తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలు ఒక్కటైన వేళ


* శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరుపై రాజ్యసభలో కొనసాగిన ఆందోళన



సాక్షి, న్యూఢిల్లీ: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు పేరు పెట్టడంపై రాజ్యసభలో మూడో రోజూ ఆందోళన కొనసాగింది. గురువారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యుడు వి.హనుమంతరావు మాట్లాడుతూ తాను విమానాశ్రయ పేరు మార్పు అంశంపై నోటీసు ఇచ్చానని, మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. సభాపతి స్థానంలో కూర్చున్న ఉప సభాపతి కురియన్ తొలుత నిరాకరించినా, వీహెచ్ పదే పదే కోరడంతో అనుమతించారు.



‘అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ టర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును పెట్టారు. ఆరేడేళ్ల తరువాత వాళ్లు ఈ పనికి దిగారు. వాళ్లు రాజకీయ ప్రయోజనాలను కాంక్షించే ఈ చర్యకు దిగారు..’ అని వివరించబోతుండగా డిప్యూటీ చైర్మన్ కల్పించుకుని ‘నేను చెప్పేది ఒకసారి వినండి’ అంటూ పలుమార్లు వీహెచ్‌కు సూచించారు. ‘ముందురోజు ఆర్థిక మంత్రి దీనిపై వివరణ ఇచ్చారు. మీరు ఇప్పుడు జీరో అవర్‌లో తిరిగి చర్చించలేరు. అవసరమైతే మీరు మరో నోటీసుతో రండి’ అని కోరారు.



అయినప్పటికీ వీహెచ్ వినలేదు. ఆయనకు తోడు ఎంపీలు రాపోలు ఆనందభాస్కర్, ఎం.ఎ.ఖాన్ తదితర తెలంగాణ ఎంపీలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలు కె.చిరంజీవి,  కె.వి.పి. రామచంద్రరావు, జేడీ శీలం, ఇతర రాష్ట్రాల ఎంపీలు సైతం పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. పేరును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. దీంతో 11.07 గంటలకు పది నిమిషాలపాటు వాయిదావేశారు.



తిరిగి సభ ప్రారంభమైన తరువాత కూడా ఆందోళన కొనసాగింది. ఈ సమయంలోనే టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు మాట్లాడుతూ కేంద్రం ప్రజల సెంటిమెంట్లను గౌరవించాలని కోరారు.  12 గంటలకు ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే మళ్లీ ఆందోళనను కొనసాగించారు. సభాకార్యకలాపాలకు అడ్డుతగిలారు. దీంతో సభను 12.30 గంటలకు వాయిదా వేశారు. తిరిగి రెండు గంటలకు సభ ప్రారంభమై ప్రశాంతంగా కొనసాగింది.



కాగా సాయంత్రం ఇదే అంశమై ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి స్పెషల్ మెన్షన్ కింద మాట్లాడుతూ తక్షణం శంషాబాద్ ఎయిర్‌పోర్టు దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top