హరిత ఇంధనం.. అసలు లక్ష్యం

హరిత ఇంధనం.. అసలు లక్ష్యం - Sakshi


సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిదారుల సమావేశంలో సీఎం

ఇందుకోసం పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని వెల్లడి


 

విజయవాడ బ్యూరో: రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడంతోపాటు హరిత ఇంధనం(గ్రీన్ ఎనర్జీ) సాధన దిశగా సౌర, పవన విద్యుత్ రంగాలను అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఇందుకోసం ఆయా రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల స్థాపనను గణనీయంగా ప్రోత్సహిస్తున్నామన్నారు. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిదారులు, డెవలపర్ల ప్రత్యేక సమావేశం గురువారమిక్కడ జరిగింది. ఏపీ నెడ్‌క్యాప్, జెన్‌కో, ట్రాన్స్‌కోలు సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ భేటీకి దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి 250 మంది పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. సీఎం మాట్లాడుతూ.. విద్యుత్‌రంగ పురోభివృద్ధికి సంస్కరణలు అవసరమన్నారు. ఒకప్పుడు 22.5 మిలియన్ యూనిట్లు ఉన్న విద్యుత్ లోటును పరిష్కరించుకోగలిగామన్నారు.గ్రీన్ ఎనర్జీ సాధనలో భాగంగా ప్రతి జిల్లాలోనూ ఒక 400 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని తెలిపారు.



2018-19 నాటికి రాష్ట్రంలో మరో 10 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధనం ఉత్పత్తి లక్ష్యమని సీఎం చెప్పారు. సౌర, పవన, మినీ హైడల్, సాలిడ్‌వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్, బయోమాస్ పద్ధతుల్లో దీన్ని ఉత్పత్తి చేసేందుకు లక్ష్యం నిర్ణయించామన్నారు. సౌర విద్యుత్‌పై శాస్త్రీయమైన అవగాహన పెంచేందుకు కొత్త రాజధాని అమరావతి పరిధిలో సౌర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని సీఎం చెప్పారు.వర్సిటీ ఏర్పాటుకు సుజలాం ఎనర్జీ, హీరో గ్రూప్‌లు తమ వంతుగా రూ.35 కోట్లు, ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో, నెడ్‌క్యాప్‌లు మరో రూ.50 కోట్ల భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. మరో రూ.80 కోట్లు మంజూరు చేయాలని సీఎం కేంద్ర ఇంధన వనరులశాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) సంయుక్త కార్యదర్శి వర్షాజోషిని కోరారు.



రూ.19 వేల కోట్ల పెట్టుబడులపై నెడ్‌క్యాప్‌తో ఎంవోయూ

ఈ సందర్భంగా సౌర, పవన విద్యుత్ రంగాల్లో పేరు గడించిన పలు కంపెనీలు రూ.19 వేల కోట్ల పెట్టుబడులతో కొత్త యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చాయి. ఆయా కంపెనీల ప్రతినిధులు సీఎం చంద్రబాబు సమక్షంలో నెడ్‌క్యాప్ ఎండీ కమలాకరబాబుతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. జపాన్‌కు చె ందిన సాఫ్ట్‌బ్యాంక్ సలార్ సర్వీసెస్ కంపెనీ, స్పెయిన్‌కు చెందిన ఆక్సియానా ఎనర్జియా, సుజలాం ఎనర్జీస్ లిమిటెడ్ కంపెనీలతోపాటు మరో రెండు సంస్థలు ఎంవోయూ చేసుకున్న వాటిలో ఉన్నాయి. రాష్ట్రానికి మరో 10 వేల సౌర పంపుసెట్లను మంజూరు చేస్తున్నట్లు కేంద్ర ఇంధన వనరులశాఖ(ఎంఎన్‌ఆర్‌ఈ) సంయుక్త కార్యదర్శి వర్షాజోషి తెలిపారు. ఈ సందర్భంగా సీఎం.. నైపుణ్యాభివృద్ధి పోస్టర్, వీడియో ఫిల్మ్‌లను ఆవిష్కరించారు.



 ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి లబ్దిదారుల నుంచి వసూలు

ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి వాటికైన ఖర్చును లబ్ధిదారుల నుంచి వసూలుచేసే విధానం ఉండాలని, అందుకనుగుణంగా హౌసింగ్ పాలసీలో మార్పులు తీసుకురావాలని సీఎం చంద్రబాబు అన్నారు. సింగపూర్, చైనా, హాంకాంగ్ తరహాలో ఆటస్థలాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులతో కూడిన టౌన్‌షిప్‌లను నిర్మిద్దామన్నారు. సీఎం గురువారమిక్కడ తన నివాసంలో గృహనిర్మాణశాఖపై సమీక్షించి ఈ ప్రతిపాదన తెచ్చారు.



 తెలుగు సంఘాలకు ఆహ్వానం

 రాజధాని నిర్మాణానికి జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి రావాలంటూ జాతీయ, అంతర్జాతీయ తెలుగు సంఘాలకు ఆహ్వాన పత్రాలు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం నేతలతో సీఎం చంద్రబాబు తన నివాసంలో నిర్వహించిన అంతరంగిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top