దగాపడ్డ దళితుల కోసం ఇదో కొత్త వెలుగు

దగాపడ్డ దళితుల కోసం ఇదో కొత్త వెలుగు - Sakshi


ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టంపై సీఎం కేసీఆర్‌

- వంద శాతం అమలు చేసి తీరుతాం

- బడ్జెట్‌ ప్రతిపాదనల కంటే ఎక్కువే ఖర్చు చేస్తం

- ఆకలి ఉన్న చోటనే అరుపులుంటయ్‌.. ఆ తీరు ఇకనైనా మారాలి

- అమలు తీరును పర్యవేక్షించేందుకు దళిత ప్రజాప్రతినిధులతో కమిటీలు

- జిల్లా స్థాయిలో ప్రతి త్రైమాసికానికీ మదింపు

- అన్ని పార్టీల దళిత ప్రజాప్రతినిధులతో చర్చించే నిబంధనలుSరూపొందిస్తామన్న సీఎం

- ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి బిల్లుకు శాసనసభ ఆమోదం




సాక్షి, హైదరాబాద్‌

‘‘ఏదైనా ఓ ఊరికి వెళ్లి.. అక్కడ నిరుపేదలు ఎవరని అడిగితే దళితులనే చూపిస్తరు. ఈ పరిస్థితి ఇక ముందు ఉండొద్దు. అందుకే ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రత్యేక నిధి కేటాయిస్తూ చారిత్రక చట్టాన్ని తీసుకువస్తున్నం. దానిని నూరు శాతం అమలు చేసి చూపిస్తం. వాటికి బడ్జెట్‌లో ప్రతిపాదించినదానికంటే పది రూపాయలు ఎక్కువే ఖర్చు పెడ్తం..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.



ఎస్సీ, ఎస్టీల ఉప ప్రణాళికల స్థానంలో ప్రవేశపెడుతున్న ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం (ఎస్‌డీఎఫ్‌) బిల్లుకు శుక్రవారం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అంతకుముందు ఈ బిల్లుపై జరిగిన చర్చకు సీఎం కేసీఆర్‌ సమాధానమిచ్చారు.



చరిత్రే.. కాదనను

ఈ ఎస్‌డీఎఫ్‌ చట్టంలో కొత్తదనమేమీ లేదని, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన సబ్‌ప్లాన్‌చట్టానికి మూడు మార్పులు చేసి కొత్త చట్టంగా తెస్తున్నారన్న కాంగ్రెస్‌ విమర్శల పట్ల సీఎం కేసీఆర్‌ దీటుగా సమాధానమిచ్చారు. ‘‘చరిత్రను ఎవరూ తుడిచేయలేరు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రత్యేక కాంపోనెంట్‌గా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను పెట్టారు. దాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేసింది. అది చరిత్రే.. కాదనను. కానీ దానికంటే మెరుగైన అంశాలతో ఇప్పుడు మేం చట్టం చేస్తున్నాం..’’అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ తొలుత చట్టం చేసిందన్న విషయం చిరస్థాయిగా ఉంటుందని కదాని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ మండల వ్యవస్థను ప్రవేశపెట్టారని.. ఇప్పుడు ఒక్క మండలాన్నీ తగ్గించలేం, అవసరమైతే పెంచుకుంటాం కదా అని ఉదహరించారు. పాత చట్టంలో 109 మార్పుల (అన్ని పొరపాట్లు ఉన్నట్టు అంతకుముందు ఉప ముఖ్యమంత్రి కడియం ప్రస్తావించారు)తో అన్ని సవరణలు చేయాల్సి ఉందన్నారు. ఎస్‌డీఎఫ్‌ చట్టం చేసే ముందు ఎంతోమంది దళిత మేధావులతో చర్చించి సూచనలు తీసుకున్నట్లు వెల్లడించారు.



సాధికారత కోసం కృషి చేస్తున్నాం..

దళితులకు మంచి అవకాశాలు కల్పిస్తే వారు గొప్పగా ఎదుగుతారనేందుకు ఇటీవల ప్రభుత్వం తీసుకున్న చర్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. దళితులకు గ్రీన్‌హౌస్, మైక్రో ఇరిగేషన్లలో వంద శాతం సబ్సిడీ ఇస్తున్నామని.. ఇటీవల నర్సాపూర్‌ సమీపంలోని ఇబ్రహీంబాగ్‌కు చెందిన శ్రీనివాస్‌ అనే దళితరైతు 100 శాతం సబ్సిడీ పథకాన్ని వినియోగించుకుని ఒక్క ఏడాది సాగులో రూ.10 లక్షల విలువైన పంట పండించారని తెలిపారు.‘‘ఇంట్లో బలహీనంగా ఉన్న వ్యక్తి ఆరోగ్యంగా మారేందుకు టానిక్‌ తాగిస్తాం.. మనం తినేదానికంటే ఓ బుక్క ఎక్కువ పెడతాం. ముస్లింలదీ అదే పరిస్థితి. వారి కోసం ప్రత్యేక చర్యలు ఉండాలి. ఈ సమాజంలో దళితులకూ అదే చేయాలి. ఆకలి ఉన్న చోటనే అరుపులుంటయి.. సమాజంలో ఇది అశాంతికి కారణమవుతుంది. ఇప్పుడా పరిస్థితిని మార్చాలి..’’అని పేర్కొన్నారు. తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బ్యాంకు లింకేజీ పథకాల్లోని నిబంధనలతో దళితులు వాటిని వినియోగించుకోలేకపోవటాన్ని గుర్తించానని, దాన్ని మార్చాలని అప్పటి నుంచి అనుకున్నానని చెప్పారు. టీఎస్‌ ప్రైడ్‌ పేరుతో దళితులే కాంట్రాక్టర్లుగా ఎదిగేందుకు న్యాక్‌ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నామని, అవసరమైతే వారికి రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించేందుకూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు.



అన్ని పార్టీల దళిత సభ్యులతో చర్చిస్తాం..

ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టాన్ని కఠినంగా అమలు చేసే లక్ష్యంతో ఉన్నామని కేసీఆర్‌ చెప్పారు. ఈ మేరకు అవసరమైన మార్గదర్శకాలు, నిబంధనలు రూపొందించే ముందు అన్ని పార్టీలకు చెందిన దళిత సభ్యులతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. చట్టం అమల్లోకి వచ్చాక.. నిధుల వ్యయంపై ప్రతి త్రైమాసికంలో సమీక్షిస్తామని.. జిల్లా స్థాయిలో ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులతో మానిటరింగ్‌ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. శాసనసభ స్థాయిలో ఏర్పాటయ్యే కమిటీ ఆరు నెలలకోసారి నివేదికను పరిశీలిస్తుందన్నారు. రైతుల రుణమాఫీ అయిపోతున్నందున వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా రూ.4 వేల కోట్ల ఆదా ఉంటుందని.. అందులో నుంచి ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కొంతమొత్తం కేటాయించే అవకాశం కలుగుతుందని ప్రకటించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top