విభజన బిల్లు లోక్‌సభలో పాస్ కాలేదు


రాష్ట్రపతికి విన్నవించిన ఉండవల్లి

జగన్ దీక్షను అధికార పార్టీ వాడుకోవాలి

హోదా ఇవ్వకుండా ప్రపంచ బ్యాంకు నివేదికతో కుట్ర

మీడియాతో అరుణ్ కుమార్


 

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందలేదని, అందుకు తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని లోక్‌సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష చేసినా, చంద్రబాబు చేసినా అది రాష్ట్రం కోసమే చేస్తున్నందున సఫలం కావాలనే తాను కోరుకుంటున్నానని పేర్కొన్నారు. గురువారం ఇక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజన బిల్లుకు సంబంధించి బుధవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఒక వినతిపత్రం ఇచ్చినట్టు చెప్పారు. ‘ద క్వశ్ఛన్ ఈజ్ వెదర్ ఏపీ రీ ఆర్గనైజేషన్ బిల్ వాజ్ పాస్డ్ ఇన్ లోక్‌సభ ఆన్ 18.02.2014?’ అనే శీర్షికన తాను ప్రచురించిన బుక్‌లెట్‌ను వినతిపత్రానికి జత చేసినట్టు చెప్పారు. లోక్‌సభలో విభజన బిల్లు పాసవకుండానే పాసయినట్టు ప్రకటించారని,  ఆధారాలు సహా రాష్ట్రపతికి ఇచ్చానని తెలిపారు.



 ఎవరు దీక్ష  చేసినా సఫలం కావాలి

 వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదాపై చేస్తున్న దీక్ష గురించి మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు ‘జగన్‌మోహన్‌రెడ్డి దీక్షను అధికార పార్టీ తమకు అనుకూలంగా వాడుకోవాలి’ అని ఉండవల్లి అన్నారు. అధికారంలోకి వస్తే బీజేపీ ప్రత్యేకహోదా పదేళ్లు ఇస్తామన్నదని, ఇప్పుడు ఆ పార్టీ ఎందుకు అడ్డుపడుతుందో అర్థం కావడం లేదన్నారు. ‘ఈరోజు ప్రత్యేక హోదా లేకుండా చేయడం కోసం ఇంకో పెద్ద కుట్ర జరిగింది. వరల్డ్ బ్యాంకు ప్రకటించినట్టుగా.. పరుగెత్తికెళ్లి పెట్టుబడి పెట్టాలంటే ఒకటి గుజరాత్, రెండోది ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. రాష్ట్రం వచ్చాక ఒక్క పరిశ్రమన్నా రాలేదు. సీమాంధ్రులకు చెందిన ఒక్క పెద్ద పరిశ్రమ తెలంగాణ నుంచి రావడానికి సిద్ధంగానైనా లేదు.



అలాంటప్పుడు ఈ ర్యాంకు ఎలా వచ్చిందని ఆరా తీస్తే.. ఈ సర్వే చేసింది ప్రపంచ బ్యాంకు కాదు. కేపీఎంజీ వాళ్లను నరేంద్ర మోదీ అడిగారట. 98 ప్రశ్నలు రూపొందించి సర్వే చేశారట. వాటికి జవాబు ఇవ్వడంలో నిపుణులం కాబట్టి.. మనం ముందున్నాం.  ఇక్కడ మనకు రెండో స్థానం ఎందుకు వచ్చిందంటే.. మోదీ చేయించుకున్నారు కాబట్టి గుజరాత్ ఫస్ట్ వచ్చింది. ఈ ర్యాంకును చూపించి ఆనందపడుతున్నాం. జగన్ దీక్ష చేసినా, చంద్రబాబు దీక్ష చేసినా.. అది రాష్ట్రం కోసమే చేస్తున్నారు కాబట్టి.. సఫలం కావాలనే కోరుకుంటున్నా..’ అని ఉండవల్లి పేర్కొన్నారు.

 

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top