చీప్ లిక్కర్ పై వెనక్కి

చీప్ లిక్కర్ పై వెనక్కి - Sakshi


పాత పద్ధతిలోనే మద్యం పాలసీ కొనసాగింపు


కేబినెట్ భేటీ అనంతరం సీఎం కె. చంద్రశేఖర్‌రావు వెల్లడి


♦ గుడుంబాపై ఉక్కుపాదం మోపుతాం

♦ తయారీదారులపై పీడీ చట్టం ప్రయోగిస్తాం

♦ జిల్లాల పునర్‌వ్యవస్థీకరణపై సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ

♦ కమిటీ నివేదిక ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటు

♦ త్వరలోనే తెలంగాణ జల వినియోగ విధానం

♦ మొత్తం రూ. 81 వేల కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం

♦ కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు అథారిటీలు

♦ పెరిగిన డీఏకు మంత్రివర్గం ఆమోదం

♦ సిటీ ఆర్టీసీ నష్టాలను జీహెచ్‌ఎంసీ భరించేలా

♦ చట్ట సవరణ... సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీ


 

 సాక్షి, హైదరాబాద్: వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో చీప్ లిక్కర్‌పై రాష్ట్ర సర్కారు వెనక్కి తగ్గింది. గుడుంబాకు అడ్డుకట్ట వేసేందుకు తక్కువ ధరకు దొరికే చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. మద్యం పాలసీ విషయంలో పాత పద్ధతినే కొనసాగించాలని నిర్ణయించింది. ప్రజల నుంచి మిశ్రమ స్పందన రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. అదే సమయంలో గుడుంబాపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టంచేశారు. ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యే క బృందాలను ఏర్పాటు చేసి గుడుంబా తయా రీ, విక్రయాలకు అడ్డుకట్ట వేస్తామని, తయారీదారులపై పీడీ చట్టం ప్రయోగిస్తామని చెప్పా రు. బుధవారం మధ్యాహ్నం నుంచి 5గంటల పాటు సుదీర్ఘంగా కేబినెట్ భేటీ జరిగింది. మద్యం విధానం, జిల్లాల పునర్విభజన, గృహ నిర్మాణం, తెలంగాణ జల వినియోగ విధానం, మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లపై కేబినెట్‌లో  చర్చ జరిగింది. సమావేశం తర్వాత సీఎం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

 

 జిల్లాల పునర్‌వ్యవస్థీకరణకు ఓకే

 జిల్లాల పునర్‌వ్యవస్థీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎస్ రాజీవ్‌శర్మ ఆద్వర్యంలో నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు సీఎం వెల్లడించారు. ''ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం జిల్లాల పునర్‌వ్యవస్థీకరణకు నిర్ణ యం తీసుకున్నాం. దేశంలో సగటున 19 లక్షల జనాభాకు ఒక జిల్లా ఉంది. తెలంగాణలో మాత్రం 35 లక్షల జనాభాకు ఒక జిల్లా ఉంది. దీంతో పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నా యి. అందుకే కొత్త జిల్లాల ఏర్పాటుపై ఎన్నికల్లో హామీ ఇచ్చాం. మేనిఫెస్టోలోనూ ప్రకటిం చాం. దీన్ని అమలు చేసేందుకు చీఫ్ సెక్రెటరీ అధ్యక్షతన నలుగురు సీనియర్ సెక్రెటరీలతో కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తాం''అని సీఎం వెల్లడించారు. మొత్తం 43 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం వెల్లడించిన కీలకాంశాలివీ..

 

 60 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు

 ఈ ఏడాది రూ.3,900 కోట్ల ఖర్చుతో నిరుపేదలకు 60 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో 560 చదరపు గజాల విస్తీర్ణంతో నిర్మించే ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షలు అవుతుంది. జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్‌లలో అంతే విస్తీర్ణంలో నిర్మించే ఇంటికి రూ.5.30 లక్షల అంచనా వ్యయమవుతుంది. హైదరాబాద్ ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన నమూనాలో వీటిని నిర్మిస్తారు. గతంలో ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయి. కానీ అసంపూర్తిగా ఉన్న గృహాలు, బిల్లులు అందని అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేస్తాం.

 

 మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు

 దేశంలోనే తొలిసారిగా మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నాం. తెలంగాణలో మొత్తం 183 వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. వీటిలో గిరిజన ప్రాంతాల్లో ఉన్న 13 కమిటీలను పీసా చట్టం ప్రకారం ఎస్టీలకు కేటాయించాలి. మిగతా 170 మార్కెట్లలో 50 శాతం కమిటీలను రిజర్వు చేస్తార. అంటే 85 మార్కెట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తాం. ఉద్యోగాలకు ఉన్న రిజర్వేషన్ల శాతాన్నే అమలు చేయటంతో పాటు లాటరీ పద్ధతిన రిజర్వేషన్లు ఖరారు చేస్తాం. మిగతా 85 మార్కెట్లు జనరల్ కోటాలో ఉంటాయి. వచ్చే ఏడాది రొటేషన్ పద్ధతిలో ఇవి తారుమారవుతాయి. అంటే జనరల్ కోటాలో ఉన్న మార్కెట్లకు రిజర్వేషన్లను వర్తింపజేసి.. ఇప్పుడు రిజర్వ్ అయిన మార్కెట్లను జనరల్ కోటాకు మారుస్తాం.

 

 సిటీ బస్సుల నష్టం జీహెచ్‌ఎంసీకే..

 రవాణా సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు వీలుగా ఆర్టీసీని పరిరక్షించుకోవాలి. నగరంలో రోజుకు 3,800 బస్సులు  సేవలు అందిస్తున్నాయి. వీటి ద్వారా ఆర్టీసీకి ఏటా రూ.218 కోట్ల నష్టం వస్తోంది. అమెరికా, యూరప్‌తో పాటు అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజా రవాణా నష్టాల్లోనే ఉంది. వీటిని అక్కడి స్థానిక సంస్థలే నిర్వహిస్తున్నాయి. ముంబైలో కూడా ఇదే విధానముంది. అదే తరహాలో సిటీ లో ఆర్టీసీకి వచ్చే నష్టాలను జీహెచ్‌ఎంసీ భరిం చేలా చట్ట సవరణ చేశాం. ఇప్పట్నుంచీ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను టీఎస్‌ఆర్టీసీ బోర్డులో డెరైక్టర్‌గా నియమించేందుకు నిర్ణయించాం.

 

 త్వరలోనే జల వినియోగ విధానం

 రాష్ట్రానికి లాభం జరిగేలా.. రైతుల సాగునీటి కోసం ఇరిగేషన్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ పూర్తై ది. త్వరలోనే తెలంగాణ జల వినియోగ విధా నం ప్రకటిస్తాం. రాబోయే మూడేళ్లు వరుసగా సాగునీటి ప్రాజెక్టులకు ఏటా బడ్జెట్టులో రూ.25 వేల కోట్లు కేటాయిస్తాం. ఈ ఏడాది ప్రతి నెలా రూ.వెయ్యి కోట్ల చొప్పున ఖర్చు చేస్తాం.  మొత్తం రూ.81 వేల కోట్లతో ప్రాజెక్టులను నిర్మించాలనేది లక్ష్యం. ప్రాణహిత, ఇం ద్రావతి నదులు కలిసిన తర్వా త గోదావరిపై నిర్మించే బ్యారేజీకి లైడార్ సర్వే మొదలైంది. ఇది పూర్తయ్యాక జల విధానం వెల్లడిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరాం.

 

 కరువును ఎదుర్కొనేందుకు సిద్ధం

 కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సెప్టెంబరు వరకు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఆ తర్వాతే పరిస్థితులను అంచనా వేసి కరువు మండలాలపై నిర్ణయం తీసుకుంటాం. 3 జిల్లాలు సుభిక్షంగా ఉంటే 6 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయి. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. మిగతా జిల్లాల్లో వర్షాభావ పరిస్థితి నెలకొంది. రైతుల ఆత్మహత్యలపై పరిహారాన్ని పెంచే ప్రతిపాదనను ఆలోచిస్తాం. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారాన్ని అందించటం లేదనడం సరికాదు. కలెక్టర్ల ఆధ్వర్యంలోనే నిధులున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్యాకేజీ అమలు చేస్తున్నారు.

 

 జీతాల పెంపు ఆలోచన లేదు

 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచే ఆలోచన లేదు. ఇచ్చిన మాట ప్రకారం కాం ట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగుల విభజన పూర్తయితే ఈ ప్రక్రియ మొదలవుతుంది.

 

 సింగిల్ పోలీస్ విధానంపై

 సివిల్ పోలీసులు, బెటాలియన్లు, ప్రత్యేక పోలీస్ ఫోర్స్‌ను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలనే ఆలోచన ఉంది. పోలీసు బలగాలను ఒక్కసారిగా సివిల్ పోలీసులుగా మార్చితే వచ్చే ఇబ్బందులను అధ్యయనం చేస్తున్నాం.

 

 ఎస్కలేషన్‌కు పచ్చజెండా

 కాగా, రాష్ట్రంలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులకు పెరిగిన ధరలకు అనుగుణంగా ధరల పెంపు (ఎస్కలేషన్)కు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఉమ్మడి ఏపీలో ఇచ్చిన జీవో 13ను కొద్దిపాటి మార్పులతో అమలు చేసేం దుకు సానుకూలత తెలిపింది. పనులు జరగని చోట టెండర్ రద్దుచేసి కొత్తగా టెండర్లు పిలిస్తే వ్యయ భారం దాదాపు వందరెట్లు పెరుగుతుండటం, న్యాయపరమైన చిక్కులు తప్పవని కేబినెట్ సబ్ కమిటీ నివేదించిన దృష్ట్యానే ఈ నిర్ణయానికి వచ్చిన ట్లు తెలుస్తుంది.

 

 కేసీఆర్ ఈజ్ ఏ ఫైటర్..

 'కేసీఆర్ ఈజ్ ఏ ఫైటర్... క్రూసేడర్.. తెలంగాణ వచ్చేదాకా పోరాడిన వ్యక్తిని. నా కంఠంలో ప్రాణమున్నంత వరకు తెలంగాణకు నష్టం జరిగే పని చేయను. తెలంగాణ భవిష్యత్తుకు మేం వేస్తున్నదే పునాది. వాస్తవాలు గుర్తించని వారెన్నో విమర్శలు చేస్తున్నారు'అని ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాలపై ధ్వజమెత్తారు. తాను చేసే ప్రయత్నంతో నదీ జలాలు వస్తాయనే ధీమా వెలిబుచ్చారు. 'గతంలో మీడియం, మైనర్ ప్రాజెక్టులను మరిచిపోయారు. పెన్‌గంగ, గోదావరిపై మహారాష్ట్ర 218 బ్యారేజీలు నిర్మించింది. కృష్ణా నదిపై 78 బ్యారేజీలున్నాయి. ఎస్సారెస్పీ, జూరాలకు చుక్క నీరు రావటం లేదు. అందుకే ఇంద్రావతి, ప్రాణహిత కలిసిన తర్వాత గోదావరి నుంచి నీటిని తీసుకునేందుకు ప్రాజెక్టు రీ డిజైన్ చేశాం. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తో వివాదాలు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి నీటిని వాడుకుంటాం. గూగుల్ మ్యాప్‌ల ఆధారంగా ఎక్కడెక్కడ ఎన్ని బ్యారేజీలున్నాయో త్వరలోనే వెల్లడిస్తాం. ఎవరికైనా అపోహలుంటే మానుకోండి. అనవసర పనికి మాలిన విమర్శలు మానండి' అని హితవు పలికారు.

 

 కేబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు..


  •   ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన డీఏ చెల్లింపునకు ఆమోదం. జనవరి నుంచి 3.144 % పెరిగిన డీఏ చెల్లించాల్సి ఉంది.

  •   రాష్ట్రంలో కొత్తగా నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్‌తుమ్మెద, మహబూబ్‌నగర్ జిల్లా పాలెం, కరీంనగర్ జిల్లాలో జమ్మికుంటలో కొత్తగా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటు.

  •   హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీలో రూ.2,631 కోట్ల అంచనా వ్యయంతో స్ట్రాటెజిక్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు అమలుకు నిర్ణయం. 20 చోట్ల మల్టీ లెవెల్ ప్లై ఓవర్ల నిర్మాణం.

  •   ఉద్యోగ నియామకాలకు సాధారణ గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులకు కేబినెట్ ఆమోద ముద్ర. యూనిఫాం సర్వీసులకు వయో పరిమితి పెంచాలనే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. సంబంధిత విభాగాల అధికారులతో చర్చించిన తర్వాత నిర్ణయం.

  •   హైదరాబాద్‌లో మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు వీలుగా ప్రత్యేక రాయితీలు.

  •   ఏపీ ఎక్సైజ్ యాక్ట్, ఏపీ ప్రొఫెషన్ టాక్ట్ యాక్ట్, ఏపీ నర్సెస్, హెల్త్ విజిటర్స్ యాక్ట్‌ను తెలంగాణకు అన్వయించేలా వర్తింపజేసేందుకు ఆమోదం.

  •   తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ ఏర్పాటుకు నిర్ణయం. ఏపీ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు నుంచి తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు విభజన, నాబార్డు నుంచి తీసుకున్న రూ.2,500 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ.
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top