అధికార పార్టీతో పొత్తా?

అధికార పార్టీతో పొత్తా?


* ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో అవగాహనపై కాంగ్రెస్‌లో మంటలు

* దేశంలో ఎక్కడైనా ఇలా ఉందా?

* దీనికన్నా పార్టీని గంపగుత్తగా విలీనం చేయడమే మేలు: టీపీసీసీ నేతలు

* పొత్తు ప్రస్తావనే ఆత్మహత్యాసదృశం: భట్టి


సాక్షి, హైదరాబాద్:  స్థానిక ప్రజాప్రతినిధుల కోటా నుంచి శాసనమండలికి జరగనున్న ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌తో అవగాహన, పొత్తు కుదుర్చుకునే దిశగా జరుగుతున్న చర్చలపై కాంగ్రెస్‌లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.



అధికార పార్టీతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ పొత్తుల చర్చలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అంటూ నిరసన ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘టీఆర్‌ఎస్‌తో పొత్తు చర్చ కాంగ్రెస్‌కు మంచిది కాదు. అధికారంలో ఉన్న పార్టీతో చర్చించడం కంటే గంపగుత్తగా విలీనం చేయడమే మేలు. ఒక ట్రెండు సీట్ల కోసం అధికార పార్టీ దగ్గర మోకరిల్లడం అంటే కాంగ్రెస్‌ను, ప్రజా ప్రతినిధులను, కేడర్‌ను అమ్ముకోవడమే. దీన్ని పార్టీ నేతలు, శ్రేణులు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించరు’’ టీపీసీసీ ముఖ్య నేతలు పలువురు స్పష్టం చేస్తున్నారు.

 

చర్చలు జరిపేవారి హోదా ఏమిటో?


వరంగల్ ఉప ఎన్నికల్లో ఓటమికి చాలా కారణాలున్నాయని, వాటిపై సమీక్షించుకుని భవి ష్యత్ పోరాటానికి సిద్ధం  కావాలని టీపీసీసీలో కొందరు నేతలు సూచనలు చేస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో గెలుపోటములు అత్యంత సహజమని, ఒక్కసారి ఓడిపోతే అధికార పార్టీ దగ్గర దేబిరించడం ఎలా సమంజసమని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ‘‘ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజల పక్షాన అధికార పార్టీపై పోరాడటం.



ఒక్కసారి ఓడిపోతే ఏమైతది? ప్రతిపక్ష పార్టీ సహజ లక్షణమే అధికార పార్టీపై పోరాడటం. దాన్ని వదిలిపెట్టి ఎవరి ప్రయోజనాల కోసం పొత్తులు, అవగాహనలు అం టూ చర్చలు జరుపుతున్నారో అర్థం కావడం లేదు. అసలు అధికార టీఆర్‌ఎస్‌తో చర్చలు ఎవరు జరుపుతున్నారో, పార్టీలో వారి హోదా ఏమిటో తెలుసుకోవడం మంచిది. కొందరు నేతల వ్యక్తిగత, రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నట్టున్నారు.



కాంగ్రెస్ ఉనికిని లేకుండా చేసేందుకు కొందరు సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీనిపై అధిష్టానం దగ్గర తేల్చుకుంటాం’’ టీపీసీసీ ముఖ్య నేతలు కొందరు పేర్కొన్నారు.

 పొత్తు ప్రస్తావనే ఉత్పన్నం కాదు: భట్టి

 అధికార పార్టీతో ఎన్నికల పొత్తులు, అవగాహన అనే చర్చ రావడమే కాంగ్రెస్‌కు ఆత్మహత్యాసదృశమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ‘సాక్షి’ ప్రతినిధితో అన్నారు.



‘‘అధికార పార్టీతో ప్రతిపక్ష పార్టీ ఎక్కడైన చర్చలు జరుపుతుందా? ప్రతిపక్ష పార్టీతో పొత్తులు పెట్టుకోవాలనే ప్రస్తావన రావడమే తప్పు. టీఆర్‌ఎస్‌తో పొత్తు లేదా అవగాహన అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. టీఆర్‌ఎస్‌ను ఓడించడానికి అవసరమైతే కలిసి వచ్చే మిగిలిన అన్ని ప్రతిపక్ష పార్టీలతో కలిసి పనిచేస్తాం. పొత్తుల చర్చల సంగతి నాకు, టీపీసీసీ అధ్యక్షుడికి తెలియదు.



పొత్తు అంటూ ఎవరూ నన్ను, టీపీసీసీ అధ్యక్షుడిని అడగలేదు. టీఆర్‌ఎస్‌తో పొత్తుల ప్రస్తావనే కాంగ్రెస్‌కు ఆత్మహత్యా సదృశం’’ అని ఆయన స్పష్టం చేశారు. అధికార పార్టీ వైఫల్యాలపై పోరాటానికి తమ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు. అధికార పార్టీపై పోరాటంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top