అమ్మ నన్ను కూడా చంపేసేదేమో!?

పోలీసులతో మాట్లాడుతున్న మిఖైల్ బోరా


షీనా హత్య కేసులో ఇంద్రాణి కొడుకు అనుమానం

* గువాహటిలో మిఖైల్, కోల్‌కతాలో ఖన్నా...

* ముంబైలో ఇంద్రాణి, రాహుల్‌ల ఇంటరాగేషన్

* హత్య చేయాల్సిన ప్రదేశంలో ముందే రెక్కీ నిర్వహించిన ఇంద్రాణి


గువాహటి/ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసు విచారణ ఊపందుకుంది. గువాహటిలో షీనా సోదరుడు మిఖైల్‌ను, కోల్‌కతాలో నిందితురాలు ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాను, ముంబైలో ఇంద్రాణిని, ఆమె భర్త పీటర్ ముఖర్జియా కొడుకు రాహుల్‌ను పోలీసులు గురువారం రోజంతా విచారించారు.



విచారణలో రకరకాల కోణాల్లో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన సోదరిని హత్య చేసిన తల్లి.. తరువాత తనను కూడా చంపేసేదేమోనని ఆమె కుమారుడు మిఖైల్ బోరా గువాహటిలో అన్నాడు. పోలీసులు ముంబైకి పిలిస్తే ఈ కేసులో వారికి పూర్తిగా సహకరిస్తానని.. కేసుకు సంబంధించి తన దగ్గరున్న ఆధారాలను సమర్పిస్తానన్నాడు. ‘అమ్మ చాలా శక్తిమంతురాలు.. తాను ఏమైనా చేయగలదు’ అని అన్నాడు. తన పాన్ కార్డ్‌ను, బ్యాంక్ అకౌంట్ వివరాలను ఇవ్వాలని తల్లి తనను అడిగిందని. అయితే తాను ఇవ్వకుండా నిరాకరించానన్నాడు. ఆ తరువాత ముంబై నుంచి వచ్చిన ఓ పోలీసు అధికారి మిఖైల్‌ను అతని ఇంట్లోనే గంటపాటు విచారించారు.

 

హత్యకుకారణమేంటో తెలుసు: మారియా

ఇటు ముంబైలో షీనా హత్య కేసు విచారణలో గురువారం ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా స్వయంగా రంగంలోకి దిగారు. పోలీస్ కస్టడీలో ఉన్న ప్రధాన నిందితురాలు ఇంద్రాణిని, ఆమె భర్త పీటర్ ముఖర్జియా కుమారుడు రాహుల్‌ని రాకేశ్ స్వయంగా ఇంటరాగేట్ చేశారు. షీనా బోరాను స్వయంగా ఆమె తల్లే చంపడానికి కారణమేమిటనేది తమకు తెలుసని, అయితే కోల్‌కతాలో అరెస్టు చేసిన మూడో నిందితుడు సంజీవ్ ఖన్నా (ఇంద్రాణి రెండోభర్త) ఇంకా ముంబైకి చేరుకోలేదని, ఆయనను కూడా విచారించాకే జరిగిందేమిటో వెల్లడిస్తామని రాకేశ్ గురువారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.



అటు కోల్‌కతాలో ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాను పోలీసులు గురువారం విచారించా రు. హత్య జరిగిన తీరు మాత్రం సంజీవ్‌ఖన్నా, డ్రైవర్ ఎస్పీరాయ్ విచారణలో స్పష్టమైనట్లు సమాచారం. దీని ప్రకారం ‘షీనా హత్య జరిగిన ఏప్రిల్ 24, 2012కు ముందు రోజే సంజీవ్‌ఖన్నా కోల్‌కతా నుంచి ముంబైకి వచ్చాడు. ఏప్రిల్ 23న ఇంద్రాణి రాయ్‌గఢ్ తాలూకాలోని అటవీప్రాంతానికి వెళ్లి అక్కడ రెక్కీ నిర్వహించింది. ఏప్రిల్ 24లో ముంబైలోని ఓ హోటల్ గదిలో షీనాకు మద్యం తాగించి, తరువాత కారులోకి బలవంతంగా ఎక్కించి.. హైవేపై తీసుకెళ్తూ మార్గమధ్యంలోనే గొంతు నులిమి చంపేశారు.



ఆ తరువాత ముందురోజు తాము ఎంపిక చేసుకున్న అటవీ ప్రాంతంలో ఆమె శవాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఏప్రిల్ 25న విమానం ద్వారా సంజీవ్‌ఖన్నా తిరిగి కోల్‌కతా వెళ్లిపోయాడు.’ మరోవైపు పీటర్ కుమారుడు రాహుల్‌ను దాదాపు 12 గంటల పాటు పోలీసులు విచారించారు. షీనాది పరువు హత్యా? లేక ఆర్థిక వ్యవహారమా? అన్నది తేలాల్సి ఉంది.

 

తండ్రి స్థానంలో తాతపేరు

కూతురు షీనా బోరా బర్త్ సర్టిఫికెట్‌లో తండ్రి పేరు స్థానంలో ఇంద్రాణి ముఖర్జీ ఎవరి పేరు రాయించారో తెలుసా? తన సొంత తండ్రి పేరును. ఉపేంద్ర కుమార్ బోరా...ఇంద్రాణికి తండ్రి. అయితే మనవరాలు షీనా బర్త్ సర్టిఫికెట్లో కూడా తండ్రిగా ఈయన పేరే ఉంది. 80 ఏళ్ల ఉపేంద్ర కుమా ర్ బోరా గురువారం స్పందిస్తూ... ‘షీనా నా కూతురు కాదు, మనవరాలు’ అని చెప్పారు. సిద్ధార్థ్ దాస్(ఇంద్రాణి మొదటిభర్త) షీనా తండ్రి అని తెలిపారు. అయితే సిద్ధార్థ్ కూడా షీనా తండ్రి కాకపోవచ్చని, షిల్లాంగ్ వాసి ద్వారా ఇంద్రాణి ఆమెను కన్నదనే వార్తలపై స్పందిస్తూ... వాస్తవమేంటో తేలాలన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top