ఢిల్లీలో రాయబేరాలు

జైట్లీతో భేటీ అనంతరం మీడియాతో సుజనా - Sakshi


- కేంద్రమంత్రులతో సుజనా చర్చలు

- అమిత్‌షాతోనూ సమాలోచనలు

- హోదా, ప్యాకేజీపై మాట్లాడామన్న సుజనా

- బాబు సూచనలమేరకేనని వెల్లడి

- కానీ అసలు సంగతి వేరే...

- ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రెండు తీర్పులు


 

సాక్షి, న్యూఢిల్లీ: ‘స్విస్ చాలెంజ్’పై అటు హైకోర్టు మొట్టికాయలు, ‘ఓటుకు కోట్లు’పై ఇటు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ వేదికగా రాయబేరాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశంపై ప్రయత్నాలు వేగిరపరుస్తున్నట్లు కనిపిస్తూనే ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే మార్గాల కోసం కేంద్ర మంత్రులతోనూ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాతోనూ సమాలోచనలు జరిపిస్తున్నారని వినిపిస్తోంది. రెండురోజులుగా చంద్రబాబునాయుడుతో ఫోన్‌లో మాట్లాడుతూ ఆయన చేస్తున్న సూచనలు పాటిస్తూ కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతున్నానని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి వై.సుజనాచౌదరి  చెప్పడం దీనిని బలపరుస్తోంది. 



మంగళవారంనాడు కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడుతో కలసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో సుజనాచౌదరి భేటీ అయ్యారు. తర్వాత సాయంత్రం అరుణ్‌జైట్లీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రత్యేక హోదాపై ప్రజల్లో భావోద్వేగాలు పెరుగుతున్న నేపథ్యంలో ఏదో ఒక ప్యాకేజీ ప్రకటించి ప్రస్తుత సంక్షోభ పరిస్థితి నుంచి గట్టెక్కించాల్సిందిగా కేంద్రాన్ని చంద్రబాబు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో ప్రత్యేకహోదా కోసం చర్చలు జరుపుతున్నట్లు అనుకూల మీడియాకు లీకులు ఇవ్వడం గమనార్హం.



మరోవైపు ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా రాజకీయపరమైన పరిష్కారానికి కూడా తెలుగుదేశం నేతలు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో ‘ఓటుకు కోట్లు’ కేసు విచారణ ఉధృతమైన సందర్భంలో ఫోన్‌ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి.. కేంద్రంతోనూ మొరపెట్టుకుని బైటపడిన తరహాలోనే ఇపుడు కూడా ఈ సంక్షోభం నుంచి బైటపడేందుకు చంద్రబాబు కేంద్రంతో సంప్రదింపులు సాగిస్తున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులంటున్నారు. కాగా కోర్టు తీర్పులు, అనంతర పరిణామాలపై కేంద్రప్రభుత్వం ఆరాతీస్తున్నట్లు అధికారవర్గాలలో వినిపిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహరావు సుదీర్ఘంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.



త్వరలో ప్రకటన వెలువడే అవకాశం: సుజనా చౌదరి

కాగా సాయంత్రం అరుణ్‌జైట్లీతో భేటీ అనంతరం సుజనాచౌదరి విలేకరులతో మాట్లాడుతూ ‘ప్రత్యేక హోదా, రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలుపై చర్చించాను. రెండు రోజులుగా ముఖ్యమంత్రి ఫోన్లో పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రితో సంప్రదింపులు జరిపాను. హోదాపై కేంద్రం ఒక ముసాయిదాను రూపొందించింది. న్యాయ నిపుణులతో చర్చించాక త్వరలో ఒక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది..’ అని తెలిపారు.

 


ముసాయిదా సిద్ధం.. త్వరలో ప్రధాని వద్దకు

పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీలు, పార్లమెంట్ సాక్షిగా విభజన జరిగిన రోజు కేంద్రం ఇచ్చిన హామీల అమలు కోసం  కేంద్ర ఆర్థిక శాఖ ఒక ముసాయిదాను రూపొందించినట్టు ఆ శాఖకు చెందిన వర్గాలు తెలిపాయి. అయితే ప్రత్యేక హోదాపై కేంద్రప్రభుత్వం సానుకూలంగా ఉందా? లేకా సాంకేతిక అంశాలను సాకుగా చూపి పక్కన పెట్టిందా అన్న అంశం  ఉత్కంఠంగా మారింది. ఈ ముసాయిదాపైనే మంగళవారం ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజల నుంచి ఎదురవుతున్న ఆందోళనల దృష్ట్యా ఇందుకు గల సానుకూల, వ్యతిరేక అంశాలను కూడా చర్చించినట్టు తెలుస్తోంది.



ఈ ముసాయిదాలో ప్రత్యేక హోదా అంశాన్ని కూడా చేర్చినట్టు అధికారవర్గాలంటున్నాయి. ఈ ముసాయిదా అమలుకు వీలుగా తగిన న్యాయ సలహా తీసుకొని.. కేంద్ర ఆర్థిక శాఖ రెండు, మూడు రోజుల్లో ప్రధాన మంత్రికి సమర్పించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలా వద్దా అన్న స్పష్టత లేకుండా ఈ ముసాయిదాను రూపొందించినట్టు సమాచారం. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం ప్రతిబంధకంగా మారుతోందని ముసాయిదాలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో హామీలన్నింటినీ నెరవేర్చేందుకు అవసరమైన సాయాన్ని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని ఈ ముసాయిదాలో పొందుపరిచినట్టు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. వెనుకబడిన జిల్లాలకు ఇప్పుడు ఇస్తున్న తరహాలో స్వల్ప మొత్తంలో కాకుండా బుందేల్‌ఖండ్, కల్‌హండీ తరహాలో దాదాపు రూ. పదివేల కోట్ల వరకు ప్యాకేజీని ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top