యాభై ఏళ్ల కిందటే దేశ భవితవ్యాన్ని తరిమెల చెప్పారు

యాభై ఏళ్ల కిందటే దేశ భవితవ్యాన్ని తరిమెల చెప్పారు - Sakshi


‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి

హైదరాబాద్ :
రానున్న కాలంలో భారతదేశం పెట్టుబడిదారీ వ్యవస్థలో మునిగితేలుతుందనే విషయాన్ని  తరిమెల నాగిరెడ్డి 50ఏళ్ల క్రితమే చెప్పి దేశస్థితిని అంచనా వేశారని ‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియుల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అన్నారు. ఆయన చెప్పినది నూటికి నూరు శాతం ఇప్పుడున్న ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయన్నారు. తరిమెల నాగిరెడ్డి శతజయంతి’ వేడుకలు గురువారం సుందరయ్య భవన్‌లో ‘తరిమెల నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్టు’ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.



ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న రామచంద్రమూర్తి మాట్లాడుతూ పలువురు నాగిరెడ్డి గురించి వ్యాసం రాయమని తనను సంప్రదించినా రాయలేదన్నారు. ఆయన గురించి రాసేటంత పరిజ్ఞానం, సాన్నిహిత్యం తనకు లేకపోవడమే అందుకు  కారణమన్నారు. కానీ కమ్యూనిస్టు ఉద్యమంలో నాగిరెడ్డి పాత్ర, ఆర్థిక శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తీరు, ప్రపంచ విషయాల పట్ల ఆయనకున్న అపార అవగాహన వంటి విషయాలను తెలుసుకొన్నానని తరిమెల గొప్పతనం గురించి  కొనియాడారు.



ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ మాట్లాడుతూ నాగిరెడ్డి రాసిన ‘తాకట్లో భారతదేశం’ పుస్తకం తనను ఎంతగానో ప్రభావితం చేసి ఉద్యమం వైపు నడిపించిందన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి కె.ఆర్.వేణుగోపాల్ మాట్లాడుతూ 1957 సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన నాగిరెడ్డి శాసనసభలో సభ్యుల తీరు చూసి ఆవేదన చెందారన్నారు. విప్లవోద్యమ నిర్మాణానికి పూనుకోవాల్సిన సమయాన్ని ఇక్కడ నిరర్థక చర్చలతో దుర్వినియోగం చేయకూడదని భావించి 1969 మార్చి 16న శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి పోరాటాన్ని కొనసాగించారన్నారు.



ట్రస్ట్ నిర్వాహకుడు ఘంటా వెంకటరావు అధ్యక్షతన జరిగిన సభలో తొలుత నాగిరెడ్డి చిత్రపటానికి అతిథులంతా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ‘ప్రజాసేవలో తరిమెల నాగిరెడ్డి’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.   జనశక్తి ఎడిటర్ పి.జశ్వంత్, సీనియర్ సంపాదకుడు రాఘవాచారి తదితరులు పాల్గొన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top