శశికి టోపీ..పన్నీరుకు స్తంభం

శశికి టోపీ..పన్నీరుకు స్తంభం


ఎన్నికల కమిషన్‌ నిర్ణయం

రెండాకుల గుర్తు రద్దు

ఏఐఏడీఎంకే అమ్మ’ పేరుతో శశికళ వర్గం పోటీ

ఏఐఏడీఎంకే పురచ్చి తలైవీ అమ్మ’  పేరుతో పన్నీరువర్గం బరిలోకి




న్యూఢిల్లీ:

అన్నాడీఎంకే అధికార చిహ్నం ‘రెండాకుల’పై నెలకొన్న వివాదానికి ఎన్నికల సంఘం తాత్కాలిక పరిష్కారం కనుగొంది. ప్రస్తుతానికి ఈ గుర్తు ఏ ఒక్క వర్గానికీ కేటాయించకుండా, శశికళ పార్టీకి టోపీ, పన్నీరు పార్టీకి విద్యుత్‌ స్తంభం చిహ్నాలను కేటాయించింది.  తమదే అసలైన అన్నాడీఎంకే పార్టీ అని, తమకే ఆ పార్టీ గుర్తును కేటాయించాలంటూ శశికళ, పన్నీర్‌ సెల్వం వర్గాలు కోరడంతో తాత్కాలికంగా ఈ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం స్తంభింపజేసింది. దివంగత సీఎం జయలలిత మృతితో ఆమె నియోజకవర్గం ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల్లో కొత్త గుర్తును ఎంచుకోవాలంటూ ఇరువర్గాలకు ఈసీ సూచించింది. ఈ నేపథ్యంలో శశికళ వర్గం కొత్త పార్టీ పేరును తెరపైకి తెచ్చింది. ‘ఏఐఏడీఎంకే అమ్మ’ పేరుతో ఉప ఎన్నికల్లో తాము పాల్గొంటామని శశికళ వర్గం ఈసీకి తెలిపింది. 


తమ పార్టీకి ఆటో, క్యాప్, బ్యాట్‌లలో ఒకదానిని గుర్తుగా కేటాయించాలని  కోరింది. దీంతో ఆ పార్టీ కొత్త పేరును ఆమోదించి.. టోపీ గుర్తును ఈసీ కేటాయించింది. ఇక పన్నీర్‌ సెల్వం వర్గం ‘ఏఐఏడీఎంకే పురచ్చి తలైవీ అమ్మ’ పేరుతో ఆర్కే నగర్‌ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆ వర్గానికి ‘విద్యుత్‌ స్తంభం’ గుర్తును ఈసీ కేటాయించింది. అమ్మ జయలలిత మరణంతో అన్నాడీఎంకేలో వచ్చిన చీలికలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ శిబిరం చేతికి చిక్కడంతో, కనీసం పార్టీని, చిహ్నాన్ని కైవసం చేసుకునేందుకు మాజీ సీఎం పన్నీరుసెల్వం తీవ్రంగానే వ్యూహలు రచిస్తున్నారు.


ఈ క్రమంలోనే తమదే అసలైన అన్నాడీఎంకే అంటూ పన్నీర్‌ వర్గం ఈసీని ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలు, అభిప్రాయాలు విన్న ఈసీ.. తాత్కాలికంగా అన్నాడీఎంకే అధికారిక గుర్తు రెండాకులను స్తంభింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే, పాత గుర్తు రెండాకులు తమకే వస్తుందని అధికార పార్టీ సీనియర్‌ నేత, శశికళ వర్గానికి చెందిన లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ ఎం.తంబిదురై అన్నారు.  



నామినేషన్‌ దాఖలు చేసిన అభ్యర్థులు

 ఆర్కేనగర్‌ ఉప ఎన్నికకు శశికళ వర్గం, పన్నీర్‌ సెల్వం వర్గం అభ్యర్థులు గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో శశికళ వర్గం నుంచి అన్నాడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్, పన్నీర్‌ వర్గం నుంచి మధుసూధనన్‌ పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ తమ నామినేషన్లను సమర్పించారు. మరోవైపు ఈ ఎన్నికలకు పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు, బీజేపీ అభ్యర్థి గంగై అమరన్‌ కూడా నామినేషన్‌ వేశారు. ఇదిలా ఉంటే, తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలపై తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ స్పందించారు. తాను ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని ప్రకటించారు.  



‘అమ్మను నువ్వే చంపావ్‌!’

అన్నాడీఎంకే నాయకురాలు వీకే శశికళను తిడుతూ బెంగళూరు జైలుకు ఉత్తరాలు  పోటెత్తున్నాయి. జయలలిత మరణానికి కారణమైన శశికళ నాశనమైపోతుందని శపిస్తూ పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారానికి 100కు పైగా ఉత్తరాలు వచ్చినట్టు జైలు అధికార వర్గాలు వెల్లడించాయి. ‘శశికళ, సెంట్రల్‌ జైలు, పరప్పణ అగ్రహార, బెంగళూరు–560100’  చిరునామాతో తమిళంలో ఈ లేఖలు వచ్చాయి. ‘జయలలిత హత్యకు శశికళ కుట్ర చేశారు. జయ చనిపోవడానికి అనారోగ్యం కారణం కాదు. ప్రణాళిక ప్రకారమే ఆమెను హత్య చేశారు’ అని ఉత్తరాలు రాసినవారు ఆరోపించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top