నిన్న కాక మొన్న వచ్చినవారికా టిక్కెట్..?

నిన్న కాక మొన్న వచ్చినవారికా టిక్కెట్..? - Sakshi


హైదరాబాద్: ఎమ్మెల్సీ టికెట్ జూపూడి ప్రభాకరరావుకు ఖరారు చేయడం పట్ల టీడీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి రగులుకుంది. ఇటీవలే పార్టీలోకి వచ్చిన జూపూడికి  ఎమ్మెల్సీ టికెట్ ఎలా ఇస్తారంటూ సదరు నేతలు పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. పార్టీనే నమ్ముకుని ఏళ్ల తరబడి సేవ చేస్తున్న దళిత నేతలకు అన్యాయం చేశారని వారు మండిపడుతున్నారు. ఇదేనా దళితులకు చేసే న్యాయమని పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



గతంలో 24 గంటలూ చంద్రబాబును తిట్టిన జూపూడికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై వారు నిప్పులు చెరుగుతున్నారు. ఎమ్మెల్సీ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ స్పీకర్ ప్రతిభాభారతి, కుతూహులమ్మ, వర్ల రామయ్య, జేఆర్ పుష్పరాజ్, మసాల పద్మజ, బల్లి దుర్గా ప్రసాద్ తీవ్ర నిరాశతో ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వకపోవడంపై సీమాంధ్ర ప్రాంతంలోని ఓ సామాజిక వర్గం నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల ముందు తమ సామాజిక వర్గం వెంటపడిన చంద్రబాబుకు ఇప్పుడు మేం గుర్తుకు రాలేదా? అంటూ మండిపడుతున్నారు.



నమ్ముకున్న పార్టీ అన్యాయం చేసిందంటూ అనుచరులు వద్ద కడప టీడీపీ సీనియర్ నేత లింగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కొంతమంది కార్పొరేట్ నేతలు ఎమ్మెల్యే టికెట్ రాకుండా తనను అడ్డుకున్నారని లింగారెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఇస్తానని మాట ఇచ్చిన చంద్రబాబు తన హామీ నిలబెట్టుకోలేదని లింగారెడ్డి మనస్తాపం చెందుతున్నారు.


మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి... టీడీపీ చేరిన సంగతి తెలిసిందే. నిన్న కాక మొన్న వచ్చిన ఈ నేతకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించడం పట్ల పార్టీకి చెందిన దళిత నేతలతోపాటు ఇతర నాయకులు మండిపడుతున్నారు.   ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఎమ్మెల్యే కోటాలో నాలుగు స్థానాలకు జూన్ 1వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.


ఈ నేపథ్యంలో టీడీపీ ఓ స్థానాన్ని మిత్ర పక్షమైన బీజేపీకి కేటాయించింది. మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత పాలడుగు వెంకట్రావ్ ఆకస్మిక మృతితో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయిన సంగతి విదితమే. ఆ ఎమ్మెల్సీ స్థానానికి జూపూడి ప్రభాకరరావును టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపిక చేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top