రుణమాఫీపైముందుకే!

రుణమాఫీపైముందుకే!


 ఒకే విడతలో బ్యాంకులకు రూ. 10 వేల కోట్లు

 

 సాక్షి, హైదరాబాద్: రైతు రుణాల రీషెడ్యూల్‌తో సంబంధం లేకుండా రుణమాఫీని అమలు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. బ్యాంకులకు ఒకే దఫాలో పదివేల కోట్ల రూపాయలు చెల్లించే దిశగా కసరత్తు ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు వేతనాల చెల్లింపులు మినహా, భారీ బిల్లులేవీ చెల్లించకపోవడం, ఇతర పొదుపు చర్యల నేపథ్యంలో రుణ మాఫీ విషయంలో ప్రభుత్వం ధీమాగా ఉంది. ఒకేసారి రూ. 10 వేల కోట్లను సమకూర్చుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తోంది. రుణాల రీషెడ్యూల్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అంత సుముఖంగా లేదని, అందుకే ఈ విషయంతో సంబంధం లేకుండా రుణమాఫీపై ముందుకుపోవాలని సర్కారు యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను నేడో రేపో జారీ చేయాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి అధ్యక్షతన 11 మందితో ఏర్పాటైన ఉన్నతాధికారుల కమిటీ ఈ మార్గదర్శకాలను రూపొందించింది. వీటిని బుధవారమే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆమోదించిన వెంటనే ఉత్తర్వుల జారీకి వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధమయ్యారు.

 

 రుణ మాఫీ అంశంపై ఆర్థిక  మంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి ముఖ్యమంత్రి ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్షించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ రుణమాఫీ హామీకి కట్టుబడి.. మొదటి దశలో రూ. పది వేల కోట్లు, తర్వాత రెండు దశల్లో.. మిగతా ఏడు వేల కోట్ల రూపాయల నిధులను బ్యాంకులకు చెల్లించేలా వారిని ఒప్పించేందుకు ప్రయత్నించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. కాగా, బ్యాంకులకు రుణాల చెల్లించేందుకు అనుసరించే విధానంతో పాటు కరువు, వరద మండలాల్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏ మేరకు జరిగిందన్న వివరాలను చెప్పాలని కోరిన  ఆర్‌బీఐకి ఒకట్రెండు రోజుల్లోనే సమాధానం పంపనున్నట్లు సమాచారం. తమ నిర్ణయాన్ని వెల్లడిస్తూ ఈ విషయంలో ఆర్‌బీఐకి స్పష్టత నివ్వాలని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది. రైతుల నుంచి బ్యాంకులు ఒకేసారి భారీఎత్తున రుణాలను వసూలు చేయడం సాధ్యం కాదని, ప్రభుత్వం ఏకమొత్తంలో అన్ని వేల కోట్ల రూపాయలు చెల్లించడం వల్ల బ్యాంకులకు పనిభారం తగ్గడమేకాక, ఒకేసారి ఆదాయం సమకూరుతుందని వాదించనుంది. వర్షాలు పెరిగిన నేపథ్యంలో రైతులు పొలం పనుల్లో మునిగిపోతున్నారని, ఈ సమయంలో వారికి బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వకపోతే మరిన్ని ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top