రూ.30,571 కోట్ల ప్యాకేజీ ఇవ్వండి

రూ.30,571 కోట్ల ప్యాకేజీ ఇవ్వండి - Sakshi


నీతి ఆయోగ్ చైర్మన్‌కు సీఎం కేసీఆర్ లేఖ

- మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్‌కు నిధులివ్వండి

- నాలుగేళ్ల గడువుతో ప్రత్యేక ప్యాకేజీ కావాలి

- ఎఫ్‌ఆర్‌బీఎం రుణపరిమితి

- సడలించాలని విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.30,571 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులకు 2015-2019 వరకు వర్తించేలా ఆర్థిక సాయం అందించాలని కోరింది. ఆదిలాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఈ ప్యాకేజీ కోరింది. గతేడాది డిసెంబర్‌లోనే ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పంపింది. జూన్‌లో రాష్ట్రానికి వచ్చిన నీతి అయోగ్ బృందానికి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.



రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఆర్థిక సంఘం ప్రకటించడంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో భారీగా కోత పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాల్లో చేపట్టే కార్యక్రమాలకు నిర్దిష్టంగా ప్రతిపాదనలు పంపించాలని నీతిఆయోగ్ బృందం సభ్యులు అధికారులకు సూచించారు. దీంతో ఆరు జిల్లాల్లో అమలు చేస్తున్న వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ కార్యక్రమాలకు ఎన్ని నిధులు కావాలో ప్రతిపాదనలు తయారుచేసి కేంద్రానికి పంపించారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తాజాగా నీతిఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగరియాకు గుర్తుచేశారు. గతంలో రాసిన లేఖల ప్రతి, ప్యాకేజీ ప్రతిపాదనలు మరోసారి పంపించారు.

 

మీ దృష్టికి తీసుకొస్తున్నాం..


అప్పులు తెచ్చుకునేందుకు వీలుగా ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి నిబంధనలు సడలించాలని పనగరియకు సీఎం కేసీఆర్ లేఖ రాశారు. 14 వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం జీఎస్‌డీపీలో ప్రస్తుతం 3 శాతం ఉన్న ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3.5 శాతానికి పెంచాలని కోరారు. అప్పు- జీఎస్‌డీపీ నిష్పత్తి జీఎస్‌డీపీలో 25 శాతం మించకుండా ఉండటం, రెవెన్యూ ఆదాయంలో పది శాతానికి మించకుండా వడ్డీ చెల్లింపులు ఉండటం,  మిగులు రెవెన్యూ ఉండటం వంటి నిబంధనలు వర్తించే రాష్ట్రాలకు వార్షిక అప్పుల పరిమితి మరో 0.5 శాతం మేరకు వెసులుబాటు కల్పించాలన్న 14వ ఆర్థిక సంఘం సిఫారసులను గుర్తుచేశారు. కేంద్ర నుంచి వచ్చే పన్నుల వాటా తగ్గినందున ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితిని పెంచాలని కోరుతూ ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కోరినట్లు ప్రస్తావించారు. రుణ సేకరణకు వెసులుబాటు కల్పిస్తే మౌలిక వసతులకు పెట్టుబడులు సమకూరుతాయని, రాష్ట్రాలు ఆర్థికంగా వృద్ధి చెందేందుకు దోహదపడుతాయని పేర్కొన్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top