షూటింగ్‌లకు సింగిల్ విండో అనుమతులు


* త్వరలోనే అవార్డుల వేడుక ఏర్పాటు

* నూతన చలనచిత్ర విధానం కూడా..

* అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే ప్రణాళికలు

* అన్ని హంగులతో స్టూడియో నిర్మాణం

* సినీ రంగ సంఘాలన్నీ ఒకే వేదికపైకి రావాలి

* కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు


 

సాక్షి, హైదరాబాద్: సినిమా షూటింగ్‌లకు సింగిల్ విండో విధానంలో అనుమతులిస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, వాణిజ్య పన్నులశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. త్వరలోనే సినీ అవార్డుల వేడుకను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నంది అవార్డుల పేరు మార్చే ఆలోచన ఉందన్నారు. 2011 నుంచి పెండింగ్‌లో ఉన్న అవార్డులను అందిస్తామన్నారు.



చిత్రపురి కాలనీలో 10 వేల మందికి ఇళ్లు నిర్మించనున్నట్లు చెప్పారు. అన్ని థియేటర్లలో ఐదు షోల ప్రదర్శన అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చలనచిత్ర అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందించి అంతర్జాతీయంగా తెలుగు చిత్ర రంగానికి గుర్తింపు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ప్రస్తుత విధివిధానాలను సడలించి నూతన విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తుందని మంత్రి కె.తారకరామారావు అన్నారు.



రాష్ట్రంలో అన్ని హంగులతో ఫిలిం స్టూడియోను నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని సమావేశంలో పాల్గొన్న సమాచారశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను మంత్రి ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సినీ నిర్మాతలు ఎయిర్‌పోర్ట్ నుంచి ఫిలిం స్టూడియోకు వచ్చి చిత్ర నిర్మాణం పూర్తి చేసుకొని తిరిగి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేలా అన్ని హంగులున్న స్టూడియోను నిర్మించాలన్నారు. చిత్ర రంగంలో ఉన్న వివిధ సంఘాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి తగు సూచనలిస్తే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.



చలనచిత్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ మంత్రి తలసాని అధ్యక్షతన సచివాలయంలో గురువారం సమావేశమైంది. ఈ భేటీలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, కేటీఆర్‌తోపాటు ఉన్నతాధికారులు, చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. సినీ రంగం ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈ సందర్భంగా సబ్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు.



సమావేశంలో పాల్గొన్న వారిలో దాసరి నారాయణరావు, డి.సురేశ్‌బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, శ్యాంప్రసాదరెడ్డి, కె.ఎస్. రామారావు, ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, ఎన్.శంకర్, వందేమాతరం శ్రీనివాస్, కళ్యాణ్, పరుచూరి వెంకటేశ్వరరావు, ఆర్. నారాయణమూర్తి, ప్రతాని రామకృష్ణగౌడ్, రమేశ్ ప్రసాద్, సుప్రియ, బసిరెడ్డి, ప్రేమ్ రాజ్, సానా యాదిరెడ్డి, తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రామ్మోహన్‌రావు, 24 క్రాఫ్ట్స్ అధ్యక్షుడు కొమురం వెంకటేశ్, నాగరాజు తదితర నిర్మాతలు, డెరైక్టర్లు, చిత్ర కార్మిక సంక్షేమ సంఘాల నేతలు ఉన్నారు.

 

సినీరంగం ప్రస్తావించిన ముఖ్యాంశాలు...

* 41 చిన్న సినిమాలు, 7 బాలల చిత్రాలకు రావాల్సిన రాయితీల మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలి. ళీ సినిమా టికెట్లకు ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని ప్రభుత్వం ద్వారా నిర్వహించాలి. ళీ మల్టీప్లెక్స్‌ల తరహాలో మిగతా థియేటర్లకు 5వ షోకు అనుమతి ఇవ్వాలి.

* ఆర్ అండ్ బీ, రెవెన్యూ, ఫైర్ సర్వీసెస్ నుంచి పొందాల్సిన బీఫాం లెసైన్స్ రెన్యువల్ విధానాన్ని 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు పెంచాలి.

* చిత్ర నిర్మాణానికి అవసరమైన సాంకేతిక నిపుణులను అందించేందుకు పుణే తరహా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలి. ళీ సినీ కార్మికులకు గృహ వసతి కల్పించేందుకు చిత్రపురి కాలనీ పక్కనే ఉన్న 9.5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని వారికే కేటాయించాలి. ళీ మున్సిపాలిటీలలో 200 సీట్ల సామర్థ్యంగల మినీ థియేటర్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top