'సత్యం' కేసులో తుదితీర్పు ఆగస్టు 11కి వాయిదా

'సత్యం' కేసులో తుదితీర్పు ఆగస్టు 11కి వాయిదా - Sakshi


హైదరాబాద్ : సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తుది తీర్పు వెల్లడించే తేదీని నాంపల్లి సీబీఐ కోర్టు మరోసారి వాయిదా వేసింది. కేసు తుది తీర్పును న్యాయస్థానం ఆగస్ట్ 11వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ కేసు విచారణకు రామలింగరాజుతో పాటు ఇతర నిందితులు హాజరయ్యారు. కాగా సత్యం కంపెనీలో రూ.9 వేల కోట్ల కుంభకోణం కేసులో సీబీఐ రామలింగరాజుపై అభియోగాలు మోపిన విషయం తెలిసిందే.



కోట్లాది రూపాయల కుంభకోణం కేసులో సత్యం కంప్యూటర్ సర్వీసెస్ పై గత ఐదున్నర సంవత్సరాలు విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ కేసులో విచారణ ఇప్పటికే పూర్తయింది. తీర్పును వెల్లడించడానికి 216 మంది సాక్ష్యులను విచారించి, 3038 డాక్యుమెంట్లను పరిశీలించారు. 2009లో జనవరి 7 తేదిన ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.



కోట్లాది రూపాయలను సర్దుబాటు చేసేందుకు సత్యం కంపెనీకి చెందిన ఖాతాలను తారుమారు చేశానని మీడియా ముందుకు వచ్చి కంపెనీ మాజీ చైర్మన్ రామలింగరాజు ఒప్పుకోవడం ప్రపంచ కార్పోరేట్ వ్యవస్థ నివ్వెరపోయిన సంగతి తెలిసిందే. కాగా మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో రామలింగరాజు కోర్టుకు హాజరు అయ్యారు.



మరోవైపు సత్యం కంప్యూటర్స్ కేసులో స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఎట్టకేలకు కొరడా ఝుళిపించింది. సుమారు ఐదున్నరేళ్ల సుదీర్ఘ దర్యాప్తు అనంతరం ఆ కంపెనీ వ్యవస్థాపకుడు బి. రామలింగరాజు, మరో నలుగురిని స్టాక్ మార్కెట్లలో ఎలాంటి లావాదేవీలు జరపకుండా 14 ఏళ్లపాటు నిషేధం విధిస్తూ ఇటీవలే ఆదేశాలు జారీచేసింది. అంతేకాకుండా... ఈ స్కామ్‌లో చట్టవిరుద్ధంగా ఆర్జించిన రూ.1,849 కోట్ల మొత్తాన్ని వడ్డీతోసహా చెల్లించాలని స్పష్టం చేసింది.

 


(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top