ఏ నిమిషానికి ఏమి జరుగునో...

ఏ నిమిషానికి ఏమి జరుగునో... - Sakshi


తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇంకేముంది కాంగ్రెస్ ఖాతాలో 100 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు గ్యారంటీ అంటు అధిష్టానం వద్ద గప్పాలు చెప్పి... ప్రత్యేక రాష్ట్ర సాధనలో టీ కాంగ్రెస్లోని పలువురు నేతలు కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండు డజన్లు ఎమ్మెల్యే సీట్లు కూడా రాలేదు. సరికదా రెండే రెండు ఎంపీ స్థానాలతో సరిపెట్టుకుంది.


రాష్ట్రం ఇచ్చిన ఓడిపోయాం... ఏం చేస్తాం భవిష్యత్తుపై దృష్టి పెట్టడంటూ అధిష్టానం ఆదేశించినా... ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మొండి చెయ్యే మిగిలింది. అదికాక అధికార పార్టీ అకర్షణ ఆకర్ష్కి హస్తం వదిలి ఎవరికీ వారు కారేక్కేస్తున్నారు. ఏ నిమిషానికి ఏమి జరుగునో.... ఎవరు కారు ఎక్కునో  అని టీ కాంగ్రెస్ నేతలు ఒకరి వంక ఒకరు సందేహంగా చూసుకుంటున్నారు. అందుకు టీ కాంగ్రెస్లో ఇటీవల తాజాగా నెలకొన్న పరిస్థితులే అందుకు ఉదాహరణ.



సికింద్రబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ టీఆర్ఎస్లోకి జంప్ అంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఆమె కుమారుడు హీరోగా నటించిన చిత్రం ఆడియో ఫంక్షన్కు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకావడంతో ఈ పుకార్లకి మరింత బలం చేకూరింది. వచ్చేది వర్షాకాలం కాదు... గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కాలం అంటూ కంగారు పడిన టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, సీఎల్పీ నాయకుడు జానారెడ్డి ... ఫోన్ చేసి జయసుధని వివరణ కోరారు. అదేమీ లేదు. అదంతా ఒట్టిదే అంటూ ఆమె వివరణ ఇచ్చుకోవడంతో హమ్మయ్యా అంటూ హస్తం నేతల మనసు తెలిక పడింది.



ఆ ఘటన జరిగి వారం రోజులు అయిందో లేదో కానీ ఉమ్మడి అంధ్రప్రదేశ్కు రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన డీ శ్రీనివాస్   ఉరుములు మెరుపులు లేకుండా ఇంకా చెప్పాలంటే ఏ మాత్రం ఊహకందని విధంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించేశారు. కారు ఎక్కేందుకు ముహుర్తం కూడా ఖరారై పోయింది.


అయితే దాదాపు ' థర్టీ ఇయర్స్కి పైగా ఇక్కడ పాలిటిక్స్' అంటూ  'చేతి' వేళ్లు పట్టుకుని మరీ నడిచి...  ఒకానొక సమయంలో అధిష్టానం తలలో నాలుకలా మసలిన డీ శ్రీనివాస్యే హస్తానికి హ్యాండ్ ఇచ్చేశారు. దాంతో హస్తం పార్టీ వేళ్లు పట్టుకుని ఎవరు నడుస్తారో ఎవరు విడిచి వెళ్తారో... ఏ నిమిషానికి ఏమీ జరుగునో...  అని టీ కాంగ్రెస్ నేతల్లో గుబులు మొదలైంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top