దేవుడి భూముల్లో లొల్లి




భద్రాద్రి జిల్లా అన్నపురెడ్డిపల్లిలో ఉద్రిక్తత

- 50 ఎకరాల్లో ఆదివాసీల పంటలు ధ్వంసం చేసిన అధికారులు

- 20 ట్రాక్టర్లతో వరి, మిర్చి పంటల తొలగింపు

- ఎదురుతిరిగిన ఆదివాసీలు.. విల్లంబులు, కారంతో ప్రతిఘటన




అన్నపురెడ్డిపల్లి: అవి దేవాలయ భూములు.. ఆదివాసీలు అందులో పంటలు సాగు చేశారు.. అక్రమం అంటూ అధికారులు పొలాలపై పడ్డారు.. పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తుతో వచ్చి సుమారు 50 ఎకరాల్లో వరి, మిర్చి పంటలను 20 ట్రాక్టర్లతో తొక్కించేశారు!



విషయం తెలుసుకున్న ఆదివాసీలు విల్లంబులు, కారంతో ఎదురుతిరిగారు. దీంతో పోలీసులు, ఆదివాసీల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.



కలెక్టర్‌ ఆదేశాలతో కదిలిన అధికారగణం..

అన్నపురెడ్డిపల్లిలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి 2,308 ఎకరాల భూములు అగ్రహారంగా ఉన్నాయి. అందులో తొట్టిపంపు గ్రామానికి చెందిన ఆదివాసీలు 645 ఎకరాల్లో, గిరిజనేతరులు మరో 684 ఎకరాల్లో కౌలు సేద్యం చేస్తున్నారు. అయితే 1996–97 నుంచి ఆదివాసీలు కౌలు చెల్లించడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్‌లో కొందరు ‘ఆదివాసీ సేన ఉద్యమం’పేరిట గిరిజనేతర రైతుల ఆధీనంలో ఉన్న దేవాలయ భూముల్లో పంటలు సాగు చేశారు. ఈ క్రమంలో ఘర్షణలు జరగడంతో కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు ఇరువర్గాలతో చర్చించారు. ఎంజాయ్‌మెంట్‌ సర్వే జరిగే వరకు సదరు భూముల్లోకి రెండు వర్గాల వారు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఆదివాసీలు వెంకన్నస్వామికి చెందిన అన్నదైవం ప్రాజెక్ట్‌ ఆయకట్టులోని సుమారు 50 ఎకరాల భూముల్లో సేద్యం చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్‌ ఆ పంటలను ధ్వంసం చేయాలని అటవీ, రెవెన్యూ, దేవాదాయ, పోలీసు శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు మంగళవారం తెల్లవారుజామున వెళ్లి పంటలను తొక్కించేశారు.



విల్లంబులు ఎక్కుపెట్టిన ఆదివాసీలు..

తమ పంటలను ధ్వంసం చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఆదివాసీలు విల్లంబులు, కారం తీసుకుని పొలాల్లోకి వచ్చారు. పంటల్ని నాశనం చేయొద్దంటూ అధికారులపై ఎదురుతిరిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు, తోపులాట చోటుచేసుకున్నాయి. ఒక దశలో ఆదివాసీలు అధికారులపై విల్లంబులు ఎక్కుపెట్టారు. కారం చల్లుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర ఘర్షణ అనంతరం పోలీసులు 62 మంది ఆదివాసీలను అదుపులోకి తీసుకుని చండ్రుగొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొత్తగూడెం డీఎస్పీ సురేందర్‌రావు పర్యవేక్షణలో జూలూరుపాడు, పాల్వంచ, అశ్వారావుపేట, కొత్తగూడెం సీఐలు, పది మంది ఎస్సైలు, 70 మంది స్పెషల్‌ పార్టీ పోలీసులు, మరో 100 మంది పోలీసులు, 40 మంది అటవీ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top