అద్దె గర్భానికి అన్యాయం

అద్దె గర్భానికి అన్యాయం


దిక్కుతోచని స్థితిలో అనాథగా మారిన ‘సరోగసీ’ మహిళ

హైదరాబాద్‌లో చట్టవిరుద్ధంగా సరోగసీ ప్రక్రియ చేసిన ఓ ప్రైవేటు ఆస్పత్రి

పుట్టబోయేది ఆడపిల్ల అని నిర్దాక్షిణ్యంగా వదిలేసిన సదరు దంపతులు

ఆ ఆస్పత్రి కూడా పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి




సాక్షి, హైదరాబాద్‌

సరోగసీ (అద్దెగర్భం) ప్రక్రియ మరో అమాయక మహిళ పాలిట శాపంగా మారింది. గర్భంలో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలియడంతో ‘సరోగసీ’ దంపతులు ఆమెను నిర్దాక్షిణ్యంగా వదిలేశారు. పుట్టేబిడ్డకు, మాకు ఎలాంటి సంబంధం లేదంటూ అర్ధంతరంగా వెళ్లిపోయారు. సరోగసీ ప్రక్రియను చేసిన వైద్యులూ ఆమెను మోసం చేశారు. నెలలు నిండి దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఆమె హైదరాబాద్‌లోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. మూడు రోజుల కిందట పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. నా అన్నవారు లేక, పట్టించుకునే వారు లేక, అనారోగ్యంతో సతమతమవుతోంది. అయితే ఈ సరోగసీ, మోసం విషయం బయటపడకుండా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం పేట్లబురుజు ఆస్పత్రిలో ఆమెను అత్యవసర విభాగంలో ఉంచి, అటువైపు ఎవరూ వెళ్లకుండా భద్రత ఏర్పాటు చేయడం గమనార్హం.



వదిలేసి వెళ్లిపోయిన దంపతులు

మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకులకు చెందిన ఓ మహిళ (24) భర్తతో విభేదాల కారణంగా కొంతకాలంగా భర్త నుంచి దూరంగా ఉంటోంది. ఆమెకు ఏడాది కింద ఓ మధ్యవర్తి ద్వారా గుంటూరు జిల్లాకు చెందిన దంపతులు పరిచయమయ్యారు. వారికి పిల్లలు లేకపోవడంతో.. సరోగసీ విధానంలో వారికి బిడ్డను కనిచ్చేందుకు అంగీకారం కుదిరింది. ఇందుకు మరో మహిళ మధ్యవర్తిగా వ్యవహరించింది. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రాంతంలో ఉన్న ఓ ఆస్పత్రిలో ‘సరోగసీ’ప్రక్రియను చేయించుకున్నారు. సుధారాణికి 8వ నెల వచ్చే వరకు అంతా బాగానే ఉంది. అయితే 9వ నెలలో స్కానింగ్‌ చేసినప్పుడు పుట్టబోయేది ఆడపిల్ల అని ఆ ఆస్పత్రి వైద్యులు చెప్పారు. దీంతో బిడ్డను పొందాలనుకున్న దంపతులు ‘సరోగసీ’మహిళను అర్ధంతరంగా వదిలేశారు. పుట్టబోయే బిడ్డకు తమకు సంబంధం లేదంటూ వెళ్లిపోయారు. సరోగసీ ప్రక్రియ చేసిన ప్రైవేటు ఆస్పత్రి ఆ మహిళను రానివ్వలేదు.



పేట్లబురుజు ఆస్పత్రిలో అనాథలా..

ఆ మహిళకు ప్రసవ నొప్పులు రావడంతో సరోగసీకి మధ్యవర్తిగా వ్యవహరించిన మరో మహిళ ఆమెను హైదరాబాద్‌లోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రికి తీసుకొచ్చింది. ఈ నెల 20న మధ్యాహ్నం 12 గంటలకు ఆస్పత్రిలో చేర్చగా.. మధ్యాహ్నం 2.40 గంటలకు పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. పాప 2.9 కేజీల బరువుతో ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే తల్లి మాత్రం తీవ్ర రక్తహీనతతో బాధపడుతూ.. అనారోగ్యంతో ఉందని తెలిసింది. అయితే చట్టవిరుద్ధంగా ‘సరోగసీ’, మోసం విషయాలు బయటపడకుండా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగా తల్లీబిడ్డలను ప్రత్యేకంగా ఐసీయూలో ఉంచారని.. ఎవరూ అటువైపు వెళ్లకుండా భద్రత ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ‘సాక్షి’ప్రతినిధులు బాధిత మహిళను కలవడానికి బంధువులమంటూ వెళ్లినా సిబ్బంది అనుమతించలేదు.



ఇలా బయటపడింది

సుధారాణికి సాధారణ ప్రసవం జరిగి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నా కూడా.. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఆ పాపను నర్సరీ విభాగానికి పంపారు. నర్సులు పాపను నర్సరీకి తీసుకెళ్లగా.. అక్కడి ఇన్‌చార్జి వైద్యురాలు బిడ్డను పరిశీలించి, ‘ఆరోగ్యంగానే ఉంది కదా.. ఎందుకు తెచ్చారు?’అని నిలదీశారు. పాప వివరాలన్నీ ఇవ్వాలని కోరగా.. నర్సులు పత్రాలన్నీ తెచ్చి ఇచ్చారు. వాటిని పరిశీలించిన వైద్యురాలు... ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సరోగసీ ద్వారా బాధిత మహిళ గర్భం దాల్చినట్లు గుర్తించారు. ఆరోగ్యంగా ఉన్న పాపను నర్సరీలో ఉంచాల్సిన అవసరం లేదని, తల్లివద్దే ఉంచాలని స్పష్టం చేశారు. దీంతో పాపను ఐసీయూకు మార్చారు. పాపకు ఏమైనా అయితే తీవ్ర సమస్యలు వస్తాయని.. తల్లీబిడ్డ డిశ్చార్జి అయ్యేవరకు కంటికి రెప్పలా కాపాడాలని సూపరింటెండెంట్‌ పీజీ వైద్యులకు సూచించినట్లు ఓ పీజీ విద్యార్థిని ‘సాక్షి’కి తెలిపారు.



గుట్టుగా విచారణ

పేట్లబురుజు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నాగమణి బాధిత మహిళ అంశంపై జిల్లా వైద్యాధికారికి, చార్మినార్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చార్మినార్‌ పోలీసులు, జిల్లా వైద్యాధికారి శుక్రవారమే పేట్లబురుజు ఆస్పత్రికి వచ్చి బాధితురాలితో మాట్లాడారు. కానీ ఈ విచారణ గుట్టుగా సాగడం గమనార్హం. కాగా బాధిత మహిళను ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశముందని సమాచారం.



కేసును నీరుగార్చే యత్నం

నిబంధనలకు విరుద్ధంగా సరోగసీ చేసి, ఇప్పుడు వదిలేసిన ఆస్పత్రి యాజమాన్యం, దంపతుల విషయం బయటపడకుండా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకోసమే ఈ విషయంలో గోప్యత పాటిస్తున్నారని పేట్లబురుజు ఆస్పత్రి సిబ్బందే పేర్కొంటున్నారు. మీరైనా ఆ మహిళకు న్యాయం చేయాలని ‘సాక్షి’ప్రతినిధితో వారు వాపోవడం గమనార్హం. ప్రస్తుతం బాధిత మహిళకు సరోగసీలో మధ్యవర్తిగా వచ్చిన మహిళే సహాయకురాలిగా ఉందని.. ఆమె వెళ్లిపోతానంటే పోలీస్‌ కేసు పెడతామని బెదిరించడంతో ఉండిపోయిందని వారు తెలిపారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top