సీబీఐ దర్యాప్తుతో ఏమౌతుంది?

సీబీఐ దర్యాప్తుతో ఏమౌతుంది?


న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరణమృదంగం మోగిస్తున్న వ్యాపమ్ కుంభకోణం కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చివరకు తన మంకుపట్టు వీడారు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సిందిగా హైకోర్టుకు సిఫారసు చేస్తానని మంగళవారం ఆదరబాదరగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఇంతకాలం సీబీఐ దర్యాప్తునకు ససేమిరా అన్న ఆయన ఎందుకు తన నిర్ణయాన్ని మార్చుకున్నారో సులభంగానే గ్రహించవచ్చు.



సుప్రీంకోర్టు పర్యవేక్షణలో వ్యాపమ్ కుంభకోణం కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ సహా పలువురు విజిల్‌బ్లోవర్స్ పిటీషన్లు దాఖలు చేయడం, వాటిని ఈ నెల 9వ తేదీన విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు ప్రకటించింది. కేసు సీబీఐ చేతికి పోయినా ఫర్వాలేదుగానీ సుప్రీం కోర్టు పర్యవేక్షణలోకి వెళ్లకూడదని భావించిన చౌహాన్, సీబీఐ దర్యాప్తు నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టమౌతోంది.



ఇప్పటికే లలిత్‌గేట్ కుంభకోణంతో తలబొప్పికట్టిన కేంద్రంలోని బీజీపి ప్రభుత్వం, ఉన్నంతలో పరువు దక్కించుకునేందుకు ఈపాటికే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి ఉండాల్సింది. అలా చేయకపోవడం వల్ల ఇప్పటికే ఎంతో పరువు పోగొట్టుకుంది. సీబీఐ దర్యాప్తునకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల ఆందోళనకు అనవసరమైన ఆస్కారమిచ్చింది. పైగా వ్యాపమ్ కుంభకోణం ‘సిల్లీ’ విషయం అంటూ సాక్షాత్తు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ వ్యాఖ్యానించడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్న పరువు కాస్త ఊడగొట్టుకుంది.



సీబీఐ దర్యాప్తునకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంగానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంగానీ ఎందుకంత భయపడుతుందో అర్థం కావడం లేదు. సీబీఐ ఎలాంటి ప్రలోభాలకు, ప్రభావాలకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతుందని, కుంభకోణంతో సంబంధమున్న రాజకీయ నేతల గుడ్డలిప్పి దోషులుగా నగ్నంగా నిలబెడుతుందని ఈ ప్రభుత్వాలు భావిస్తున్నాయా? యూపీఏ ప్రభుత్వం కుంభకోణాలపై దర్యాప్తు ముందుకు సాగకపోవడానికి ఆ ప్రభుత్వం చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారడమేనంటూ తానే స్వయంగా చేసిన విమర్శలను బీజేపీ అప్పుడే మరిచిపోయిందా ? లేక ఇప్పటికీ సీబీఐపై కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉందని భయపడుతుందా ?



సీబీఐ తటస్థంగా వ్యవరిస్తుందని, దానికి వ్యాపమ్ కేసును అప్పగిస్తే ‘మ్యాజిక్’లా దోషులంతా దొరికిపోతారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయోమోగానీ సామాన్య ప్రజలకు అంత విశ్వాసం కలగడం లేదు. ఎందుకంటే 2జీ, అక్రమ బొగ్గు కేటాయింపుల కేసుల్లో సీబీఐని సాక్షాత్తు సుప్రీంకోర్టు ‘పంజరంలో రామచిలక’ అని అభివర్ణించింది. ఇప్పటివరకు ఈ కేసు విచారణకు సంబంధించిన బంతి రాష్ట్రం కోర్టులో ఉండగా.. ఇక మీదట కేంద్రం కోర్టులోకి వెళ్తుందన్న మాట.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top