భార్యలు వద్దు.. స్మార్ట్ ఫోన్ ముద్దు

భార్యలు వద్దు.. స్మార్ట్ ఫోన్ ముద్దు - Sakshi


నిద్రపోయేటప్పుడు మీ పక్కన ఎవరుంటున్నారు? ఇదేం చచ్చు ప్రశ్న అనుకుంటున్నారా.. ఆగండి. ఒకప్పుడంటే వైవాహిక భాగస్వాములు ఉండేవారేమో గానీ ఇప్పుడు మాత్రం క్రమంగా ఆ స్థానాన్ని స్మార్ట్ ఫోన్లు ఆక్రమిస్తున్నాయట. అది కూడా ఎక్కడో కాదు.. మన భారత దేశంలోనే! ఈ విషయం తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. ఇంకా చెప్పాలంటే.. తమ కొత్త 'స్లీపింగ్ పార్ట్నర్' కోసం వారాంతాల్లో శృంగారాన్ని కూడా పక్కన పెట్టేస్తున్నారట. ఏడు దేశాల్లో స్మార్ట్ ఫోన్ల వాడకం తీరుతెన్నులు ఎలా ఉంటాయన్న విషయమై మోటరోలా కంపెనీ నిర్వహించిన సర్వేలో మన దేశానికి సంబంధించి ఈ విభ్రాంతికర వాస్తవాలు బయటపడ్డాయి. చేతిలోనే స్మార్ట్ఫోన్లు పట్టుకుని పడుకునేవాళ్లు ఏడుదేశాల్లో చూస్తే దాదాపు 60 శాతం మంది ఉన్నారట. అదే భారత దేశంలో అయితే ఏకంగా 74 శాతం మంది ఇలా చేస్తున్నారట. చైనాలో కూడా 70 శాతం మంది ఇలాగే పడుకుంటున్నారు. ఇక ప్రతి ఆరుగురు స్మార్ట్ ఫోన్ వాడకం దారుల్లో ఒకళ్లు స్నానం చేసేటప్పుడు కూడా ఫోన్లు వదలట్లేదు. తమ పెంపుడు పిల్లి మంటల్లో చిక్కుకుంటే దాన్ని కాపాడటం కంటే ముందు స్మార్ట్ఫోన్లో వచ్చే ఎలర్ట్ చూస్తామని 54 శాతం మంది చెప్పారు. జీవితంలో తమ బెస్ట్ ఫ్రెండుకు కూడా చెప్పని రహస్యాలను ఫోనుకు చెబుతామని 40 శాతం మంది అన్నారు.



అలాగని స్మార్ట్ఫోన్లతో అనుబంధం ఏమైనా బాగుందా అంటే అదీ లేదు. కేవలం 39 శాతం మంది మాత్రమే తమ స్మార్ట్ఫోన్లతో సంతోషంగా ఉన్నారు. ఫోన్లు తమను ఇబ్బంది పెడుతున్నాయని 79 శాతం మంది చెప్పారు. అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, చైనా, స్పెయిన్, మెక్సికో, భారత దేశాల్లో ఈ సర్వే జరిగింది. గత సంవత్సరం కూడా ఇలాంటి సర్వేనే ఒకటి చేయగా.. 57 శాతం మంది భారతీయులు స్మార్ట్ఫోన్లు లేకుండా బతకలేమని అప్పట్లో చెప్పారట.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top