చరిత్రాత్మక ఒప్పందం

చరిత్రాత్మక ఒప్పందం - Sakshi


సాక్షి, హైదరాబాద్: గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదులపై నిర్మించే మూడు ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ, మహారాష్ట్రల మధ్య చారిత్రక ఒప్పందాలు కుదిరాయి. మంగళవారం ముంబైలోని సహ్యాద్రి అతిథి గృహంలో జరిగిన అంతర్రాష్ట్ర జలాల బోర్డు సమావేశంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. తమ్మిడిహెట్టి, మేడిగడ్డ, ఛనాఖా-కొరట బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి పరస్పర అంగీకారాన్ని తెలిపారు.


 


ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గిరీశ్ మహాజన్, అంతర్రాష్ట్ర జలాల బోర్డు సభ్యులైన ఇరు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈటల రాజేందర్, సుధీర్ మంగత్రాయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం, రెవెన్యూ శాఖ మంత్రులు మహమూద్ అలీ, చంద్రకాంత్ పాటిల్, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావులతోపాటు మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎంపీలు వినోద్‌కుమార్, బాల్కసుమన్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పుట్ట మధు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ప్రాజెక్టు సీఈలు నల్లా వెంకటేశ్వర్లు, భగవంత్‌రావు, ఇతర బోర్డు సభ్యులు, సాగునీటి మంత్రి ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


 


ఒప్పందాలివీ..


 


1) మేడిగడ్డ..


గోదావరిపై 100 మీటర్ల ఎత్తులో 16 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి అంగీకారం. మెదక్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో కొత్తగా 18.19 లక్షల ఎకరాలకు సాగు నీటితోపాటు శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూర్ జలాశయాల పరిధిలోని మరో 18 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు.


 


2) తమ్మిడిహెట్టి..


ప్రాణహితపై తమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో 1.8 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో బ్యారేజీని నిర్మిస్తారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, సిర్పూర్-కాగజ్‌నగర్ నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది.


 


3) ఛనాఖా-కొరట..


పెన్‌గంగపై 213 మీటర్ల ఎత్తులో 0.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఛనాఖా-కొరట బ్యారేజీని నిర్మిస్తారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలతోపాటు ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి, జైనథ్, బేల మండలాలకు సాగునీరు అందుతుంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top