మళ్లీ దూకేశాడుగా...

మళ్లీ దూకేశాడుగా...


స్కూల్ పిల్లగాడు తొక్కుడు బిళ్ల ఆటలో ఆ గడి నుంచి ఈ గడికి దూకినంత ఈజీగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి పార్టీలు మారుతున్నారు. తొలుత బీజేపీలో చేరిన ఆయన... ఆ తర్వాత టీఆర్ఎస్ కారు ఎక్కారు. అదీ నచ్చక కాంగ్రెస్లో చేరి ఆ నేతలతో చెట్టాపట్టాలేసుకుని... ప్రభుత్వ విప్ పదవి పొందారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా సాగుతున్నప్పుడు కూడా తనది జంపింగ్ రాగమే కాదు సమైక్య రాగం కూడా అంటూ కోరస్ లేకుండా సాంగేసుకుని మరీ జయప్రకాశ్రెడ్డి స్పష్టం చేశారు.



ఇంతలో ఎన్నికలు రానే వచ్చాయి. మళ్లీ సంగారెడ్డి నుంచి హస్తం పార్టీ తరపున పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. మళ్లీ ఏదో సభకు వెళ్లి అధ్యక్షా అననిదే మనస్సు మనస్సులో నిలిచేలా లేదు. దాంతో మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికలు వస్తున్నాయని తెలిసి హస్తం పార్టీ టిక్కెట్ కోసం ప్రయత్నించారు. అధిష్టానం మాత్రం మీరు క్యూలో ఉన్నారు అని చెప్పడంతో.. టికెట్ వస్తుందో రాదో అని అనుకుంటున్నారు. ఆ తరుణంలో మెదక్ జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ... అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ టిక్కెట్ కోసం బీ ఫారం అడిగితే డీసీసీ పీఠం ఎవడికీ కావాలని అంటూ మీకు మీ పార్టీకో దణ్ణం అంటూ కాంగ్రెస్కి రాం రాం చెప్పారు. ఆ సమయంలోనే ఉప ఎన్నికల్లో గెలిచే అభ్యర్థి కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుందని తెలిసి... ఆ నాయకులను కలిశారు.



అదీకాక ఆ పార్టీ తరఫున పోటీ చేస్తే తన 'సమైక్య రాగం' సెంటిమెంట్ తనకు ఆయింట్మెంట్లా పనికొస్తుందని భావించారు. ఎలాగోలా టీడీపీ పొత్తుతో బీజేపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు. కానీ ఉప ఎన్నికల్లో కారు దెబ్బకు కమలం మూడో స్థానంలోకి చేరింది. కాంగ్రెస్లోనే ఉంటే పార్టీ విజయం సాధించి ఉండేదేమో అనే జయప్రకాశ్ రెడ్డి మీమాంసలో పడ్డారు. నాటి నుంచి మనశాంతి కరువైంది. కాంగ్రెస్లో ఉన్న మనశాంతి నేడు లేదని భావించిన ఆయన హస్తంలో చేరేందుకు ఆ పార్టీ నేతల చుట్టు ప్రదక్షణాలు చేశారు.



ఢిల్లీ వెళ్లి మరీ అధిష్టానం పెద్దలను కూడా కలసి తన పరిస్థితి వివరించారు. మెదక్ అంటేనే కేసీఆర్... కేసీఆర్ అంటేనే మెదక్ అనే రేంజ్లో ఉంది  ప్రస్తుత పరిస్థితి. ఈ తరుణంలో టీఆర్ఎస్పై విమర్శలు చేసే తెలంగాణలో పెద్ద తలకాయిగా ఉన్న డీఎస్ కూడా కారు ఎక్కేశారు. సీఎల్పీ నేత జానారెడ్డి కూడా టీఆర్ఎస్ నేతలను విమర్శించాలంటే పద్దతిగా మాట్లాడతారు.



దాంతో టీ కాంగ్రెస్కు 'నోరున్న' నేత కోసం ఆ పార్టీ నేతలు వెతుకుతున్నారు. దాంతో తూర్పు జయప్రకాశ్రెడ్డి నోరున్న నేత కావడంతో సదరు నేతలు కాంగ్రెస్లోకి ఆహ్వానించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవలే హస్తం పార్టీ పెద్దల సమక్షంలో వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ ఆయన కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీ వీడటమే తాన జీవితంలో చేసిన పెద్ద తప్పు అని ఈ సందర్భంగా చెప్పిన జయప్రకాశ్రెడ్డి మళ్లీ ఆ తప్పు చేయకుండా ఉంటారా ? ఏమో... .

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top