రాజయ్య కోడలిది ఆత్మహత్యే

రాజయ్య కోడలిది ఆత్మహత్యే - Sakshi


* నిర్థారించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ

* గ్యాస్ లీక్‌తో వ్యాపించిన మంటల వల్లే కాలిన శరీరాలు

* పొగకు ఊపిరాడకపోవడంతో మృత్యువాత

* ఆహారంలో ఎలాంటి విషపదార్థాలు లేవని వెల్లడి

* నివేదికను సిద్ధం చేసిన ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు

* జిల్లా అధికారులకు పంపడానికి ఏర్పాట్లు


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారికది ఆత్మహత్యేనని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్) నిర్థారించింది.



గ్యాస్ లీక్ వల్ల వ్యాపించిన మంటల కారణంగానే సారికతో పాటు ముగ్గురు చిన్నారుల శరీరాలు కాలిపోయినట్టు తేల్చారు. నివేదికను సిద్ధం చేసిన ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు.. దానిని వరంగల్ కమిషనర్‌కు పంపించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సారిక, ముగ్గురు పిల్లల మరణంపై ఉన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ నెల 4వ తేదీ తెల్లవారుజామున హన్మకొండ రెవెన్యూ కాలనీలోని రాజయ్య ఇంట్లో ఆయన కోడలు సారిక, ముగ్గురు మనవళ్లు అనుమానాస్పద స్థితిలో సజీవదహనమైన విషయం తెలిసిందే.



సారికతో పాటు ముగ్గురు చిన్నారులు దారుణంగా మృత్యువాత పడటంతో రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగింది. అంతేకాక వారి మరణాలపై మొదట్లో పలు అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో డెడ్‌బాడీస్‌లోని శ్యాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపిం చారు. పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం సారికది ఆత్మహత్యేనని, ఆమెతోపాటు ముగ్గురు పిల్లలు చనిపోయినట్టు ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు తేల్చారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికను తయారు చేసి జిల్లా అధికారులకు పంపించేందుకు సిద్ధమవుతున్నారు.

 

ఊపిరాడకపోవడం వల్లే..

రాజయ్య కోడలు సారిక, మనవళ్లు అభినవ్(7), ఆయాన్(3), శ్రీయాన్(3) ఊపిరాడకపోవడం వల్లే మృత్యువాత పడినట్లు ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారులు నిర్ధారించారు. నలుగురు హత్యకు గురైనట్లు నిర్ధారించే ఆనవాళ్లు లేవని స్పష్టం చేసింది. వారు తీసుకున్న ఆహారంలో ఎలాంటి విషపదార్థాల ఆనవాళ్లు లభించలేదని నివేదికలో పేర్కొన్నారు. వారు బతికుండగానే గ్యాస్ లీక్ కారణంగా వ్యాపించిన మంటలకు కాలిపోయినట్లు నిర్ధారించారు.



వారి గొంతు, ఊపిరితిత్తుల్లో పొగ చేరినట్లు ఎఫ్‌ఎస్‌ఎల్‌లో జరిపిన పరీక్షల్లో తేల్చారు. హత్య చేసిన తర్వాత శరీరాలు కాలిపోయినట్లయితే ఊపిరి తీసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి శరీరంలోకి పొగ చేరదని నివేదికలో ప్రస్తావించారు. దీంతో గ్యాస్ సిలిండర్లను లీక్ చేసిన తర్వాతే సారిక నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదికలో స్పష్టం చేశారని సమాచారం.

 

ఇక తేలాల్సింది కారణాలే..

సారికది ఆత్మహత్యే అని ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక స్పష్టం చేయడంతో.. వారు బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి గల కారణాలు బయట పడాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును వేధింపుల కోణంలోనే విచారిస్తున్నారు. సారిక భర్త అనిల్‌కుమార్, అత్త మాధవి తరచూ తనను వేధిస్తున్నారంటూ సారిక పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాక గతంలో బేగంపేట మహిళా ఠాణాలో భర్త, అత్తమామలపై వరకట్న వేధింపుల కేసు కూడా పెట్టింది.



కుటుంబ సభ్యులతో సఖ్యత లేని కారణంగానే కొంత కాలంగా సారిక ముగ్గురు పిల్లలతో కలసి వేరుగా ఉంటోంది. అయితే ఒంటరిగా ఉంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సారిక.. ఉన్నట్టుండి ఒక్కసారిగా పిల్లలతో పాటు ఆత్మహత్యకు పాల్పడటం వెనకున్న కారణాలపై పోలీసులు దృష్టి సారించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top