వేటు వెనుక..?

వేటు వెనుక..?


*ప్రధాని అసంతృప్తే కారణం!



భారత విదేశాంగ శాఖ కార్యదర్శి పదవి నుంచి సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి సుజాతాసింగ్‌ను అర్ధంతరంగా తొలగిం చటం వెనుక కారణాలేమిటి? అనేది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. సుజాతాసింగ్ తొలగింపు అర్ధాంతరమే అయినప్పటికీ.. ఆకస్మిక నిర్ణయమేమీ కాదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఆమె పనితీరుపై ప్రధానమంత్రి మోదీ ఆరంభం నుంచీ అసంతృప్తిగానే ఉన్నారని.. ఆమెను ఆ పదవి నుంచి తొలగించాలని ఆయన కొంత కాలం కిందే భావించినప్పటికీ.. ఆమెను కొనసాగించాలని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ కోరటంతో ఈ వ్యవహారాన్ని కొంత కాలం వాయిదా వేసినట్లు సమాచారం.



అలాగే.. అమెరికాలో భారత రాయబారిగా ఉన్న జైశంకర్‌ను విదేశాంగ కార్యదర్శిగా నియమించాలని కూడా ప్రధాని కొంత కాలం కిందటే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన ముగిసే వరకూ జైశంకర్‌ను అమెరికా రాయబారిగా కొనసాగించాలని ఆయన భావించారని.. అందుకే ఒబామా పర్యటన ముగిసే వరకూ వేచివున్నారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. సుజాతాసింగ్ తొలగింపు, జైశంకర్ నియామకం వ్యవహారానికి సంబంధించి పలు ఆసక్తికరమైన అంశాలివీ...



* సుజాతాసింగ్ 1976 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి. ఆమె భారత్ పొరుగు దేశాల్లో ఏ దేశంలోనూ రాయబారిగా పనిచేయలేదు. ఆమె2013 ఆగస్టులో విదేశాంగ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. వాస్తవానికి ఆ సమయంలోనే సీనియారిటీలో ముందున్న సుజాతాసింగ్‌ను కాదని.. అమెరికాలో భారత రాయబారిగా ఉన్న ఎస్.జైశంకర్‌ను విదేశాంగ కార్యదర్శిగా నియమించాలని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ భావించారు. అయితే.. నాటి అధికార పార్టీ అయిన కాంగ్రెస్ నాయకత్వం అందుకు నిరాకరించటంతో.. సుజాతాసింగ్‌నే ఆ పదవిలో నియమించారు.



సుజాతాసింగ్.. ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ అయిన టి.వి.రాజేశ్వర్ కుమార్తె. ఆయనను కాంగ్రెస్ పార్టీ విధేయుడిగా పరిగణించేవారని.. యూపీఏ హయాంలో సుజాతాసింగ్‌ను విదేశాంగ శాఖ కార్యదర్శిగా నియమించటానికి ఆ అంశం కూడా  చూపిందని అంటారు.



* సుజాతాసింగ్ కన్నా జైశంకర్ ఒక ఏడాది జూనియర్. రక్షణ రంగ వ్యూహకర్త కె.సుబ్రమణ్యం కుమారుడైన జైశంకర్  1977 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి. జైశంకర్‌కు పొరుగు దేశమైన చైనాలో అత్యధిక కాలం భారత రాయబారిగా పనిచేసిన అధికారిగా రికార్డు ఉంది. సింగపూర్, చెక్ రిపబ్లిక్‌లలో కూడా ఆయన భారత రాయబారిగా పనిచేశారు. అంతర్జాతీయ సంబంధాలు, అందునా అణు దౌత్యంలో పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ పొందిన జైశంకర్.. ఏడేళ్ల కిందట భారత్, అమెరికాల మధ్య అణు ఒప్పందం కుదరటంలో పోషించిన పాత్ర కారణంగా ఆయనను విదేశాంగ కార్యదర్శిగా నియమించాలని నాడు మన్మోహన్ భావించినట్లు ఉన్నతస్థాయి వర్గాలు వివరించాయి.



* ఇక.. సుజాతాసింగ్ విదేశాంగ కార్యదర్శిగా ఉన్నపుడు అమెరికా - భారత్‌ల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. ముఖ్యంగా అమెరికాలో జూనియర్ దౌత్యాధికారిగా పనిచేస్తున్న దేవయాని ఖోబ్రాగడెను వీసా అక్రమాల ఆరోపణలపై అమెరికా పోలీసులు అరెస్ట్ చేయటంతో ఇరు దేశాల సంబంధాలు ఒడిదుడుకులకు లోనయ్యాయి.



* మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆ రాష్ట్రంలో జరిగిన మత హింస నేపథ్యంలో ఆయనకు పదేళ్ల పాటు వీసా నిరాకరించిన అమెరికా వైఖరిలో మార్పు వచ్చేందుకు.. ప్రధానిగా మోదీ అమెరికా పర్యటన విజయంతం అయ్యేందుకు.. ఆ తర్వాత భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేలా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఒప్పించటంలో జైశంకర్ దిగ్విజయంగా కృషి చేశారని.. ఆయన విదేశాంగ కార్యదర్శిగా ఉండటం వల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని మోదీ భావించారు.



* అమెరికాలో భారత రాయబారిగా ఉన్న డాక్టర్ సుబ్రమణ్యం జైశంకర్ ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే.. ఆయన పదవీ కాలం ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో.. ఆయనను భారత విదేశాంగ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విదేశాంగ కార్యదర్శిని అర్థంతరంగా తొలగించటం ఇది రెండోసారి. 1987లో అప్పటి విదేశాంగ కార్యదర్శి ఎ.పి.వెంకటేశ్వరన్‌ను నాటి ప్రధాని రాజీవ్ తొలగించారు. - సెంట్రల్ డెస్క్

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top