నిత్యానందా... ఏమిటిదంతా?

నిత్యానందా... ఏమిటిదంతా?


నిత్యా'ఆనందం'లో మునిగితేలే స్వాములోరికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. శిష్యురాళ్ల 'అంతరంగిక సేవ'తో తరించే ఈ స్వయంప్రకటిత దేవుడికి పట్టరాని కోపం వచ్చింది. తన ప్రవచనాలతో భక్తులకు జ్ఞానబోధ చేసే ధ్యాన పీఠాధిపతి ఒంటికాలిపై లేచారు. తనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అలగా జనంపై స్వాములోనే చెణుకులు విసిరి చిక్కుల్లో పడ్డారు.



అయినా చిక్కుల్లో పడడం చాకచక్యంగా తప్పించుకోవడం నిత్యానందుల వారికి 'వీడియో'తో పెట్టిన విద్య. అనుంగు శిష్యురాలు రంజితతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు రెచ్చకెక్కినప్పడు స్వాములోరు చూపిన సాహసం నిరూపమానం. తన దగ్గర 'విషయం' లేదని... విషయం లేకుండా వ్యవహారం ఎలా సాధ్యమంటూ ఎవరూ ఊహించని షాక్ ఇచ్చారు. దీంతో అంతవరకు స్వామిపై ఉన్న కోపం తగ్గిపోయి జాలి కలిగింది.



'రంజిత'నందాన్ని కొంతకాలం పక్కనపెట్టి పర్వత ప్రాంతాలకు పోతే అక్కడ కూడా స్వామలోరికి సుఖం లేదు. నిత్యానందుడు పర్వత సరస్సుల్లో విహరిస్తున్నారని ఛాయా చిత్రాలతో బయటపెట్టింది పాడులోకం. అన్ని మర్చిపోయి హాయిగా భక్తులతో కాలక్షేపం చేస్తున్న సర్వసంగ పరిత్యాగిని మళ్లీ యాగీ చేయడం న్యాయమా?



అందుకో కాబోలు స్వామిలోరికి అంత కోపం వచ్చింది. కన్నడ భాష పేరిట తనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారంతా డబ్బులు తీసుకుంటున్నారంటూ మండిపడ్డారు. 300 రూపాయల కోసం ఆశపడి మూడు గంటల ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. నిజానికి వారికి తనపై కోపం లేదని జాలి చూపారు. ఉద్యమానికి నేతృత్వం వహించే వారే కార్యకర్తల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని పరమ సత్యం వెల్లడించారు. నిత్యానందుల వారికి అంతా అలా తెలిసిపోతుటుంది మరి!

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top