పాక్‌పై సైనిక చర్యకు యోచన!

పాక్‌పై సైనిక చర్యకు యోచన!


1980-81లో ఇందిర ఆలోచన.. సీఐఏ రహస్య నివేదికలో వెల్లడి

వాషింగ్టన్: దాయాది దేశం పాకిస్తాన్ అణ్వస్త్ర సామర్థ్యం  సమకూర్చుకోకుండా నిరోధించేందుకు 1980-1981లో ఆ దేశంలోని అణు పరిశ్రమలపై సైనిక చర్య చేపట్టాలని నాటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆలోచించినట్లు అమెరికాకు చెందిన గూఢచర్య సంస్థ సీఐఏ రహస్య నివేదిక చెప్తోంది. 1981 సెప్టెంబర్ 8వ తేదీతో ఉన్న 12 పేజీల ఆ పత్రాన్ని ఈ ఏడాది జూన్‌లో సీఐఏ వెబ్‌సైట్‌లో బహిర్గతం చేశారు.



‘పాకిస్తాన్‌లో అణు పరిణామాలపై భారత్ ప్రతిస్పందన’ అనే శీర్షికతో ఉన్న ఆ పత్రం సారాంశమేమిటంటే... ‘‘భారత్‌లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 1980లో మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో పాకిస్తాన్‌కు అమెరికా ఎఫ్-16 యుద్ధ విమానాలను సరఫరా చేస్తోంది. అదే సమయంలో పాక్ అణ్వస్త్రాన్ని సమకూర్చుకుంటోందని భారత్ విశ్వసించింది. అణ్వస్త్రాల్లో వినియోగించే ప్లుటోనియం, అమితంగా శుద్ధిచేసిన యురేనియంను ఉత్పత్తి చేసే చివరి దశలో పాక్ ఉంది. దీంతో పాక్ అణ్వస్త్రాన్ని సమకూర్చుకోకుండా నిరోధించేందుకు సైనిక చర్య చేపట్టాలని ఇందిర సర్కారు ఆలోచించింది.



అదే సమయంలో భారత్ అణ్వస్త్ర పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా సైన్యానికి నిర్దేశించింది. థార్ ఎడారిలో భూగర్భ పేలుడు చేపట్టేందుకు 1981 ఫిబ్రవరిలో తవ్వకం కూడా మొదలైంది. 40 కిలోటన్నుల అణ్వస్త్ర పరీక్ష నిర్వహించేందుకు మే నాటికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాకిస్తాన్ అణ్వస్త్ర పరీక్ష నిర్వహించిన వారం రోజుల తర్వాత భారత్ కూడా అణ్వస్త్ర పరీక్ష నిర్వహించనుంది.



అయితే.. పాక్ నిర్వహించబోయే అణ్వస్త్ర పరీక్ష భారత్‌కు జాతీయ ముప్పు కాబోదని భారత ప్రభుత్వం అంచనా వేసినట్లు కనిపిస్తోంది. భారత్ ముందుగా దాడి చేస్తే ఈ ప్రాంతంలో భారత్‌కు జరిగే నష్టాన్ని.. శాంతియుత అణు విస్ఫోటన కార్యక్రమాన్ని పునరుద్ధరించటం ద్వారా తగ్గించవచ్చని తలచినట్లు కనిపిస్తోంది. బహుశా ఈ ఆలోచనతో ఇందిరాగాంధీ పాక్‌పై ముందస్తు సైనిక చర్యకు అనుమతి ఇచ్చి ఉండకపోవచ్చు.’’

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top