పేరుకే వేడుకలు.. టీచర్ల మాట ఉంటే ఒట్టు!

పేరుకే వేడుకలు.. టీచర్ల మాట ఉంటే ఒట్టు! - Sakshi


కేంద్ర సర్కార్, ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీచర్స్ డే వేడుకల్లో టీచర్ల మాటే లేదు. ఉపాధ్యాయుల స్థానాన్ని రాష్ట్రపతి అక్రమించేస్తే.. ప్రధాని తన జీవిత రాజకీయ పాఠాలు చెబుతూ కాలం వెళ్లదీశారు. ఉపాధ్యాయుల ప్రాతినిధ్యంపై పిల్లలకు వివరించాల్సింది పోయి, తన ఏడాది పాలన గురించే చెప్పినట్లు కనిపించింది. ఉపాధ్యాయుల గురించి పిల్లలకు మాట్లాడే అవకాశం ఇచ్చారే కానీ, ఒక్క ఉపాధ్యాయుడి పేరూ ప్రస్తావించలేదు.



ప్రధాని టీచర్స్ డే వేడుకల్లో విద్యార్థుల ప్రదర్శన కూడా విద్యా విధానంలో సమస్యలను ప్రతిబింబించలేదు. వేడుకల్లో పాల్గొన్న వారిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చిన వారెవ్వరూ కనిపించలేదు. మోడల్ స్కూళ్ళు, కేంద్రీయ విద్యాలయాలు, ప్రైవేటు పాఠశాలలనుంచి, అధికంగా ఫలితాలను సాధించిన వారు, అవార్డులు గెలుచుకున్నవారు, ఇంగ్లీషు మాట్లాడగలిగేవారు ఎక్కువగా పాల్గొన్నారు. ఉపాధ్యాయులు కూడ వేదికపై గానీ, తెర వెనుక గానీ తమను తాము ప్రదర్శించుకోలేదు.



నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక  'మేక్ ఇన్ ఇండియా'   నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. కానీ విద్యారంగంలో ఏదీ మేక్ ఇన్ ఇండియా అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో విద్యావిధానం నానాటికీ కుంగి పోతోంది. తగిన విద్యార్హతలు లేనివారు కూడా టీచర్లుగా వచ్చేస్తున్నారు. పాఠశాలల్లో పనిచేసే సిబ్బందిని పరిశీలిస్తే బోధనా రంగంలో ఉన్నవారి కంటే ఇతర పోస్టుల్లో ఉన్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. విద్యాధికారుల పర్యవేక్షణా లోపాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి.



ప్రస్తుత విద్యా వ్యవస్థలో  ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చేవారు ఎలాంటి సామర్థ్యం ఉన్నవారైనా సరిపోతుంది అన్నట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వ సేవలు చేయడంలో భాగంగానే ఉపాధ్యాయ వృత్తిని కూడా చూస్తోంది. పరీక్షలు పాసైతే చాలు టీచర్లుగా మారే అవకాశాన్నిస్తోంది. అందుకే బోధనారంగంలో ప్రభుత్వ పరీక్షకు కూడా ప్రస్తుతం మార్కెట్లో పోటీ ఎక్కువైంది. నియామకాల్లో కనీస ప్రమాణాలు పాటించకపోవడంతో విద్యావ్యవస్థే కుంటుపడుతోంది. మధ్యప్రదేశ్ లో సాంకేతిక విద్యాశాఖ మాజీ మంత్రి లక్ష్మీకాంత్ శర్మ నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో ఫలితాలు మార్చడంలో బయటపడ్డ కుంభకోణం విద్యావ్యవస్థనే ప్రశ్నిస్తుంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top