కదంతొక్కిన కాంగ్రెస్..

కదంతొక్కిన కాంగ్రెస్.. - Sakshi


నియోజకవర్గ కేంద్రాల్లో రాస్తారోకోలు.. ధర్నాలు

ఇందిరమ్మ బిల్లులు  చెల్లించాలని డిమాండ్


 

సాక్షి నెట్‌వర్క్: ఇందిరమ్మ ఇంటి బిల్లులు చెల్లించాలని, ప్రజా సమస్యలపై ప్రభుత్వం మొండివైఖరిని నిరసిస్తూ టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాల్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు.



►ఖమ్మం జిల్లాలోని మధిరలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ  ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ధర్నాలో పాల్గొన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో రాక్షసపాలన సాగిస్తున్నారని ఆరోపించారు.  బంగారు తెలంగాణ అంటే నిర్మాణాలను కూల్చడం కాదని, కట్టుకున్న నిర్మాణాలను కాపాడుకోవాలని సీఎం కేసీఆర్‌కు హితవు పలికారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో మల్లు భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి హరి రమాదేవి, డీసీసీ అధ్యక్షుడు ఐతం సత్యం, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్  పాల్గొన్నారు.



►నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆలేరులో డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్య గౌడ్, నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.   



►మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. అలంపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆధ్వర్యంలో 44వ జాతీయ రహదారిని నిర్బంధించారు. గద్వాలలో జరిగిన ధర్నాలో ఎమ్మెల్యే డీకే అరుణ పాల్గొన్నారు. జచ్చర్లలో పీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి ఆందోళన లో పాల్గొన్నారు.



►ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి నాయకత్వంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆసిఫాబాద్‌లో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొన్నారు. చెన్నూరులో జనక్‌ప్రసాద్ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు.  



►కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు విజయవంతమయ్యాయి. జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, పీసీసీ మహిళా విభాగం రాష్ర్ట అధ్యక్షురాలు శారద పాల్గొన్నారు. పొన్నంతోపాటు కార్యకర్తలు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. మంథనిలో మాజీ మంత్రి శ్రీధర్‌బాబుతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని బైఠారుుంచడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.  



►నిజామాబాద్ జిల్లాలో ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. మోర్తాడ్‌లో డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, నిజామాబాద్‌లో టీపీసీసీ నేత మహేష్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి.  



►వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు జరిగాయి. వరంగల్ నగరంలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి హౌసింగ్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.  మహబూబాబాద్‌లో మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారుు. నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆందోళనలో మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి దామోదర్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top