మా ఉత్తర్వులు అమలవ్వాల్సిందే


ఎస్‌వైఎల్‌ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాలు



న్యూఢిల్లీ: పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన సట్లెజ్‌–యమునా అనుసంధాన కాలువ(ఎస్‌వైఎల్‌)పై తమ ఆదేశాలను ఉల్లంఘించరాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. తమ ఉత్తర్వులను ఎలా అమలుచేయాలనేది ఆ రెండు రాష్ట్రాలపైనే ఆధారపడి ఉంటుందని జస్టిస్‌ పీసీ ఘోష్, జస్టిస్‌ అమితవ రాయ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. కోర్టు ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని కోరుతూ హరియాణా దాఖలుచేసిన పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని కేంద్రం, పంజాబ్‌లను బెంచ్‌ కోరింది. కాలువ నిర్మాణంపై యథాతథస్థితి కొనసాగేలా జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను అమలుచేయాలని స్పష్టంచేసింది.



కాలువ ఆస్తులు, భూముల స్వీకర్తలుగా కోర్టు నియమించిన కేంద్ర హోం శాఖ కార్యదర్శి, పంజాబ్‌ ప్రధాన కార్యదర్శి, పంజాబ్‌ డీజీపీలు సమర్పించిన నివేదికలు అక్కడ యథాతథస్థితి కొనసాగుతోందని సూచిస్తున్నట్లు పేర్కొంది. హరియాణా తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది జగదీప్‌ ధన్‌కర్‌ హోంశాఖ కార్యదర్శి నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాలువ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించిన కమిటీ అక్కడ ఎలాంటి ‘ఉద్దేశపూర్వక’ ధ్వంసం జరగలేదని పేర్కొందని, నివేదికలోని ‘ఉద్దేశపూర్వక’ పదంపై సందేహాలున్నాయని తెలిపారు.



కేంద్ర హోం శాఖ తరఫున కోర్టు విచారణలో పాల్గొన్న సొలసిటర్‌ జనరల్‌ రంజిత్‌కుమార్‌ మట్లాడుతూ.. దీనికి వారంలో బదులిస్తామని తెలిపారు. పంజాబ్‌ ఒప్పంద రద్దు చట్టం–2004ను హరియాణా సవాలుచేయలేదని, అందువల్ల దాన్ని పక్కనపెట్టలేదని కూడా వెల్లడించారు. ఈ చట్టం రద్దయ్యే వరకూ  సుప్రీంకోర్టు ఆదేశాలు అమలుకాలేవని కుండబద్దలు కొట్టారు. ఈ వివాదంలో కేంద్రం జోక్యం చేసుకుని సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని పంజాబ్‌ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది రాంజెఠ్మలానీ అన్నారు.  

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top