ఆ పట్టణానికి శునకమే మేయర్!!
అమెరికాలోని ఓ చిన్న పట్టణానికి మేయర్‌గా ఓ శునకరాజం ఎన్నికైంది. అలాగని ఏదో దీన్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేసేసుకున్నారని భ్రమ పడొద్దు. మరో ఆరు శునకాలు, ఒక గాడిద, ఒక పిల్లి, చివరకు మరో నక్క కూడా ఈ పోటీలో ఉన్నాయి. వాటన్నింటినీ తోసిరాజని ఈ బ్లాక్హౌండ్ తరహా శునకం విజయపతాక ఎగరేసింది. పా కెటిల్ అనే ఈ శునకానికి 2387 ఓట్లు వచ్చాయి. కీనీ అనే ఓ నక్క కంటే దీనికి 55 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. దాంతో శునకాన్ని మేయర్ గాను, నక్కను డిప్యూటీ మేయర్గాను ఎన్నుకొన్నారు.
ఇదంతా అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో గల డివైడ్ అనే పట్టణంలో జరిగింది. ఈ పోటీలో 1790 ఓట్లతో మూడో స్థానంలో నిలిచిన బస్టర్ అనే పిల్లిని వైస్రాయ్గా నియమించారు. మొత్తం 12,091 ఓట్లు పోలయ్యాయి. ఒక్కో ఓటుతో పాటు ఒక డాలర్‌ను విరాళంగా కూడా సేకరించారు. ఇంతకుముందు ఈ పట్టణానికి వాల్టర్ అనే మూడుకాళ్ల పిల్లి మేయర్‌గా ఉండేది. అది పదవీవిరమణ చేస్తుండటంతో ఈ కుక్క కొత్త మేయర్ కాబోతోంది.