రేపు టంగుటూరులో జగన్ ధర్నా

రేపు టంగుటూరులో జగన్ ధర్నా - Sakshi


♦ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్

♦ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఓదార్చనున్న ప్రతిపక్ష నేత

 

 సాక్షి, హైదరాబాద్ : పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 30న ప్రకాశం జిల్లా టంగుటూరులో ఒకరోజు ధర్నా చేయనున్నారు. గిట్టుబాటు ధర లభించక గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం జిల్లాలో ముగ్గురు పొగాకు రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొగాకు రైతుల పక్షాన జగన్ ధర్నాకు పూనుకుంటున్నారని ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి చెప్పారు.



ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 30న జగన్ తొలుత ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఓదారుస్తార ని చెప్పారు. ఆత్మహత్యలు పునరావృతం కాకుండా తన పర్యటనలో భరోసా కల్పిస్తారని తెలిపారు. అనంతరం టంగుటూరు పొగాకు కొనుగోలు కేంద్రంలో ధర్నా చేస్తారని వెల్లడించారు.



 ముందే హెచ్చరించినా  పట్టించుకోని సీఎం

 పొగాకు రైతుల దుస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరే కారణమని అశోక్‌రెడ్డి విమర్శించారు. మార్చిలో ప్రారంభమైన పొగాకు కొనుగోళ్లు జూలై 17 నాటికే ముగియాల్సి ఉండగా ఇంకా కొనసాగుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. జగన్ గతంలో పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిని సందర్శించినపుడే పొగాకు కొనుగోళ్లలో రాబోయే ఇబ్బందులపై ముందుగానే హెచ్చరించారనీ, అయినా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు.



గిట్టుబాటు ధర రావడం లేదనే విషయాన్ని తమ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహచర ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళితే.. ఎ-గ్రేడ్ పొగాకు కిలోకు రూ.113 నుంచి రు 118 వరకు, లో గ్రేడ్‌కు రూ.60 నుంచి రూ.67ల వరకూ చెల్లిస్తామని చెప్పారని, అయితే అది అమలు కావడం లేదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితే వస్తే అన్ని రకాల ప్రయత్నాలు చేసి కిలోకు రూ.199 ధర వచ్చేలా చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం రూ.105 కూడా రాని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

 ఎవరు సైంధవుడు?

 రాష్ట్ర అభివృద్ధికి జగన్ సైంధవుడిలా అడ్డుపడుతున్నారంటూ మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాథరెడ్డిలు చెప్పడం బాధాకరమని అశోక్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటానికి సిద్ధపడిన జగన్ సైంధవుడా? లేక హోదా వద్దు ప్యాకేజీలు చాలంటూ ప్రతిపక్ష నేత దీక్షను అడ్డుకుంటున్న చంద్రబాబు సైంధవుడా? చెప్పాలని మంత్రులను నిలదీశారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జగన్‌ను విమర్శించడం సరికాదన్నారు.

 

 జాషువాకు వైఎస్సార్‌సీపీ నివాళి

  సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కవి గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకుని సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులర్పించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ముఖ్య నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వి.విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎస్.దుర్గా ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ తదితరులు జాషువా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top