నన్ను ఆమెలాగే గౌరవించాలి

నన్ను ఆమెలాగే గౌరవించాలి - Sakshi


నన్ను పార్టీ నేతలందరూ ఆమెను గౌరవించిన మాదిరిగానే గౌరవించాలి అంటున్నారట తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలనే నియమితులైన ఓ నేత. టీడీపీ అధినేతకు దగ్గరివాడైన ఆ నేత గత కొద్ది రోజుల వరకూ ఏ పదవి లేకుండానే ఇప్పటి వరపార్టీనేతల నుంచి ఎనలేని గౌరవం పొందారు. ప్రధాన కార్యదర్శి అయ్యాక ఆ గౌరవం మరింత పెరిగింది. అయితే ఈ గౌరవం ఆయనకు సరిపోలేదట. పొరుగు రాష్ట్రంలోని ఓ అధికార పార్టీకి చెందిన మహిళా నేతకు ఆ పార్టీ నేతలు ఎలాంటి గౌరవం ఇస్తున్నారో అలాంటి గౌరవమే తనకు కావాలని సన్నిహితుల దగ్గర అంటున్నారట.



మన పక్క రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన మహిళా నేతకు పార్టీ నేతలు ఎనలేని గౌరవం ఇస్తారు. ఆమె తన నివాసం తొలి అంతస్తు పోర్టికోలో నిలబడి ఉంటే మంత్రుల నుంచి సాధారణ పార్టీ కార్యకర్తల వరకూ ప్రతి ఒక్కరూ ఆమెకు వంగి వంగి సలాములు చేసి భక్తిని చాటుకుంటారు. ఆమెతో మాట్లాడాలనుకుంటే ఆమడదూరంలో నిలబడి నోటికి తమ అరచేతిని అడ్డం పెట్టుకుని సంభాషిస్తారు. ఆమెకు ఏదైనా అనుకోని అవాంతరం ఎదురైతే పార్టీ నేతలు, కార్యకర్తలు ఏమాత్రం సహించరు. తమ విశ్వరూపం చూపిస్తారు.



తనతో కూడా నేతలు అలానే మెలగాలని, అదే గౌరవం  ఇవ్వాలని, ఏదైనా ఇబ్బంది తనకు ఎదురైతే పార్టీ  పైస్థాయి నేతల నుంచి సామాన్య కార్యకర్త వరకూ అదే స్థాయిలో స్పందించాలని ఈ కొత్త నేత అంటున్నారట. ఇటీవలి కాలంలో తన సన్నిహితులు ప్రతి ఒక్కరికీ మన పార్టీ వారు కూడా పొరుగు రాష్ర్టంలోని మహిళా నేతకు  ఆ పార్టీ వారు ఎలాంటి గౌరవం ఇస్తున్నారో అలా నాకు గౌరవం ఇచ్చేలా తయారు చేయండి అని బోధిస్తున్నారట.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top