ప్రపంచ కుబేరుల్లో భారత్‌కు నాలుగో ర్యాంక్

ప్రపంచ కుబేరుల్లో భారత్‌కు నాలుగో ర్యాంక్ - Sakshi


న్యూయార్క్: అత్యధిక సంపన్నులున్న ప్రపంచ దేశాల జాబితాలో భారత్ నాల్గో స్థానంలో ఉన్నట్లు ఫోర్బ్స్ పేర్కొంది. బ్రిక్స్ దేశాల పరంగా చూస్తే రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ ఏడాది ఫోర్బ్స్ టాప్ 100 బిలియనీర్ల జాబితాలో ఐదుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు. భారత్‌లో గతేడాది 56గా ఉన్న బిలియనీర్ల సంఖ్య ఈ ఏడాది 96కు చేరింది. వీరి ఆస్తి విలువ 191 బిలియన్ డాలర్ల నుంచి 294 బిలియన్ డాలర్లకు పెరిగింది. 536 బిలియనీర్లతో యూఎస్ అగ్ర స్థానంలో కొనసాగుతుంటే 213 మంది బిలియనీర్లతో చైనా రెండో స్థానంలో, 103 మంది బిలియనీర్లతో జర్మనీ మూడో స్థానంలో ఉన్నాయి. గతేడాది 6.4 ట్రిలియన్ డాలర్లగా ఉన్న మొత్తం బిలియనీర్ల సంపద విలువ ఈ ఏడాది 7.05 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. అలాగే ఈ ఏడాది కొత్తగా 290 మంది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.



 పెరిగిన మహిళా బిలియనీర్లు- గతేడాది 172గా ఉన్న మహిళా బిలియనీర్ల సంఖ్య ఈ ఏడాది 197కు చేరింది. అయినా మొత్తం బిలియనీర్ల (1,826) సంఖ్యలో వీరి వాటా 11 శాతం మాత్రమే. జిందాల్ స్టీల్ అండ్ పవర్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ సావిత్రి జిందాల్ 5.3 బిలియన్ డాలర్లతో 283వ స్థానంలో ఉన్నారు. 3.1 బిలియన్ డాలర్లతో బెన్నెట్ కోల్‌మన్ మీడియా గ్రూప్ చైర్‌పర్సన్ ఇందు జైన్ 603వ స్థానంలో, 1.5 బిలియన్ డాలర్లతో థర్మాక్స్ చైర్‌పర్సన్ అను అగా 1,312వ స్థానంలో, 1.2 బిలియన్ డాలర్లతో హవెల్స్ ఇండియా వ్యవస్థాపకుడు క్విమత్ రాయ్ గుప్తా భార్య వినోద్ గుప్తా 1,533వ స్థానంలో, 1 బిలియన్ డాలర్లతో బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా 1,741వ స్థానంలోను కొనసాగుతున్నారు.

 

ప్రపంచ మహిళా సంపన్నుల జాబితాలో వాల్‌మార్ట్ వాటాదారురాలు క్రిస్టీ వాల్టన్ 41.7 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో (మహిళా సంపన్నుల జాబితాలో) ఉన్నారు. ఆమె తర్వాతి స్థానంలో 40.7 బిలియన్ డాలర్లతో కాస్మోటిక్ కంపెనీ లోరెల్ వ్యవస్థాపకురాలు లిలియానా బెట్టెన్‌కోర్ట్, 39.4 బిలియన్ డాలర్లతో వాల్‌మార్ట్ వ్యవస్థాపకుడు సమ్ వాల్‌మార్ట్ కుమార్తె ఎలీసా వాల్టన్ కొనసాగుతున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top