ఆయనగారికి 'అలకలు అలవాటే'

ఆయనగారికి 'అలకలు అలవాటే' - Sakshi


(వెబ్సైట్ ప్రత్యేకం)

టికెట్ ఇవ్వలేదంటే అలక పాన్పు ఎక్కడం ఆయనకు అలవాటే. అలకబూనటం, ఆ తర్వాత ఆయనగారిని బుజ్జగించటం మామూలే. పార్టీ సీనియర్ నాయకులు వచ్చి కొద్దిగా సోప్ వేస్తే చాలు ఇలా ఐస్ అయిపోతారు. ఆయనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దానం నాగేందర్. 2004లో ఆయన గారు ఆసిఫ్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. అయితే ఆ స్థానాన్ని మరొకరికి అధిష్టానం కేటాయించింది. ఆయనకు మాత్రం సికింద్రాబాద్ లోక్సభ స్థానం ఇచ్చింది.



దాంతో పార్టీ హైకమాండ్ మీద అలక బూనారు. మీరు వద్దు మీ టిక్కెట్ వద్దు అంటూ హస్తం పార్టీకి బై బై చెప్పి.. టీడీపీ సైకిల్ ఎక్కేశారు. తీరా ఎన్నికలు జరిగి... అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. అదికాక సికింద్రాబాద్ లోక్సభ నుంచి ఆయన తప్పుకోవడంతో ఆ టిక్కెట్ అంజన్ కుమార్ యాదవ్ దక్కించుకుని... నేరుగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. దాంతో దానం తన దురదృష్టాన్ని తానే నిందించుకున్నారు.



హస్తాన్ని వీడి 'సైకిల్'పై ప్రయాణం చేసేందుకు సతమతం అయిన ఆయన కొద్దిరోజులకే  పచ్చ పార్టీకి కనీసం గుడ్ బై చెప్పకుండా హస్తం పట్టేసుకుని స్వంత గూటికి వచ్చేసి ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో మళ్లీ అసెంబ్లీకి ఎన్నికై మంత్రిగా కూడా పని చేశారు.



రాష్ట్ర విభజన తదితర పరిణామాల నేపథ్యంలో 2014 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలనే గెలుచుకుంటే... హైదరాబాద్లో మాత్రం 'చేతి'పార్టీ చతికిలపడింది. నగర అధ్యక్షుడిగా కొనసాగుతున్నా అధికారం ఉంటేనే కానీ హవా సాగదాయే అనే విషయం అర్థమైన దానం నాగేందర్ కన్ను ఎమ్మెల్సీపై పడింది.



ఎమ్మెల్సీ ఎన్నికల తరుణం రానే వచ్చింది. తాను ఆశించిన ఎమ్మెల్సీ సీటును నిజామాబాద్ జిల్లాకు చెందిన మహిళ ఆకుల లలితకు ఇవ్వడంపై ఆయన అవాక్కయ్యారు. అసలే గ్రేటర్ ఎన్నికలు తుపాకీ వదిలిన బుల్లెటూలా దూసుకు వస్తుంటే ఎవరికో టిక్కెట్ ఇవ్వడం ఏమిటని దానం మళ్లీ అలక పాన్పు ఎక్కేశారు. ఈ ఎన్నికల్లో ఐదో ఎమ్మెల్సీని కూడా తమ కారులో ఎక్కించుకోవాలని అధికార టీఆర్ఎస్ వ్యూహారచన చేస్తుంది.



ఈ నేపథ్యంలో నిలబెట్టిన ఒక్క అభ్యర్థిని గెలిపించుకోలేకపోతే  పార్టీ ఉనికి ప్రశ్నార్థంగా మారుతుందని భావించిన కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్ దూతలను రంగంలోకి దింపింది. పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, వాయిలార్ రవి తదితర నేతలంతా హైదరాబాద్లో మకాం వేసి... దానంను అలక పాన్పు నుంచి దించి... ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునే పనిలో పడ్డారు.   

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top