సెన్సెక్స్ రయ్.. రయ్..

సెన్సెక్స్ రయ్.. రయ్.. - Sakshi


   517 పాయింట్లు అప్

     కనిష్ట స్థాయిల్లో కొనుగోళ్ల జోరు

     అంతర్జాతీయ సానుకూల పవనాలు..

     27,976కు చేరిన సెన్సెక్స్

     151 పాయింట్ల లాభంతో 8,492కు నిఫ్టీ

     మూడు సెన్సెక్స్ షేర్లకే నష్టాలు


 

 ముడిచమురు ధరలు తగ్గడం, సానుకూలంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాల కారణంగా స్టాక్ మార్కెట్ వారం ప్రారంభంలో జోరుగా మొదలైంది. గత వారం రోజుల నష్టాల కారణంగా చాలా షేర్లు తక్కువ ధరల్లో లభిస్తున్నాయని, దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇచ్చారని, దీంతో స్టాక్ మార్కెట్ దూసుకుపోయిందని నిపుణులు పేర్కొన్నారు. అన్ని రంగాల షేర్లకు ముఖ్యంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవల కంపెనీలు, ఎఫ్‌ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో  బీఎస్‌ఈ సెన్సెక్స్ 517 పాయింట్లు ఎగసింది. ఒక రోజులో ఇంత భారీ స్థాయిలో లాభపడడం రెండు నెలల్లో సెన్సెక్స్‌కు ఇదే మొదటిసారి. ఇక నిఫ్టీ 151 పాయింట్ల లాభంతో 8,492 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రా డేలో నిఫ్టీ 8,505 పాయింట్లను తాకింది.

 

 అన్ని సూచీలు లాభాల్లోనే

 ట్రేడింగ్ ప్రారంభమే 200 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ దూకుడుగా మొదలైంది. ఇంట్రాడేలో 28,000 మార్క్‌ను దాటేసింది, చివరకు 517 పాయింట్ల (1.88 శాతం)లాభంతో 27,976 వద్ద ముగిసింది. మూడు(రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందాల్కో, టాటా పవర్) మినహా అన్ని  సెన్సెక్స్ షేర్లూ లాభాల్లోనే ముగిశాయి. అన్ని (12)రంగాల సూచీలు లాభాల బాట పట్టాయి. స్మాల్ క్యాప్, మిడ్-క్యాప్ షేర్లు కూడా బాగా లాభపడ్డాయి

 

 ఆకర్షణీయ ధరల్లో షేర్లు...

 సెన్సెక్స్ షేర్లలో గత కొన్ని ట్రేడింగ్ సెషన్లలో అమ్మకాలు బాగా జరిగాయని, దీంతో అవి ఆకర్షణీయ ధరల్లో లభిస్తున్నాయని, కొనుగోళ్ల జోరు పెరిగిందని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు. దీనికి  సానుకూలమైన అంతర్జాతీయ సంకేతాలు తోడవడంతో కొనుగోళ్లు మరింతగా పెరిగాయని వివరించారు.  గత శుక్రవారం అమెరికా టెక్నాలజీ షేర్లు లాభపడడం కూడా ప్రభావం చూపిందని బొనంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ గోయల్ చెప్పారు. ముడి చమురు ధరలు తగ్గడం, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌ఓ) లిక్విడిటీ మెరుగుపడడం, వంటి కారణాల వల్ల కూడా స్టాక్ మార్కెట్ ఎగసిందని జియోజిత్ బీఎన్‌పీ పారిబస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండ్‌మెంటల్ రీసెర్చ్) వినోద్ నాయిర్ చెప్పారు. షార్ట్ కవరింగ్ కూడా మార్కెట్ పెరుగుదలకు దోహదపడిందని జియోజిత్ బీఎన్‌పీ పారబస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ అలెక్స్ మాధ్యూస్ చెప్పారు.

 

 ఒకటి తగ్గితే మూడు పెరిగాయ్

 ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధానం వచ్చే వారం వెలువడనున్న నేపథ్యంలో బ్యాంక్ షేర్లు పెరిగాయని నిపుణులంటున్నారు.

 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు 1-3 శాతం రేంజ్‌లో పెరిగాయి.

 

 స్పెక్ట్రమ్ వేలానికి భారీగా బిడ్‌లు దాఖలు చేసినప్పటికీ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ షేర్లను కొనుగోలు చేయవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ పేర్కొనడంతో ఈ షేర్లు పెరిగాయి.


 టారిఫ్‌లు పెంచనున్నదన్న వార్తలు కూడా దీనికి తోడవడంతో ఐడియా సెల్యులార్ 6.2% లాభపడి రూ.183 వద్ద ముగిసింది.  భారతీ ఎయిర్‌టెల్ 3.5 శాతం లాభంతో రూ.389కు చేరింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా పెరిగిన  షేర్ ఇదే.

 

 హెచ్‌డీఎఫ్‌సీ 3.5 శాతం, ఓఎన్‌జీసీ 3.4 శాతం, ఐటీసీ 3.4 శాతం, కోల్ ఇండియా 3.2,  భెల్ 2.6 శాతం, విప్రో 1.9 శాతం చొప్పున పెరిగాయి.


 హిందాల్కో, టెక్ మహీంద్రాలు 2-3 శాతం రేంజ్‌లో తగ్గాయి.

 బీఎస్‌ఈలో ఒక్క షేర్ నష్టపోతే, మూడు షేర్లు లాభపడ్డాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,552 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈలో రూ. 14,148 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,42,954కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.240 కోట్ల నికర అమ్మకాలు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.652 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.

 

 అంతర్జాతీయ మార్కెట్లదీ అదే దారి

 యూరేషియా, ఆఫ్రికా దేశాలతో ఆర్థిక బంధాలను, వాణిజ్యాన్ని బలవత్తరం చేసుకునే దిశలో భాగంగా చైనా కొత్త సిల్క్ రోడ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. అంతేకాకుండా మందకొడిగా ఉన్న వృద్ధి జోరు పెంచడానికి వడ్డీరేట్లను తగ్గించనున్నామని చైనా సంకేతాలివ్వడంతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు కూడా కదం తొక్కాయి. షాంగై 2.6 శాతం లాభపడగా, హాంగ్‌సెంగ్ 369 పాయింట్లు లాభపడింది. చైనా సంకేతాలతో యూరప్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అమెరికా మార్కెట్లు అప్‌ట్రెండ్‌లో కొనసాగుతున్నాయి.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top