వాళ్లకు కోట్లు.. మనకు వెన్నుపోట్లు

వాళ్లకు కోట్లు.. మనకు వెన్నుపోట్లు - Sakshi


(సాక్షి వెబ్ ప్రత్యేకం)

అదిగో చందమామ.. ఎంత హాయిగా, చల్లగా, అందంగా ఉందో చూడు. ఆ చందమామ నీకు అందుతుంది. ఇక అంతటా వెలుగులే... నీ జీవితం ఇక మీదట అమరావతి నగరంలాగా అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది.. కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక్కడి అధికార పక్షం.. హస్తినలోని అధికార పక్షం పదే పదే చూపించిన ఈస్ట్మన్ కలర్ సినిమా.. ఎన్నికల ముందు పోటీపడి వాగ్దానాలు చేసిన ఇద్దరు 'నాయుడులు'.. ఒకరు ముఖ్యమంత్రి అయ్యారు.. మరొకరు కేంద్రంలో కీలక మంత్రి అయ్యారు. కొత్త రాష్ట్రం ఏర్పడి సంవత్సరం దాటిపోయింది. ప్రత్యేకహోదా ఖాయం.. అని ఎండమావుల్ని చూపించి సముద్రమంత పిక్చర్ ఇచ్చారు.



ఇప్పుడేమైంది.. ప్రత్యేక హోదానా? అదెక్కడ. మహా అయితే ప్యాకేజి ఇవ్వగలం. బీహార్కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు కదా.. అసలు ప్రత్యేక హోదా అనే పాలసీనే లేదు అని కేంద్రం పార్లమెంటు సాక్షిగా కుండ బద్దలుకొట్టింది. ఇండైరెక్టుగా చెప్పిందేమిటంటే మీ చావేదో మీరు చావండి అని. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి 70 వేల కోట్లు, బీహార్కు 50 వేల కోట్లు ఇచ్చిన కేంద్రం.. రాష్ట్రానికి మాత్రం వెన్నుపోట్లే మిగిల్చిందన్న విమర్శలు వస్తున్నాయి.



అమరావతి నగర చిత్ర కథ ఈస్ట్మన్ కలర్లో గ్రాఫిక్స్ ఎఫెక్టులో 'బాహుబలి' సినిమా చూపించిన అధికార టీడీపీ ఇప్పుడు ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. ''ఈ నిర్ణయం నిరాశపరిచింది. ప్రధానిని, ఇతర పెద్దలను కలుస్తాం. ప్రత్యేక హోదా వచ్చేవరకు నిద్రపోము'' అనే ప్రకటన ఈరోజు సాయంత్రం వరకు వెలువడినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. 'అసలు ఆ మంత్రి ఎవరు పార్లమెంటులో చెప్పడానికి? ప్రధాని అనలేదు కదా! ఇదంతా అబద్ధం, ఉత్తుత్తి ప్రకటన' అని మరోసారి మాయల పకీరు వేషం కట్టినా పెద్ద విశేషమేమీ కాదు.



ప్రత్యేక హోదా రాదని తెలిసినా ప్రజలను మభ్యపెట్టిన పచ్చనాయకులకు, ఆంధ్రప్రదేశ్లోని కాషాయ జెండాలకు మరోసారి మభ్యపెట్టడం వెన్నతో పెట్టిన విద్యే. కండువాలు మార్చుకుని గొలుసుకట్టుగా చేతులు పైకెత్తి విక్టరీ సంకేతాలు చూపించిన నాయకులు ఇప్పుడు ఏమి చేస్తారో చూడాల్సిందే. ఇంకెన్ని పిల్లిమొగ్గలు వేస్తారో కనులారా తిలకించి తరించాల్సిందే.



''రుణమాఫీ సాధ్యం కాదు అని ఎలా అంటారు? నాకు ఓట్లేయండి.. అనుభవముంది.. ఎలా చేయాలో నాకు తెలుసు. చేసి చూపిస్తా'' అంటూ పెద్దపెద్ద హామీలిచ్చిన నాయుడు గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత రుణమాఫీని ఎంత పెద్ద జోక్గా మార్చేశారో ఆత్మహత్య చేసుకున్న ఆంధ్రప్రదేశ్ రైతుల ఆత్మలు చెప్పకనే చెబుతాయి. అప్పుడు సమైక్య రాష్ట్రంలో హామీ ఇచ్చాను.. ఇప్పుడు విడిపోయాం, డబ్బుల్లేవు అనే బీద అరుపులూ విన్నాం.. ఈ పేదరికం పుష్కరాల కోసం రూ. 1600 కోట్లను గోదావరి నీళ్లలాగా ఖర్చుచేశామని గొప్పలు చెప్పుకున్నప్పుడు మనకు వినపడలేదు... కనపడలేదు. కానీ కొందరు మాత్రం 'పేదరికం' నుంచి కచ్చితంగా బయటపడ్డారు. తొక్కిసలాటలో మరణించిన అమాయకుల ఆత్మలు కూడా ఇదే విషయాన్ని చెప్పుకొంటాయి.



ఎవరేమనుకుంటే మనకేమిటి.. నాలుగు రోజులు కొన్ని పేపర్లు ఏదేదో రాస్తాయి. కొన్ని చానళ్లు టీవీ స్క్రీన్ల చొక్కాలు చించుకుంటాయి. ప్రతిపక్షం ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంది. ఎదురుదాడి చేసి సమస్యను పక్కదోవ పట్టించి తప్పించుకోవచ్చు. ఈలోపు కొత్త సమస్య వచ్చిపడుతుంది. పాతది గుంపులో కలిసిపోతుందనే ధీమా మన పాలకులది. ఇంత జరిగినా, ప్రత్యేక హోదా పార్లమెంటు సాక్షిగా సమాధి అయినా 'ముఖ్యులు' నోరు మెదపరు. సహచరులను కూడా నోరు మెదపొద్దు అంటారు. కేంద్రంపై కన్నెర్ర చేయొద్దని లోగుట్టు సూచనలు చేస్తారు. పైకి మాత్రం నిరసన లాంటి తాటాకు చప్పుళ్లు చేస్తారు. ఎవరు బెదరతారు కనుక.. నిజానికి బెదిరించాలనే ఉద్దేశం ఎవరికైనా ఉంటే కదా!



ప్రత్యేక హోదా బంగాళాఖాతంలో కలిసిపోతే అమరావతి చిత్రకథ రేపో మాపో మళ్లీ తెరమీదకు వస్తుంది. రంగుల ప్రపంచం మళ్లీ కళ్లముందు ఆవిష్కృతమవుతుంది. అద్దాల మేడలు, పచ్చిక బయళ్లు, మెట్రోలు, స్కైబస్సులు, ఎక్స్ప్రెస్ వేలు, డౌన్టౌన్లు... ఎన్నెన్ని.. మరి ప్రత్యేక హోదా సాధించలేదు కదా.. ఇవన్నీ కట్టడానికి డబ్బులెలా వస్తాయి.. పేద రాష్ట్రం కదా.. ఆదాయం లేదు కదా.. ఎవరైనా ఫ్రీగా కడతారా.. పాపం ప్రజలు.. అమాయకంగా అడుగుతారు. అనుభవముంది.. చేసి చూపిస్తారు.. ఆమాత్రం ఓపిక లేకపోతే ఎలా?

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top