ఒడిదుడుకుల వారం!

ఒడిదుడుకుల వారం!


 ట్రేడింగ్ నాలుగు రోజులే

 ఐసీఐసీఐ,  హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ, భారతీఎయిర్‌టెల్ ఫలితాలపై చూపు

 ప్రభావం చూపనున్న ఫెడ్ మీటింగ్

 జీఎస్‌టీ బిల్లు, భూసేకరణ బిల్లుపై దృష్టి


 

 న్యూఢిల్లీ: ఏప్రిల్ నెల డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనున్నందున, ఈ వారం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనుకావొచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా వచ్చే శుక్రవారం ఎక్స్ఛేజీలకు సెలవు అయినందున ఈ వారం ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితం కానుంది. ఈ గురువారంతో ఏప్రిల్ నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులు ముగుస్తాయి. పరిమిత ట్రేడింగ్ రోజులకు తోడు, కాంట్రాక్టుల ముగింపు ఫలితంగా మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులుంటాయని నిపుణులు హెచ్చరించారు. మరోవైపు మారుతి, ఐసీఐసీఐ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులర్, సేసా స్టెరిలైట్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీలు క్యూ4 ఆర్థిక ఫలితాలు ఈ వారమే వెల్లడించనున్నాయి.

 

  ఈ దిగ్గజ కంపెనీల షేర్లతో పాటు మే 1 ఆటోమొబైల్ కంపెనీల అమ్మకపు గణాంకాలు వెల్లడికానున్నందున ఈ షేర్లపై ఇన్వెస్టర్ల దృష్టి వుంటుందని రిలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. మొత్తంమీద రానున్న ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ సూచీలు మరింత క్షీణించేరీతిలో ప్రస్తుత సెంటిమెంట్ వుందని ఆయన అన్నారు. పన్ను నోటీసుల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తుందని వివరించారు.బేర్స్, బుల్స్ మధ్య ఈ వారం టగ్‌ఆఫ్‌వార్ నడుస్తుందని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ అగర్వాల్ అంచనావేశారు. కార్పొరేట్ ఫలితాల ఆధారంగా ఆయా షేర్లు హెచ్చుతగ్గులకు లోనవుతాయని ఆయన అన్నారు.

 

  అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మార్కెట్స్ కమిటీ సమావేశం ఏప్రిల్ 28,29 తేదీల్లో జరుగుతుందని, అంతర్జాతీయంగా ఈ సమావేశ ప్రభావం మార్కెట్లపై వుంటుందని ఆయన చెప్పారు. జీఎస్‌టీ బిల్లు, భూసేకరణ బిల్లులను పార్లమెంటులో ఆమోదం పొందుతాయా లేదా అనే అంశంపై దేశీ ఇన్వెస్టర్ల దృష్టివుంటుందన్న అభిప్రాయాన్ని క్యాపిటల్ వయా గ్లోబల్‌రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా వ్యక్తంచేశారు. ట్రేడింగ్ టెక్నికల్స్ ప్రకారం ఈ వారం కొంతవరకూ కరెక్షన్ వుండవచ్చని, సెన్సెక్స్ 26,750-27,400 మధ్య ట్రేడ్‌కావొచ్చని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ ఛౌదరి అంచనావేశారు.

 

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top