స్టాక్స్ వ్యూ


 టీసీఎస్‌స

 బ్రోకరేజ్ సంస్థ: ఏంజెల్ బ్రోకింగ్

 ప్రస్తుత ధర: రూ.2,475

 టార్గెట్ ధర: రూ.3,350


 

 ఎందుకంటే: టీసీఎస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్ధిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆదాయ పరంగా నిరాశపరిచిన ఫలితాలు నికర లాభంలో మాత్రం అంచనాలను మించాయి. కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా కంపెనీ ఆదాయం తగ్గింది. రూ.24,219 కోట్ల ఆదాయం ఆర్జించింది.  2013-14 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌లో ఆర్జించిన ఆదాయం(రూ.21,551 కోట్లు)తో పోల్చితే ఇది 12 శాతం అధికం. అయితే గత ఆర్థిక సంవత్సరం క్యూ3 క్వార్టర్‌తో పోల్చితే 1 శాతం తగ్గింది. ఇంగ్లాండ్, ఇతర యూరోప్ దేశాలు, ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా దేశాల్లో వృద్ధి స్వల్పంగా తగ్గింది. నికర లాభం క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 9% వృద్ధితో రూ.5,906 కోట్లకు పెరిగింది. ఐపీఓకు వచ్చి పదేళ్లైన సందర్భంగా ఉద్యోగులకు రూ.2,628 కోట్ల బోనస్‌ను ఇవ్వనున్నది. దీంతో నికర లాభం రూ.3,713 కోట్లకు పరిమితమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఐటీ పరిశ్రమ 12-14 శాతం వృద్ధి సాధిస్తుందని నాస్కామ్ అంచనా వేసింది. దీని కంటే అధిక వృద్ధినే సాధించగలమని కంపెనీ ధీమా వ్యక్తం వేస్తోంది. కొత్త క్లయింట్‌ల సంఖ్య, క్లయింట్ల నుంచి ఆర్డర్ల సంఖ్య పెరుగుతోంది.

 

 డీసీబీ బ్యాంక్

 బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్

 ప్రస్తుత ధర: రూ.119

 టార్గెట్ ధర: రూ.160


 

 ఎందుకంటే: వ్యాపార వృద్ధి పటిష్టంగా ఉండటంతో గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలు అంచనాలను మించాయి. నికర వడ్డీ ఆదాయం 30 శాతం వృద్ధితో రూ.130 కోట్లకు, ఇతర ఆదాయం 38 శాతం వృద్ధితో రూ.46 కోట్లకు చేరాయి. పన్ను కేటాయింపుల రద్దు కారణంగా నికర లాభం 61 శాతం వృద్ధితో రూ.63 కోట్లకు పెరిగింది.. 2008-09లో రూ.88 కోట్లు, 2009-10లో రూ.79 కోట్లు చొప్పున నష్టాలు పొందిన ఈ బ్యాంక్ మెల్లగా లాభాల బాట పడుతోంది. 2014-15లో రూ.191 కోట్ల నికరలాభం ఆర్జించింది. 2008-09లో రూ.306 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.186 కోట్లకు తగ్గాయి. మూడేళ్లలో బ్యాలెన్స్ షీట్‌ను రెట్టింపు చేసుకోవాలన్న లక్ష్యంతో ఉన్న బ్యాంక్ ఆ దిశగా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. రెండేళ్లలో 50 కొత్త శాఖలను ఏర్పాటు చేసింది. మూడేళ్లలో మరో 100 శాఖలను ఏర్పాటు చేయనున్నది. దీంతో మొత్తం బ్యాంక్ శాఖల సంఖ్య 250కు పెరగనున్నది. రెండేళ్లలో రుణ వృద్ధి 26 శాతం వృద్ధితో రూ16,572 కోట్లకు పెరుగుతుందని అంచనా. నికర వడ్డీ ఆదాయం నిలకడగా పెరుగుతుండడం, రుణ నాణ్యతను సుస్థిరంగా కొనసాగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, మొండి బకాయిలు తదితర అంశాలకు కేటాయింపులు తక్కువగా ఉండడం సానుకూలాంశాలు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top