ధరల యుద్ధానికి తెరతీసిన టాటా మోటార్స్

ధరల యుద్ధానికి తెరతీసిన టాటా మోటార్స్

న్యూఢిల్లీ : కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో టాటా మోటార్స్ ధరల యుద్ధానికి తెరతీసింది. ఎంతో కాలంగా వేచిచూస్తున్న కొత్త కాంపాక్ట్ సెడాన్ టీగోర్ ను  టాటా మోటార్స్ ఆవిష్కరించేసింది. ప్రారంభ ధర 4.7 లక్షల రూపాయలకు(ఎక్స్ షోరూం ఢిల్లీ) దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో లీడర్ గా ఉన్న మారుతీ సుజుకీ సిఫ్ట్ డిజైర్ కంటే తక్కువ ధరకే దీన్ని లాంచ్ చేసింది. కాగ మారుతీ సుజుకీ సిఫ్ట్ డిజైర్ ధర 5.35 లక్షల రూపాయలు. దీని కంటే 65వేల రూపాయలు నుంచి రూ.85 రూపాయలు తక్కువగానే టీగోర్ మార్కెట్లోకి వచ్చింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లలో ఎనిమిది వేరియంట్లలో టీగోర్ అందుబాటులో ఉండనుంది. టాప్-ఎండ్ పెట్రోల్ వేరియంట్ ధర రూ.6.19 లక్షలు కాగా.. టాప్-ఎండ్ డీజిల్ వేరియంట్ ధర రూ.7.09 లక్షలు.

 

ఆరు రంగుల్లో దీన్ని కంపెనీ ఆవిష్కరించింది. ప్రొడక్ట్ పోర్ట్ ఫోలియాను కంపెనీ విస్తరించుతుందని టీగోర్ లాంచింగ్ సందర్భంగా టాటా మోటార్స్ ఎండీ గుయెంటర్ బట్స్చెక్ చెప్పారు. కొత్త కస్టమర్లను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఎల్ఈడీ టైల్ ల్యాంప్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మల్టి డ్రైవ్ మోడ్, ఫులీ ఆటోమేటెడ్ క్లైమేట్ కంట్రోల్, రివర్స్ కెమెరా దీనిలో ఫీచర్లు. డ్రైవర్కి, ముందు కూర్చునే ప్రయాణికుడికి ఇద్దరికీ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి.  స్పీడ్ సెన్సింగ్ ఆటో లాక్ డోర్ తో ఇది రూపొందింది. 650 టచ్ పాయింట్లు, 500 పైగా సర్వీసు టచ్ పాయింట్లలో టీగోర్ ఉంది. మరో 200 సేల్స్ టచ్ పాయింట్లను పెంచాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. 

 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top