధానంలో ఆ ఒక్క సబ్జెక్టులో మాత్రమే పరీక్షలు రాసే వీలు లేదు. ఆ అభ్యర్థి ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీలో కనీసం మూడు సబ్జెక్టుల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుందని ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వర శర్మ పేర్కొన్నారు. రెగ్యులర్ టెన్త్‌లో ఫెయిల్ అయిన వారికి ఓపెన్ స్కూల్లో రెండు సబ్జెక్టులకు మాత్రమే మినహాయింపు ఉంటుందని, ట్రాన్స్‌ఫర్ ఆఫ్ క్రెడిట్స్(టీవోసీ) కింద రెండింటికే అవకాశం ఉంటుందన్నారు.



ఓపెన్ స్కూల్‌లో చేరే పదో తరగతి విద్యార్థులు మొత్తంగా 5 సబ్జెక్టుల్లో పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. అప్పుడే ఎస్సెస్సీ పాస్ అయినట్లు లెక్క. కాబట్టి టీవోసీ కింద రెండింటికి మినహాయింపు ఇస్తామని, మరో మూడు సబ్జెక్టుల్లో కచ్చితంగా పరీక్షలు రాయాల్సి ఉంటుందన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top