సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎన్నిక

సీపీఎం  ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎన్నిక - Sakshi


విశాఖపట్నం : సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు పోటీలో ఉన్న రామచంద్రన్ పిళ్లై తన నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు ఆదివారం విశాఖపట్నంలో ప్రకటించారు. దీంతో సీతారాం ఏచూరి ఎన్నిక ఏకగ్రీవమైంది.



విశాఖపట్నం వేదికగా సీపీఎం 21వ మహాసభలు ఈ నెల 14న ప్రారంభమైనాయి. ఆదివారం ఆ సమావేశాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిని ఈ సమావేశాల్లోనే ఎన్నిక చేయవలసి ఉంది. ఈ పదవికి సీతారాం ఏచూరి, రామచంద్రన్ పిళ్లై పోటీలో నిలిచారు. అయితే పార్టీకి నూతన సారథిగా సీతారాం ఏచూరిని ఎంపిక చేయాలని పార్టీ నేతలంతా ఓ నిర్ణయానికి వచ్చారు. దీంతో రామచంద్రన్ పిళ్లై తన నామినేషన్ ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. దీంతో పార్టీ పగ్గాలు అందుకునేందుకు సీతారాం ఏచూరి ఎన్నిక లాంఛనప్రాయమైంది.


సీతారాం ఏచూరి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనట్లు ప్రకాశ్ కారత్ ప్రకటించారు. అలాగే 16 మందితో సీపీఎం పోలిట్ బ్యూరోను ఎంపిక చేశారు. పొలిట్ బ్యూరో సభ్యులుగా సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్,  రామచంద్రన్ పిళ్లై, బిమన్ బసు, మాణిక్ సర్కార్, విజయన్, బి వి రాఘవులు, బాలకృష్ణన్, ఎంఏ బేబి, సూర్యకాంత్ మిశ్రా, పద్మనాభన్, బృందాకారత్,  మహ్మద్ సలీమ్, సుభాషిణి అలీ, హన్నర్ మొల్లా, జి.రామకృష్ణన్ ఎన్నికయ్యారు.


అలాగే 91 మందితో కేంద్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వారిలో ఏపీ నుంచి బీ వి రాఘువులు, గఫూర్, పి. మధు, పుణ్యవతి, పాటూరి రామయ్య... తెలంగాణ నుంచి చెరుకుపల్లి సీతారాములు, వీరయ్య, తమ్మినేని వీరభద్రం ఎన్నికయ్యారు. అయితే ప్రత్యేక ఆహ్వానితులుగా మల్లు స్వరాజ్యంను ఎంపిక చేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top