ప్రగతి లేదు.. ప్రచార ఆర్భాటమే!

ప్రగతి లేదు.. ప్రచార ఆర్భాటమే! - Sakshi


మోదీ పాలనపై సోనియా ధ్వజం

* బిహార్లో కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ, ఎస్పీల భారీ సభ

 పట్నా: బిహార్ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ, సమాజ్‌వాదీ పార్టీల  ‘లౌకిక పార్టీల మహా కూటమి’ సంయుక్తంగా ‘స్వాభిమాన్ ర్యాలీ’ పేరుతో ఆదివారం పట్నాలో ఓ భారీ బహిరంగ సభ నిర్వహించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, మాజీ సీఎం రబ్రీ దేవి, సమాజ్‌వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తదితరులు పాల్గొన్న ఆ సభలో..



ప్రధాని మోదీ లక్ష్యంగా నేతలు విమర్శలతో విరుచుకుపడ్డారు. ‘డీఎన్‌ఏ’ వ్యాఖ్యతో మోదీ బిహార్ ప్రజలను అవమానించారని మండిపడ్డారు. ప్రతిగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పాలంటూ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. భూ ఆర్డినెన్స్‌ను మరోసారి జారీ చేయకూడదని కేంద్రం నిర్ణయించడం ప్రజా విజయమని అభివర్ణించారు. ఏ ఒక్క ఎన్నికల హామీని అమలు చేయలేదంటూ ధ్వజమెత్తారు.



సభకు భారీగా హాజరైన జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మోదీ పాలనలో ప్రచారార్భాటం తప్ప పనులేం జరగడం లేదని సోనియా ఎత్తిపొడిచారు. నితీశ్ కుమార్ డీఎన్‌ఏలోనే ఏదో లోపం ఉందంటూ ఇటీవల బిహార్‌లో జరిగిన సభలో మోదీ వ్యాఖ్యానించడంపై.. ‘నాది బిహార్ డీఎన్‌ఏ. మహామహులైన గౌతమ బుద్ధుడు, మహావీరుడు, ఆర్యభట్టల డీఎన్‌ఏ. అద్భుతమైన సాంస్కృతిక, చరిత్రాత్మక ఔన్నత్యం కలిగిన డీఎన్‌ఏ’ అంటూ నితీశ్ స్పందించారు.



ఆర్జేడీ ఉన్న కూటమి అధికారంలోకి వస్తే బిహార్‌లో ‘జంగిల్ రాజ్(ఆటవిక రాజ్యం)’ వస్తుందన్న మోదీ విమర్శను ‘మేం అధికారంలోకి వస్తే వచ్చేది జంగిల్ రాజ్ కాదు.. మంగళ్(సౌభాగ్య) రాజ్’ అంటూ లాలూ తిప్పికొట్టారు. మోదీపై విమర్శలతో పాటు నేతలు పరస్పర ప్రశంసలనూ గుప్పించుకున్నారు.

 

ఎన్నాళ్లీ మౌనవ్రతం.. సభలో మొదటగా సోనియా మాట్లాడుతూ.. ‘ఐదేళ్లలో నాలుగో వంతు కాలం గడిచిపోయింది. ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ప్రచారార్భాటానికే పరిమితమైంది. ఈ 15 నెలల్లో ఆడంబరపు మాటలు తప్ప పనులేం జరగలేదు’ అని ఎద్దేవా చేశారు. మోదీ డీఎన్‌ఏ వ్యాఖ్యలను అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ.. ‘బిహార్‌ను అవహేళన చేస్తూ కొందరు ఆనందం పొందుతుంటారు. అవకాశం వచ్చినప్పుడల్లా బిహార్ డీఎన్‌ఏ గురించి, ఈ రాష్ట్ర సంస్కృతి గురించి అవాకులు, చెవాకులు పేలుతుంటారు.



బిహార్‌ను రోగగ్రస్త(బీమారు) రాష్ట్రమంటూ అవమానిస్తారు’ అన్నారు. మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక, యువజన వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. రూపాయి విలువ పడిపోతున్నా, సరిహద్దుల్లో పాక్ కాల్పుల్లో భారతీయ సైనికులు, పౌరులు చనిపోతున్నా మోదీ ఎందుకు మౌనవ్రతం పాటిస్తున్నారంటూ ప్రశ్నించారు. మళ్లీ మోదీ వలలో పడొద్దని, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏను ఓడించాలని బిహార్ ప్రజలకు  విజ్ఞప్తి చేశారు.

 

బిహార్ బెటర్.. బిహార్‌లో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయన్న మోదీ వ్యాఖ్యలపై నితీశ్ స్పందిస్తూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా, మోదీ ఉండే ఢిల్లీ కన్నా.. బిహార్‌లో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయన్నారు.

 

పాశ్వాన్.. వాతావరణ శాస్త్రవేత్త

లాలూ మాట్లాడుతూ.. హిందూ, ముస్లింల మధ్య ఉద్రిక్తతలు రాజెయ్యడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎల్‌జేపీ నేత, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌ను పరిస్థితులకు తగ్గట్లు మారే ‘వాతావరణ శాస్త్రవేత్త’ అంటూ ఎద్దేవా చేశారు.

 సభ విఫలం.. పాశ్వాన్: స్వాభిమాన్ ర్యాలీ విఫలమైందని పాశ్వాన్ పేర్కొన్నారు. సభకు ప్రజలు చాలా తక్కువగా హాజరయ్యారన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top