ఎస్పీఎం కార్మికుల పోరాటానికి మద్దతు

ఎస్పీఎం కార్మికుల  పోరాటానికి మద్దతు - Sakshi


♦ ఆదిలాబాద్ జిల్లా పరామర్శ యాత్రలో షర్మిల

♦ పేపర్ మిల్లు తెరిపించేందుకు పోరాడతాం

♦ కార్మికుల కష్టాలు తీర్చేందుకు కృషి చేస్తాం

♦ కోట్లాది మంది గుండెల్లో నిలిచిన వైఎస్ రాజశేఖరరెడ్డి

♦ అడుగుజాడల్లో నడుద్దామని పిలుపు

♦ రాజన్న బిడ్డకు గుస్సాడీ నృత్యాలతో ఆత్మీయ స్వాగతం పలికిన ప్రజలు

 

 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్/కరీంనగర్: సిర్పూర్ పేపర్ మిల్లు (ఎస్పీఎం)ను తిరిగి తెరిపించేందుకు జరుగుతున్న పోరాటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రకటించారు. ఎస్పీఎం కార్మికులకు తమ పార్టీ అండగా ఉంటుందని.. కార్మికుల కష్టాలు తీర్చేందుకు కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక గుండె ఆగి మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు చేపట్టిన పరామర్శయాత్రలో భాగంగా షర్మిల శనివారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. తొలుత కాసిపేట మండలం దేవాపూర్‌లో మహ్మద్ జాకీర్ కుటుంబాన్ని పరామర్శించారు.



అనంతరం కాగజ్‌నగర్ మండలం చింతగూడ గ్రామానికి వెళ్లి కొట్రాక ఆనంద్‌రావు కుటుంబాన్ని కలుసుకున్నారు. ఆ కుటుంబాల సభ్యులతో మాట్లాడి.. వారి సమస్యలను తెలుసుకున్నారు. వైఎస్ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. యాత్రలో భాగంగా కాగజ్‌నగర్‌లోని లారీ చౌరస్తాలో ప్రజలనుద్దేశించి షర్మిల మాట్లాడారు. నిరుపేదల గుండెల్లో కొలువై ఉన్న వైఎస్సార్‌కు మరణం లేదన్నారు. వైఎస్సార్ హయాంలో అన్నివర్గాల ప్రజలకు లబ్ధి చేకూరిందని.. తెలుగుజాతి ఉన్నంత వరకు ఆయన బతికే ఉంటారని పేర్కొన్నారు. కాగా తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన షర్మిలకు ఆత్మీయ స్వాగతం లభించింది.



సాయంత్రం 4.30 గంటలకు మంచిర్యాలకు చేరుకున్న షర్మిలకు.. వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు ఆదివాసీ సంప్రదాయ రీతిలో గుస్సాడీ నృత్యాలు, ప్రత్యేక వాయిద్యాలతో స్వాగతం పలకగా... కాగజ్‌నగర్‌లో మహిళలు మంగళ హారతులతో ఆహ్వానించారు. ఆదిలాబాద్ జిల్లా యాత్రలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్‌కుమార్, ఇన్‌చార్జి మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, జిల్లా పరిశీలకులు భగవంత్‌రెడ్డి, పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.



 కరీంనగర్ జిల్లాలో 885 కిలోమీటర్లు..

 కరీంనగర్ జిల్లాలో శనివారం వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో మూడు కుటుంబాలను షర్మిల కలుసుకున్నారు. బోయినిపల్లి మండలం స్తంభంపల్లిలో చంద్రగిరి నర్సమ్మ, సిరిసిల్ల మండలం మండేపల్లి, చీర్లవంచ గ్రామాల్లో కొమ్మెట లచ్చయ్య, ఈసరి లచ్చవ్వ కుటుంబాలను షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయా కుటుం బాల సభ్యులు షర్మిలకు తమ కష్టాలను వివరించారు. షర్మిల వారిని ఓదార్చారు. అందరూ ధైర్యంగా ఉండాలని, త్వరలోనే మంచిరోజులు వస్తాయని భరోసా కల్పిం చారు. దీంతో కరీంనగర్ జిల్లాలో షర్మిల యాత్ర ముగిసింది. రెండు దఫాలుగా (సెప్టెంబర్ 22-24, అక్టోబర్ 1-3 తేదీల్లో) నిర్వహించిన ఈ యాత్రలో కరీంనగర్ జిల్లాలో 885 కిలోమీటర్లు ప్రయాణించి, 30 కుటుంబాలను ఆమె పరామర్శించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top