తహసీల్దార్‌పై టీడీపీ ఎంపీ పీఏ చిందులు

తహసీల్దార్‌పై టీడీపీ ఎంపీ పీఏ చిందులు - Sakshi


- అరకు ఎంపీ గీత సమక్షంలోనే వార్నింగ్‌లు..?

- అర్ధరాత్రి వేళ హైరానాపడ్డ రెవెన్యూ అధికారులు

- భద్రాచలంలో కేసు నమోదు




భద్రాచలం: తమకు అనుకూలంగా పనులు చేయటం లేదని తహసీల్దార్‌పై తెలుగు తమ్ముళ్లు చిందులు తొక్కారు. ప్రజా ప్రతినిధికి సహాయకారిగా ప్రభుత్వం ద్వారా నియమితులైన వ్యక్తిగత కార్యదర్శి పచ్చ కండువా కప్పుకున్నట్లు వారికి వంత పాడుతూ తహసీల్దార్‌ను కొట్టాలంటూ ప్రేరేపించారు. ఏపీ టీడీపీ ఎంపీ సమక్షం లోనే ఈ వ్యవహారమంతా జరిగింది. తనను ఎంపీ కొత్తపల్లి గీత తీవ్రంగా దుర్భాష లాడారని, ఆమె వ్యక్తి గత కార్యదర్శి గొల్లా ప్రదీప్‌రాజు రాయడానికి వీల్లేని పదాలతో దూషించాడని తహసీల్దార్‌ వంగలపూడి చిట్టిబాబు మంగళవారం భద్రాచలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.



తహసీల్దార్‌ చిట్టిబాబు కథనం ప్రకారం.. విలీన మండలాల్లోని చింతూరులో అధికారిక పర్యటనలో భాగంగా అరకు ఎంపీ కొత్తపల్లి గీత తన అనుచరులతో సోమవారం రాత్రి భద్రాచలం వచ్చారు. ఎంపీతోపాటు అనుచరులు కూడా వస్తున్నందున భద్రా చలంలో అతిథి గృహం ఏర్పాటు చేయాలని ఎటపాక(ఆంధ్రప్రదేశ్‌) రెవెన్యూ అధికారు లకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎటపాక తహసీల్దార్‌ భద్రాచలం(తెలంగాణ) ఐటీడీఏ సమీపంలోని హౌసింగ్‌ అతిథి గృహం ఏర్పాటు చేశారు. ఇది ఎంపీతోపాటు ఆమె అనుచరులకు నచ్చకపోవటంతో ప్రైవేటు లాడ్జిలో అనుచరులకు సరిపడా గదులు ఏర్పాటు చేయాలని తహసీల్దార్‌పై ఒత్తిడి చేశారు. వారి సూచన మేరకు తహసీల్దార్‌ చిట్టిబాబు పట్టణంలోని ప్రైవేటు లాడ్జిలో గదులు ఏర్పాటు చేసేలోగానే ఎంపీ వర్గీ యులు దత్త రెసిడెన్సీకి వెళ్లి అక్కడ బస చేశారు.



ఎంపీ సైతం అదే లాడ్జిలో బస చేసినట్లు తహసీల్దార్‌ తెలిపారు. భోజనాలు ముగిసిన తర్వాత రాత్రి 9.30 నుంచి 10 గంటల సమయంలో తహసీల్దార్‌ను వారు ఉన్న లాడ్జికి పిలిపించుకున్నారు. ఎటపాక మండల టీడీపీ నాయకుడి ఫిర్యాదులతో రెచ్చిపోయిన ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి గొల్లా ప్రదీప్‌రాజు తనను గదిలో నిర్బంధించి, అక్కడున్న టీడీపీ నాయకులను తనపై దాడికి ఉసిగొల్పినట్లు తహసీల్దార్‌ చిట్టిబాబు పోలీ సులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మెడపట్టి గది బయటకు గెంటేశారని పీఏతోపాటు అక్కడున్న ఎంపీ అనుచరులు సైతం దుర్భాషలాడారని తెలిపారు. గదిలో పెట్టి కొట్టాలంటూ ఇస్టానుసారంగా తనను దూషించారని తహసీల్దార్‌ విలేకరుల ముందు కంటతడిపెట్టారు. తీవ్ర మనోవేదనకు గురైన తహసీల్దార్‌ చిట్టిబాబు తనపై ఎంపీ పీఏ, అతడి అనుచరులు చేసిన దాడి గురించి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, రంపచోడవరం ఐటీడీఏ పీవో, పోలీస్‌ అధికారులకు తెలియజేశారు. అనంతరం  భద్రాచలం ఎస్సై కరుణాకర్‌కు ఫిర్యాదు అందజేశారు. తహసీల్దార్‌ ఫిర్యాదుతో ఎంపీ గీత వ్యక్తిగత కార్యదర్శి ప్రదీప్‌రాజుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top