పోలవరం, పట్టిసీమలపై ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది

పోలవరం, పట్టిసీమలపై ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోంది - Sakshi


ఖర్చు లెక్కలు తేల్చడానికి కమిటీ వేయాలి

బీజేపీ చీఫ్ అమిత్‌షాను కోరిన ఆ పార్టీ ఎమ్మెల్సీ వీర్రాజు


 

న్యూఢిల్లీ:  పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాజెక్టులకు పెట్టే ఖర్చుపై లెక్కలు తేల్చడానికి దర్యాప్తు చేయించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టేలా జోక్యం చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అంచనా వ్యయాన్ని రెండింతలకుపైగా పెంచిందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల ఖర్చు లెక్కలను పోలవరం అథారిటీకి కూడా చెప్పడంలేదని రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. ఈ ఖర్చు లెక్కలపై అధ్యయనం చేయించడానికి నిపుణుల కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. బీజేపీ రాష్ట్ర సమన్వయకర్త పి.రఘురాంతో కలిసి సోము వీర్రాజు గురువారం ఇక్కడ పార్టీ అధినేత అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భగా అమిత్‌షా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలిసి వివరించాలని వీర్రాజుకు సూచించారు. అనంతరం వీర్రాజు విలేకరులతో మాట్లాడారు.



లెక్కలు చెప్పే విషయంలో తప్పించుకొంటోంది...:పోలవరంలో అంతర్భాగమే పట్టిసీమ అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి రూ.1900 కోట్లు నిధులు మంజూరు చేయించుకుందని, ఖర్చులెక్కలను పోలవరం అథారిటీకి ఎందుకు చెప్పడంలేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. ప్రాజెక్టు ఖర్చు లెక్కలు చేప్పే విషయంలో తప్పించుకుంటోందని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.16వేల కోట్లు ఉండగా, ఏ లెక్కల ప్రచారం రూ. 36 వేల కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

 జగన్ ప్రభుత్వాన్ని నిలదీయాలి: పోలవరం స్పిల్‌వే పనులను ప్రారంభించకుండా బీజేపీపై నిందలు వేసే ప్రయత్నం చేస్తే సహించేదిలేదని, అన్ని విషయాలను కేంద్రానికి వివరిస్తామన్నారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల ఖర్చులెక్కలను తేల్చడానికి నిపుణుల కమిటీని రాష్ట్రానికి పంపాలని కేంద్ర మంత్రి ఉమాభారతిని కోరనున్నామన్నారు. ఏపీలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు కేంద్రం రూ.50 కోట్లు చొప్పున విడుదల చేసిన రూ.350 కోట్ల నిధులను జిల్లాల్లో అభివృద్ధి పనులకు వినియోగించకుండా బ్యాంకులో పెట్టి వడ్డీ తీసుకుంటోందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ విషయాలపై విపక్ష నేత జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు.

 

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top