హైదరాబాద్‌లో..‘స్పార్’ భారీ హైపర్ మార్కెట్


కంపెనీకిది ప్రపంచంలో రెండో అతిపెద్ద ఔట్‌లెట్...

1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం

నాచారంలో జూలైకల్లా ప్రారంభం...


 

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రిటైల్ రంగంలో ఉన్న స్పార్ ఇంటర్నేషనల్ భారత్‌లో పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. నెదర్లాండ్స్‌కు చెందిన ఈ దిగ్గజ సంస్థ హైదరాబాద్‌లోని నాచారంలో హైపర్ మార్కెట్‌ను 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పుతోంది. హైదరాబాద్‌కు చెందిన రిటైల్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ దీన్ని అభివృద్ధి చేస్తోంది. ప్రపంచంలో స్పార్‌కు విస్తీర్ణంలో బీజింగ్ హైపర్ మార్కెట్ తర్వాత ఇంత పెద్ద ఔట్‌లెట్ ఇదే కావడం విశేషం.



అలాగే భాగ్యనగరంలో అతిపెద్ద హైపర్‌మార్కెట్ కూడా ఇదే. మూడు అంతస్తుల్లో దీనిని నిర్మిస్తున్నారు. ఔట్‌లెట్‌ను జూలైకల్లా ప్రారంభిస్తామని బెంగళూరు నుంచి కంపెనీ ప్రతినిధి సాక్షి బిజినెస్ బ్యూరోకు ఫోన్‌లో తెలిపారు. భారత్‌లో ఏటా 5 హైపర్, సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా 35 దేశాల్లో 12,500లకుపైగా స్టోర్లతో రిటైల్ కార్యకలాపాలను స్పార్ సాగిస్తోంది.



చిన్న నగరాల్లోనూ..: భారత్‌లో ప్రస్తుతం 9 నగరాల్లో 16 స్పార్ సూపర్, హైపర్ మార్కెట్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో 2 సూపర్ మార్కెట్లను కంపెనీ నిర్వహిస్తోంది. గచ్చిబౌలిలో ఒక స్టోర్ వస్తున్నట్టు సమాచారం. నాచారం హైపర్ మార్కెట్ అభివృద్ధికి ఇప్పటికే రూ.18 కోట్లను ఖర్చు చేశామని మరో రూ.7 కోట్లు వ్యయం చేయనున్నట్టు రిటైల్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ మేనేజింగ్ పార్ట్‌నర్ పరుచూరి ఈశ్వరరావు తెలిపారు. వరంగల్, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతిలోనూ ఔట్‌లెట్లను అభివృద్ధి చేయాల్సిందిగా స్పార్ తమను కోరిందని చెప్పారు.



హైపర్ మార్కెట్లపై ఈ-కామర్స్ ప్రభావం ఏమాత్రం లేదని యార్డ్స్ అండ్ ఫీట్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ డెరైక్టర్ కలిశెట్టి పద్మభూషన్ అన్నారు. ఈ క్రమంలోనే మెట్రో క్యాష్ అండ్ క్యారీ, స్పార్, వాల్‌మార్ట్ వంటి సంస్థలు  భారత్‌లో భారీగా విస్తరిస్తున్నాయని వివరించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top